రౌడీ కొండ లో దాగిన మృగం.. ఫ్యాన్స్ సెటైర్లు!

Thu Oct 14 2021 10:09:09 GMT+0530 (IST)

Fans satires on VijayDevarakonda

రౌడీ దేవరకొండ చిత్రవిచిత్ర విన్యాసాలు ఇటీవల అభిమానుల్లో చర్చకు వచ్చాయి. లైగర్ కోసం అతడు రూపాంతరం చెందిన తీరు అభిమానుల్ని ఆశ్చర్యపరిచింది. అతడి బీస్ట్ రూపాన్ని ఫ్యాన్స్ ఒక రేంజులో వైరల్ చేశారు. అయితే ఇదే బీస్ట్ రూపం ఇప్పుడు అతడిని ఇప్పుడు ఆదుకుంటోందంటూ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..తాజాగా విజయ్ షేర్ చేసిన ఓ వీడియో అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఇది త్వరలో రిలీజ్ కి రానున్న హాలీవుడ్ మూవీకి అతడు ఇచ్చిన బూస్టింగ్ అనే చెప్పాలి. ఇంతకీ ఈ వీడియోలో ఏం ఉంది? అంటే.. రౌడీ దేవరకొండ వరుసగా తన దుస్తుల్ని విప్పేస్తున్నాడు. బ్లాక్ కలర్ ట్రాక్ సూట్ .. ఆ పై టీషర్ట్ విప్పేశాక.. అతడు పూర్తి బ్లాక్ కలర్ లో కనిపించే మృగంలా మారిపోయాడు. ఆ మృగం ఏమిటీ? అన్నది వీడియోలో చూడాల్సిందే. త్వరలో విడుదలకు రానున్న హాలీవుడ్ మూవీ `వీనం` కి ప్రమోషన్ ఇది. ఇంతకుముందు వీనం మూవీ రిలీజైంది. ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. వీనం - లెట్ దేర్ బి కార్నేజ్ కి ప్రచారం హోరెత్తుతోంది. అయితే దేవరకొండ ఫీట్ చూశాక కొన్ని విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో కొందరు రౌడీని ఎగతాళి చేస్తున్నారు. విజయ్ చాలా కాలంగా లైగర్ వల్ల స్టక్ అయిపోయాడని .. అందుకే ఈ రకంగా పాకెట్ మనీ సంపాదిస్తున్నాడని సెటైర్లు పడుతున్నాయి.

అయితే ఒక్కో సినిమాకి 10కోట్ల పారితోషికం అందుకునే విజయ్ ని ఇలా అనడం సరికాదు. రకరకాల వ్యాపార మార్గాల్లోనూ అతడు భారీగా ఆర్జిస్తున్నాడు. కానీ లైగర్ వల్ల అతడు కొంత ఇబ్బంది పడిన మాట నిజం. ఈ సినిమా ప్రారంభమై చాలా కాలం అయినా ఇప్పటికీ పూర్తి కాలేదు. కరోనా వల్ల అంతకంతకు ఆలస్యమైంది. ఇప్పటికీ ఫ్యాన్స్ లో అసహనం కనిపిస్తోంది. విజయ్ చివరిసారిగా గత సంవత్సరం ఫిబ్రవరిలో విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ లో కనిపించాడు. ఆ తర్వాత మరో సినిమా విడుదల కాలేదు. అందుకే అభిమానులు అలా సెటైరికల్ గా స్పందిస్తున్నారని భావించాలి.

అలాగే విజయ్ దేవరకొండ చివరి హిట్ చిత్రం 2018 లో వచ్చింది. గీత గోవిందం విడుదలై మూడేళ్లయిపోతోంది. ఈ భారీ గ్యాప్ అభిమానుల్లో ఆందోళన పెంచుతోంది. లైగర్ చిత్రీకరణకు సంబంధించిన అప్ డేట్ రావాల్సి ఉంది. లైగర్ బృందం అమెరికాలో మైక్ టైసన్‌తో షెడ్యూల్ పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిసింది. ఇంతకుముందు టైసన్ కి తాను వీరాభిమానిని అని దేవరకొండ వెల్లడించిన సంగతి తెలిసిందే. తన పంచ్ ల నుంచి దూరంగా తప్పుకుంటానని అతడు అన్నాడు.

టైసన్ పిడిగుద్దులకు ఒణుకు గ్యారెంటీ

లైగర్ మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఈ చిత్రం రక్తి కట్టించే స్క్రీన్ ప్లేతో తెరకెక్కుతోంది. ఇందులో మైక్ టైసన్ ఓ కీలక పాత్రను పోషిస్తుండడం ఇటీవల హాట్ టాపిక్ గా మారింది. మాజీ బాక్సింగ్ దిగ్గజం టైసన్ తో విజయ్ ఫైట్ చేయాల్సి ఉంటుంది. అయితే అతడి పిడిగుద్దులు అంటే తనకు చాలా భయం అని దేవరకొండ అన్నారు. టైసన్ వ్యక్తిగత జీవితంపై బ్యాడ్ ప్రొపగండా ఉన్నా కానీ.. వృత్తిగతంగా అతడు అరివీర భయంకరుడిగా నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి అతడి ఆట తీరును చూశాను అని దేవరకొండ తెలిపారు.

మైక్ టైసన్ కి చెడ్డవాడు అన్న పేరు ఉన్నా కానీ.. అతడు ఇటీవల మారిన మనిషిగా కనిపించారని విజయ్ దేవరకొండ అన్నారు. నాకు బాక్సింగ్ కూడా తెలియకముందే నాకు మైక్ తెలుసు. అతను ఇప్పుడు మారిన వ్యక్తి. ఆయన చెప్పిన కొన్ని విషయాలు నన్ను నిజంగా చాలా బాధించాయి... అని తెలిపారు. అతడి పంచ్ లు ఏవీ తనకు కనెక్టవ్వకుండా చాలా జాగ్రత్తపడతాను అని తెలిపారు. మైక్ టైసన్ తన అత్యున్నత దశలో ఉన్నప్పుడు అత్యంత భయంకరమైన .. దారుణమైన శక్తివంతమైన బాక్సర్ లలో ఒకడు. అతని పంచ్ తగిలిందంటే అంతే సంగతి. అందుకే దేవరకొండ భయపడ్డారట. మైక్ టైసన్ తో ఒక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించేటప్పుడు విజయ్ కూడా దెబ్బలు తినేస్తానని భయపడుతున్నారు. బాక్సింగ్ ఐకాన్ భారతీయ చిత్రంలో నటించడం ఇదే మొదటిసారి అనుకుంటే అది కూడా దేవరకొండ సినిమాలో కనిపిస్తుండడం మరో సర్ ప్రైజ్ అనే చెప్పాలి. ఈ చిత్రంలో అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు.