స్టార్ హీరోల ఫ్యాన్ వార్.. పిచ్చి పీక్స్ కి చేరిందా?

Thu Jul 07 2022 13:00:01 GMT+0530 (India Standard Time)

Fan War Of Star Heroes

గత కొంత కాలంగా అభిమానం వెర్రితలలు వేస్తోంది. తాము అభిమానించే హీరోని మరో హీరో మించిపోతున్నాడంటే చాలు అభిమానులు ఆ హీరోని నెట్టింట టార్గెట్ చేయడం కించపరిచే విధంగా మీమ్స్ ని క్రియేట్ చేయడం వీడియోలని సృష్టించి సదరు హీరోపై కామెంట్ లు గుప్పించడం సర్వసాధారణంగా మారింది. ఇక సోషల్ మీడియా ప్రభావం పెరిగిన దగ్గరి నుంచి ఈ తరహా ట్రోలింగ్ పీక్స్ కి చేరుకుంటోంది. ఇది ఇప్పడు హద్దులు దాటి రాష్ట్రాలు దాటి వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఒక ఇండస్ట్రీకి సంబంధించిన హీరోల మధ్య పోటీని సాకుగా చూపిస్తూ ఇతర హీరోలపై అభిమానులు నెట్టింట దాడులు చేయడం చూశాం. కానీ ఇప్పడది ఇతర భాషలకు కూడా పాకింది. పర భాషా హీరోలని కూడా ఇప్పడు మన వాళ్లు ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఆ మధ్య 'RRR' రిలీజ్ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ వేదికగా కోల్డ్ వార్ నడిచింది. అయితే తాజాగా తమిళ హీరో విజయ్ తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ మధ్య ట్రోలింగ్ వార్ నడుస్తోంది.

మా హీరో మహేష్ గొప్ప అంటూ దళపతి విజయ్ ని కించపరుస్తూ మహేష్ ఫ్యాన్స్ వీడియోలతో మీమ్స్ తో రెచ్చిపోతున్నారు. కొన్ని వీడియోల్లో విజయ్ బాల్డ్ హెడ్ కనిపించేలా మార్ఫింగ్ చేస్తూ వాటిని పోస్ట్ చేస్తున్నారు. విజయ్ ఫ్యాన్స్ కూడా ఎదురుదాడికి దిగుతున్నారు.

ఈ ఇద్దరి కెరీర్ లో వున్న ఫ్లాప్ సినిమా క్లిప్ లని వాడుకుంటూ ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటున్నారు. విజయ్ ని మించిన స్టార్ లేరంటూ మహేష్ ని కించపరుస్తున్నారు.

దానికి గట్టి కౌంటర్ ఇస్తూ మహేష్ ఫ్యాన్స్ విజయ్ వీడియోలని మార్ఫింగ్ చేస్తూ వదలుతున్నారు. అంతే కాకుండా ఇద్దరు యువకులు కొట్టుకుంటున్న వీడియోని షేర్ చేసి మహేష్ హీరో విజయ్ ని కొడుతున్నాడంటూ కామెంట్ లు పెట్టి రెచ్చగొడుతున్నారు. విచిత్రం ఏంటంటే మహేష్ నటించిన చాలా సినిమాలని విజయ్ హీరోగా తమిళంలో రీమేక్ చేశారు. అవి అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ లుగా నిలిచాయి. 'ఒక్కడు'ని 'గిల్లి'గా 'పోకిరి'ని 'పోక్కిరి'గా రీమేక్ చేశారు. విజయ్ నటించిన ఈ సినిమాలు అక్కడ భారీ బ్లాక్ బస్టర్ లుగా నిలిచి మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టాయి.

ఇదే విషయాన్ని ఇండైరెక్ట్ గా గుర్తు చేస్తూ మహేష్ ఫ్యాన్స్ విజయ్ ని కించపరుస్తున్నారు. మా హీరో సినిమాల వల్లే ఇప్పడు మీ హీరో స్టార్ అయ్యాడని అవమానకరంగా దూషిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు ఫ్యాన్ ల వార్ చూసిన వారంతా ఫ్యాన్స్ కు పిచ్చి పీక్స్ కు చేరిందా? అంటూ కామెంట్ లు చేస్తున్నారు. విజయ్ ప్రస్తుతం తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో 'వారసుడు' మూవీ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి తమిళ తెలుగు భాషల్లో ఏక కాలంలో రిలీజ్ కాబోతోంది.