మూవీ రివ్యూ:‘ఫిదా’

Fri Jul 21 2017 15:06:35 GMT+0530 (IST)

Fidaa Review

చిత్రం :‘ఫిదా’
 
నటీనటులు: వరుణ్ తేజ్ - సాయి పల్లవి - సాయిచంద్ - రాజా - సత్యం రాజేష్ - హర్షవర్ధన్ రాణె - గీతా భాస్కర్  - మనీషా తదితరులు
సంగీతం: శక్తి కాంత్
ఛాయాగ్రహణం: విజయ్ సి.కుమార్
నిర్మాత: దిల్ రాజు
రచన - దర్శకత్వం: శేఖర్ కమ్ములఆనంద్.. గోదావరి.. హ్యాపీ డేస్ లాంటి సినిమాలతో తెలుగు సినిమాల్లోకి ఒక తాజాదనం తీసుకొచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ముల. ఐతే ఆ తర్వాత కమ్ముల దారి తప్పాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.. అనామిక లాంటి సినిమాలతో నిరాశ పరిచాడు. ఐతే ఈ రెండు సినిమాల తర్వాత కమ్ముల చాలా విరామం తీసుకున్న కమ్ముల.. ఎట్టకేలకు ‘ఫిదా’తో మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి ఈ సినిమాతో ‘కమ్ముల ఈజ్ బ్యాక్’ అనిపించాడో లేదో చూద్దాం పదండి.

కథ:

అమెరికాలో మెడిసిన్ చదువుతున్న వరుణ్ (వరుణ్ తేజ్) తన అన్నయ్య పెళ్లి చూపుల కోసం తెలంగాణలోని ఓ పల్లెటూరికి వస్తాడు. పెళ్లిచూపుల్లో అమ్మాయి నచ్చుతుంది. వెంటనే పెళ్లికి సన్నాహాలు మొదలవుతాయి. ఈ లోపు తనకు కాబోయే వదిన చెల్లెలైన భానుమతి (సాయిపల్లవి)తో వరుణ్ కు స్నేహం కుదురుతుంది. పెళ్లయ్యే లోపు వరుణ్ భానుకి బాగా నచ్చేస్తాడు. కానీ తన ప్రేమను చెప్పబోయే లోపే వరుణ్ కు తన మీద ఆసక్తి లేదేమో అన్న అభిప్రాయంతో వెనక్కి తగ్గుతుంది భాను. మరి ఇంతకీ వరుణ్ మనసులో ఏముంది? అన్నయ్య పెళ్లి తర్వాత భానుమతికి దూరమయ్యాక అతడి జీవితం ఎలా సాగింది? ఇంతకీ తన ప్రేమను భానుమతి చెప్పిందా లేదా? వీళ్లిద్దరి జీవితాలు చివరికి ఎలాంటి మలుపు తీసుకున్నాయి..? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెరమీదే తెలుసుకోవాలి.

కథనం - విశ్లేషణ:

మన చుట్టూ కనిపించే వాతావరణం.. మనం చూసే మనుషులు.. మనం మాట్లాడుకునే మాటలు.. మనం ఫీలయ్యే ప్రేమకథలు.. మనం అనుభూతి చెందే ఎమోషన్లు.. అదీ శేఖర్ కమ్ముల సినిమాలంటే. మనం మామూలుగా చూసే జీవితాల్నే.. అందమైన కోణంలో చూడటం.. అంతే అందంగా తెరకెక్కించడమే శేఖర్ ప్రత్యేకత. ఆనంద్.. గోదావరి.. హ్యాపీడేస్ సినిమాల్ని అలాగే అందంగా తెరకెక్కించాడు. కానీ ఆ తర్వాత శేఖర్ ముద్ర పోయింది. అతడి అడుగులు తడబడ్డాయి. ఐతే ఇప్పుడు ‘ఫిదా’తో శేఖర్ కమ్ముల తనను తాను మళ్లీ ఆవిష్కరించుకున్నాడు.

