తెలుగులో తొలి పాన్ ఇండియా స్టార్ అతగాడే!

Mon Aug 15 2022 08:00:01 GMT+0530 (IST)

First Pan India star from Telugu

ఒకప్పుడు భారీ సినిమా తీయాలంటే బాలీవుడ్ వారు తీయాల్సిందే. బహు భాషల్లో ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వెళ్లాలంటే అంది బాలీవుడ్ సినిమా అయ్యుండాల్సిందే.  కానీ ఈ మధ్య కాలంలో పరిస్థితులు మారిపోయాయి. సౌత్ ఇండియాలోనే అతి పెద్ద చిత్రపరిశ్రమగా టాలీవుడ్ ఎదిగింది. సంక్రాంతి ముగ్గులా కనిపించే తెలుగు సినిమా ఈ రోజున ప్రపంచపటాన్ని ఆక్రమించింది. ప్రభాస్ ... ఎన్టీఆర్ .. చరణ్ .. అల్లు అర్జున్ .. రానా వంటివారు పాన్ ఇండియా స్టార్స్ గా చక్రం తిప్పేస్తున్నారు. వీరికి ముందు పాన్ ఇండియా స్థాయిలో తమ ప్రభావం చూపించిన పాత తరం హీరోలు ఎవరైనా ఉన్నారా? అనే సందేహం ఇక్కడే కలుగుతుంది. తెలుగు నుంచి అలాంటి పాన్ ఇండియా స్టార్ ఒకరున్నారు .. అతని పేరే పైడి జైరాజ్. 1909  సెప్టెంబర్ 28వ తేదీన కరీంనగర్ లో ఆయన జన్మించారు. మూకీల చివరిలో .. టాకీల మొదట్లో ఆయన తెరపై సందడి చేయడం వలన ఈ తరం ప్రేక్షకులకు ఆయన తెలియదు.  తెలుగువాడైనప్పటికీ  తెలుగు సినిమాలు చేయకపోవడం వలన మనకి పాత సినిమాల్లో ఆయన ఎక్కడా తగల్లేదు. సినిమా ఇండస్ట్రీ అనేది మద్రాసు .. బొంబాయి .. కలకత్తాల చుట్టూ తిరుగుతున్న సమయంలో ఆయన ఆ దిశగా అడుగులు వేశారు.  

జైరాజ్ మంచి దేహ ధారుడ్యం కలిగినవారు కావడం వలన ముందుగా ఆయన కొన్ని సినిమాలకి ఫైట్ మాస్టర్ గా పనిచేశారు. ఆ తరువాత  హీరోగా నిలదొక్కుకున్నారు. మూకీలలో ఆయన  ఫస్టు మూవీ 'రసిలీ రాణి' .. టాకీలలో తొలి సినిమా 'షికారీ'. సాంఘిక .. జానపద .. చారిత్రక .. యాక్షన్ సినిమాలలో జైరాజ్ చెలరేగిపోయారు. అప్పట్లోనే గుర్రపుస్వారి .. కత్తి యుద్ధంలో ఆరితేరిన ఆయనను తొలి యాక్షన్ హీరోగా చెప్పుకున్నారు. 1960లలోనే తొలిసారిగా ప్రేక్షకులకు 'సూపర్ మేన్' ను పరిచయం చేసింది ఆయనే.

నర్గీస్ ... మీనా కుమారి .. మధుబాల .. గీతాబాలి .. దేవికారాణి ఆయన సరసన కథానాయికలుగా మెప్పించారు. పృథ్వీరాజ్ కపూర్ .. రాజ్ కపూర్  .. అశోక్ కుమార్ వంటి స్టార్ లతో కలిసి ఆయన నటించారు. హిందీ .. ఉర్దూ .. ఇంగ్లిష్ .. మరాఠీ .. గుజరాతి భాషలలో కలుపుకుని 300 వరకూ  సినిమాలు చేసిన ఆయన చివరివరకూ  తెలుగు సినిమా చేయకపోవడం ఆశ్చర్యం. చిత్తూరు నాగయ్యతో కలిసి ఒక సినిమాలో చేసే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే నాగయ్య చనిపోవడంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. వివిధ భాషల్లోని ప్రేక్షకులను ఆకట్టుకున్న  పైడి జైరాజ్ 1980లో 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డును అందుకున్నారు. ఆగస్టు 11 .. 2000లలో ముంబైలో కన్నుమూశారు.