‘ఫిదా’లో మళ్లీ వింటేజ్ కమ్ములను చూస్తాం. అతడి పాత్రలతో బలంగా కనెక్టయిపోతాం. కమ్ముల మార్కు సెన్సాఫ్ హ్యూమర్ తో సాగే సన్నివేశాలకు నవ్వుకుంటాం. ప్రేమను ఆస్వాదిస్తాం.. భావోద్వేగాల్ని అనుభూతి చెందుతాం. మధ్యలో కమ్ముల మీద నమ్మకం కోల్పోయిన వాళ్లందరూ కచ్చితంగా మళ్లీ అతడి అభిమానులుగా మారుతారు ‘ఫిదా’తో. కాకపోతే సమస్య ఏంటంటే.. కమ్ముల ఓ దశ వరకే తన బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వగలిగాడు. తొలి గంటలో వినోదంలో.. ప్రేమలో.. భావోద్వేగాల్లో ముంచెత్తేసి.. ఆ తర్వాత ఏదో టైంపాస్ వ్యవహారంలా బండి లాగించేశాడు. ఎప్పట్లాగే మరోసారి కథ విషయంలో అంత ఆసక్తేమీ రేకెత్తించని కమ్ముల.. ద్వితీయార్ధంలో ఏ సర్ప్రైజులూ లేకుండా ప్రేక్షకుడి అంచనాలకు తగ్గట్లే మామూలుగా కథను నడిపించేయడం.. మరీ నెమ్మదిగా.. కొన్ని చోట్ల భారంగా కథనాన్ని తీసుకెళ్లడం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ ప్రతికూలతల్ని పక్కన పెడితే ‘ఫిదా’ మంచి ఫీల్ ఉన్న.. ఆహ్లాదం పంచే.. బలమైన ఫ్యామిలీ ఎమోషన్లు కూడా ముడిపడిన అందమైన ప్రేమకథ అనడం సందేహం లేదు.

తెలంగాణ యాసను విలనీకి వాడుకోవడం చూశాం.. లేదా చిన్న చిన్న కామెడీ క్యారెక్టర్ల కోసం ఉపయోగించడమూ చూశాం. ఐతే అందులో ఓ హీరోయిన్ పాత్రకు పూర్తి స్థాయి తెలంగాణ యాస పెట్టి వినోదం పండించడం అన్నది బహుశా తొలిసారి ‘ఫిదా’తోనే జరిగిందేమో. ఈ సినిమా ప్రత్యేకతే అది. ‘ఫిదా’కు ప్రధాన బలమైన హీరోయిన్ పాత్రను తెలంగాణ పల్లెటూరి అమ్మాయిగా చూపించి.. నేటివ్ తెలంగాణ యాసతో ఆ పాత్రతో డైలాగులు చెప్పించడమే ఈ సినిమాకు ప్రత్యేకతను తీసుకొచ్చింది. ‘ఆనంద్’లో రూప తరహాలో బలంగా హీరోయిన్ పాత్రను తీర్చిదిద్దుకున్నాడు కమ్ముల. మామూలుగానే టిపికల్ గా అనిపించే పాత్ర.. పైగా దానికి తెలంగాణ యాస పెట్టడం.. అందులోనూ సాయి పల్లవి లాంటి మంచి పెర్ఫామర్ తో ఈ పాత్ర చేయడంతో భానుమతి పాత్ర చాలా ప్రత్యేకంగా తయారైంది. ‘ఫిదా’లో ఆద్యంతం ప్రేక్షకుల ఆసక్తిని నిలిపి ఉంచేది.. వాళ్లను ఎంటర్టైన్ చేసేది.. వారిలో భావోద్వేగాల్ని తట్టిలేపేది.. అన్నీ కూడా హీరోయిన్ పాత్రే. బహుశా ఈ పాత్ర లేకుంటే ‘ఫిదా’ చాలా మామూలుగా అనిపించేదేమో కూడా.

హీరో తనకేదో సలహా ఇస్తే.. ‘‘పైసల్లేవు..’’ అంటుంది హీరోయిన్. పైసలేంటి అని అతనడిగితే.. ‘‘ఫుకట్ల నేనేదీ తీసుకోను’’ అంటుంది. సినిమాలో ఈ సీన్ టైమింగ్.. సాయి పల్లవి డైలాగ్ పలికిన తీరు భలేగా నవ్విస్తుంది. సినిమాలో ఇలాంటి చమక్కులు చాలానే ఉంటాయి. ముఖ్యంగా ప్రథమార్ధమంతా కూడా ఇలాంటి చమక్కులతో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తూ సాగుతాయి అన్ని సన్నివేశాలు. ఎంటర్టైన్మెంటే కాకుండా కమ్ముల మార్కు బ్యూటిఫుల్ రొమాంటిక్ మూమెంట్స్ కూడా ప్రేక్షకులకు చక్కటి అనుభూతిని కలిగిస్తాయి. ఎక్కువగా లంగావోణీల్లో కనిపించే హీరోయిన్..  అందమైన లొకేషన్లు.. సూర్యోదయాలు.. సూర్యాస్తమయాలు.. వాన చినుకులు.. ఇలా ప్రతి సన్నివేశంలోనూ కమ్ముల మార్కు ఆహ్లాదం కనిపిస్తుంది తెరమీద. మొత్తంగా ప్రథమార్ధం ఎలా అయ్యిందో తెలియనట్లుగా సాగిపోయి ద్వితీయార్ధం మీదా అంచనాలు పెంచుతుంది.

ఐతే ప్రథమార్ధంలో కథంటూ ఏమీ లేకపోయినా.. సన్నివేశాల్లోని తాజాదనం.. వినోదం.. బ్యూటిఫుల్ మూమెంట్స్ సమయం తెలియనట్లుగా చేస్తే.. ద్వితీయార్ధం మాత్రం నెమ్మదిగా.. సాగతీతగా అనిపిస్తుంది. ప్రధాన పాత్రల మధ్య దూరం పెరగడానికి ఇందులో చూపించిన కారణాలు అంత కన్విన్సింగ్ గా అనిపించవు. ఏదో విడిపోవాలి కాబట్టి విడిపోవాలి... క్లైమాక్స్ వచ్చాకే కలవాలి అన్నట్లుగా ఫోర్స్డ్ గా కథను నడిపించిన భావన కలిగిస్తుంది. మాట్లాడుకుంటే సులభంగా పరిష్కారమైపోయే సమస్యను చివరిదాకా సాగదీయడం సముచితంగా అనిపించదు. తన మీద హీరోకున్న ప్రేమ ఎంతో అతడి నోటితో విన్నాక కూడా కథానాయిక తన మనసు మార్చుకోవడం కన్విన్సింగ్ గా అనిపించదు. రిపిటీటివ్ గా అనిపించే కొన్ని సీన్లు విసిగిస్తాయి. జరగబోయేదేంటో తెలిశాక ముగింపు కోసం చాలా సమయం ఎదురు చూడాల్సి వస్తుంది ప్రేక్షకులు. ద్వితీయార్ధంలోనూ కొన్ని మంచి మూమెంట్స్ ఉన్నప్పటికీ.. ప్రథమార్ధంలో మాదిరి వినోదం లేకపోవడం.. సన్నివేశాల్లో కొత్తదనం లేకపోవడంతో ‘ఫిదా’ మీద అంతకుముందున్న ఇంప్రెషన్ కొంచెం తగ్గుతుంది. ఐతే ద్వితీయార్ధం నిరాశ పరిచినప్పటికీ.. మరీ భారంగా అయితే అనిపించదు. కొన్ని ప్రతికూతలున్నప్పటికీ ‘ఫిదా’ ప్రత్యేకమైన సినిమానే. ఇందులోని ఎంటర్టైన్మెంట్.. ఫ్యామిలీ ఎమోషన్లు అన్ని వర్గాల ప్రేక్షకులకూ బాగానే కనెక్టయ్యే అవకాశముంది.

నటీనటులు:

ఇక్కడ ముందు సాయి పల్లవి గురించే చెప్పుకోవాలి. ‘ప్రేమమ్’లో ఎలా అయితే ప్రేక్షకుల్ని ప్రేమలో పడేసిందో.. ‘ఫిదా’తోనూ అలాగే ఫిదా చేస్తుంది సాయి పల్లవి. గ్లామర్ పరంగా అంతగా ఆకట్టుకోకున్నా.. తన నటనతో అదరగొట్టేసిందీ మలయాళ అమ్మాయి. తెలంగాణ యాసను వేరే ప్రాంతానికి చెందిన తెలుగమ్మాయిలు అందిపుచ్చుకోవడమే కష్టమంటే.. మలయాళీ అయి ఉండి ఈ భాష.. యాసను నేర్చుకుని దాన్ని పర్ఫెక్టుగా పలికి వినోదం పండించడం అంటే మాటలు కాదు. ఆమె కామెడీ టైమింగ్ అదిరిపోయింది. ప్రథమార్ధమంతా చాలా చలాకీగా నటించిన సాయి పల్లవి.. అక్కడక్కడా వచ్చే ఎమోషనల్ సీన్లలోనూ అంతే బాగా చేసింది. తండ్రా.. ప్రేమికుడా తేల్చుకోలేక సతమతమయ్యే పాత్రలో ఆమె నటన.. చిన్న చిన్న ఎమోషన్లను ఆమె పలికించిన విధానం కట్టిపడేస్తాయి. వరుణ్ తేజ్ కూడా చక్కగా నటించాడు. అతడి నటనలో మెచ్యూరిటీ కనిపిస్తుంది. పాత్రకు తగ్గట్లుగా అతను ఒదిగిపోయాడు. శేఖర్ కమ్ముల శైలికి తగ్గట్లుగా నటించాడు.  తనను హీరోయిన్ కాదన్నాక కూడా ఆమెనే ప్రేమిస్తూ.. తన ముందు తన ప్రేమను వ్యక్తపరిచే సన్నివేశంలో వరుణ్ నటన ఆకట్టుకుంటుంది. సుదీర్ఘ విరామం తర్వాత తెలుగు సినిమాలో కనిపించిన నిన్నటి తరం నటుడు సాయిచంద్ తండ్రి పాత్రలో ఒదిగిపోయాడు. ఎంతో సహజంగా నటించాడు. హీరో అన్న పాత్రలో రాజా.. అతడి భార్యగా చేసిన అమ్మాయి.. హీరోయిన్ అత్త పాత్రలో కనిపించిన గీతా భాస్కర్ (దర్శకుడు తరుణ్ భాస్కర్ తల్లి).. సత్యం రాజేష్.. వీళ్లందరూ కూడా పాత్రలకు తగ్గట్లుగా చక్కగా నటించారు.

సాంకేతికవర్గం:

కొందరు దర్శకులతో ఏ సాంకేతిక నిపుణుడు పనిచేసినా.. ఆ దర్శకుడి టేస్టు.. ఆ ముద్ర అలాగే కనిపిస్తాయి. సాంకేతిక నిపుణులు మారినా ఔట్ పుట్ మాత్రం అలాగే ఉంటుంది. శేఖర్ కమ్ముల కూడా ఆ కోవకు చెందిన దర్శకుడే. ‘ఫిదా’లో టెక్నీషియన్స్ అందరూ కూడా అతడి టేస్టుకు తగ్గట్లే పని చేశారు. శక్తి కాంత్.. శేఖర్ శైలికి తగ్గ ఫీల్ ఉన్న మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు.. నేపథ్యం అన్నింట్లోనూ ఒక ఫీల్ కనిపిస్తుంది. కాకపోతే పాటలు సందర్భానికి తగ్గట్లు బాగానే కుదిరాయి కానీ.. కమ్ముల గత సినిమాల్లో మాదిరి అలా గుర్తుండిపోయే.. మళ్లీ మళ్లీ వినాలనిపించే పాటలైతే ఇందులో లేవు. విజయ్ సి.కుమార్ కెమెరా పనితనం సినిమాకు ఒక ప్రత్యేకమైన కళ తెచ్చింది. అభిరుచి.. శ్రద్ధ ఉంటే కోస్తా ప్రాంతాన్నే కాదు.. బాన్సువాడను కూడా ఎంత అందంగా చూపించొచ్చో విజయ్ చూపించాడు. ఇక్కడ కమ్ముల కృషి గురించి కూడా చెప్పుకోవాలి. నిర్మాణ విలువల విషయంలో ఢోకా లేదు. దిల్ రాజు బేనర్ స్థాయి కనిపిస్తుంది. ఇక దర్శకుడు కమ్ముల విషయానికొస్తే.. ‘ఫిదా’ అతడి మార్కు సినిమా. ఒకప్పటి కమ్ములను గుర్తుకు తెచ్చే సినిమా. అతడి మార్కు బ్యూటిఫుల్ మూమెంట్స్ కు ఇందులో కొదవ లేదు. ప్రధాన పాత్రల పాత్రల విషయంలోనూ అతడి ప్రత్యేకత కనిపిస్తుంది. అతడి మాటలు సినిమాకు ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ భాషను.. యాసను అతను ఉపయోగించుకున్న తీరుకు ప్రత్యేకంగా అభినందనలు చెప్పాలి. ఐతే కథ విషయంలో.. ద్వితీయార్ధం విషయంలో కమ్ముల ఇంకొంచెం కసరత్తు చేయాల్సింది. దాదాపుగా ‘ఆనంద్’.. ‘గోదావరి’ తరహాలోనే ఈ కథనూ నడిపించేశాడతను.

చివరగా: ఈ ప్రేమకథ.. ‘ఫిదా’ చేస్తుంది

రేటింగ్- 3/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre