అతడు ప్రముఖ నటుడు. యూనిక్ స్టైల్ నటనతో క్లాసిక్ హిట్స్ ని పరిశ్రమకు అందించాడు. దశాబ్ధ కాలంలో ఉత్తమ సంపాదకుడిగా బాగానే ఆర్జించాడు. అంతేకాదు.. ఇటీవల ఒక స్వర్గసీమ లాంటి అందమైన ఇంటిని నిర్మించుకున్నాడు. ఇది షారూఖ్ మన్నత్ ఇంటిని తలదన్నేంత భారీ భవంతి. ఇప్పుడు తన కలలను సాకారం చేసుకున్న ఆనందంలో ఉన్నాడు. ఇంతలోనే అతడు ఆ ఇంటిని వదిలి హోటల్ గదికి వెళ్లిపోవాల్సి వచ్చింది. అంతగా అపశకునం ఆ ఇంట్లో ఏం జరిగింది? ఇంతకీ ఎవరా నటుడు? అంటే వివరాల్లోకి వెళ్లాలి.
ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ పరిచయం అవసరం లేదు. సమకాలీన నటుల్లో తనదైన ముద్ర వేసి బిజీ నటుడిగా హిందీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. అతడు త్వరలో టాలీవుడ్ లోను అడుగుపెడుతున్నాడు. విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న 'సైంధవ్' చిత్రంతో నవాజుద్దీన్ తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నారు. శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కల్పిత నౌకాశ్రయ నగరమైన చంద్రప్రస్థ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నవాజుద్దీన్ కీలక పాత్రను పోషించనున్నారని దర్శకహీరోలు హైదరాబాద్ లోని లాంచింగ్ వేడుకలో వెల్లడించారు.
ఇక నవాజుద్దీన్ ఇప్పటికే హిందీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసి క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్నాడు. మరోవైపు సౌత్ లోను ఘనమైన ఆరంగేట్రం కోరుకుని భారీ ప్రణాళికలతో ముందుకు సాగుతుండగా ఇప్పుడు అతడి కాపురం రచ్చగా మారడం చర్చనీయాంశమైంది.
ప్రముఖ బాలీవుడ్ మీడియా కథనం ప్రకారం.. ముంబైలో నవాజుద్దీన్ కష్టార్జనతో తాజ్ మహల్ లాంటి సొంతింటిని నిర్మించుకున్నారు. అత్యంత తెల్లగా మెరుస్తూ కస్టమ్ లుక్ తో కనిపించే ఈ భవంతిలో ఎంతో గర్వంగా నివశిస్తున్నాడు. అతని తండ్రి పేరు 'నవాబ్'నే ఇంటికి పేరుగా పెట్టారు. ఇందులో ఆరు బెడ్ రూమ్ లు- రెండు పెద్ద హాళ్లు - రెండు విశాలమైన లాన్ లు ఉన్నాయి. మొదటి అంతస్తులో చెట్లను పెంచడానికి పెద్ద స్థలం ఉంది. నవాజ్ కు పచ్చదనం అంటే చాలా ఇష్టం. ముంబైలోని తన ఇల్లు మా గ్రామంలోని నా ఇంటిని నాకు గుర్తు చేయాలని అతను కోరుకున్నాడు.
కానీ నవాజుద్దీన్ సిద్ధిఖీ కలల ఇల్లు ఒక పీడకలగా మారింది. భార్యతో కలతలు ఇప్పుడు అతడి పరువు మార్యాదలను రచ్చకీడుస్తున్నాయి. వైఫ్ తో నిరంతర గొడవలు ఇప్పుడు ముంబై పరిశ్రమ సహా మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. నవాజుద్దీన్ అతడి తల్లి తనను పిల్లలు సహా కనికరం అన్నదే లేకుండా బయటకు గెంటేసారని అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అంతకుముందే ఆమెపై నవాజుద్దీన్ కుటుంబీకులు పలు కేసులు నమోదు చేయడం హాట్ టాపిక్ అయింది. న్యాయవాదులు ఈ గందరగోళాన్ని పరిష్కరించే వరకు అతడు ఒక హోటల్ గదిలో ప్రశాంతంగా నివశించేందుకు వెళ్లారని తెలిసింది.
ఇప్పుడు ఆ కలల ఇల్లు భయానక కోటగా మారిపోయింది. అక్కడ అతని భార్య నవాజ్ తల్లితో అతి వికారమైన ఆస్తి గొడవల్లో మునిగి తేల్తోంది. తనను ఇంట్లో తలుపులు బిడాయించి లాక్ చేశారని నవాజుద్దీన్ అతడి తల్లిపై అతడి భార్య ఆలియా ఆరోపించారు. నవాజ్ సాబ్ భార్య ఆలియా లివింగ్ రూమ్ సోఫాలను తనకు తన పిల్లలకు తాత్కాలిక (?) ఇల్లుగా మార్చుకున్నారని తెలిసింది. ప్రస్తుతం నవాబ్ (ఇంట్లో) లో నవాజ్ కనిపించడం లేదు. పోలీసులు లాయర్లతో మాత్రమే టచ్ లో ఉన్నాడు. ప్రస్తుతం నవాజ్ ఏం చెప్పినా అతనికి వ్యతిరేకంగానే జరుగుతుంది. అతను ఏ వైపు ఎంచుకున్నా ఒక దేశద్రోహిగా తన బాధ్యతలను నిర్వర్తించని దుష్టుడిగా కనిపిస్తాడు.
ఇంతకీ నవాజ్ ఎక్కడ? అని ఆరా తీస్తే అతని స్నేహితుల వివరాల ప్రకారం అతను ప్రస్తుతానికి హోటల్ రూమ్ కి మారాడని ప్రముఖ బాలీవుడ్ మీడియా తన కథనంలో ప్రచురించింది. తన లాయర్లు తన ఇంటిలోని గందరగోళాన్ని పరిష్కరించే వరకు అతను అక్కడే ఉంటాడని సదరు కథనం పేర్కొంది.
కలల ఇల్లు గోడలు కూల్చాడు!
నవాజుద్దీన్ ఓ ఇంటర్వ్యూలో తన కలల ఇంటి గురించి ముచ్చటించిన సంగతులు వింటే ఎవరికైనా ఉత్కంఠ కలగక మానదు. నవాజుద్దీన్ ఆ చాటింగ్ సెషన్ లో ఏమన్నారంటే... నా కలల ఇల్లు ప్రతి అంగుళం నేనే నిర్మించుకున్నాను. దీనికి కచ్చితమైన మ్యాప్ సిద్ధం చేసాను. నా దృష్టిలో ఒక్క అంగుళం కూడా రాజీపడలేదు. నేను లేనప్పుడు ఏదైనా తప్పుగా నిర్మిస్తే నేను దానిని పడగొట్టించాను. ఇల్లు పూర్తవ్వడానికి ముందు చాలా గోడలు పడగొట్టాము. ఇంటిలోని ప్రతి అంగుళం నా మనసులో డిజైన్ చేసుకున్న విధంగానే ఉండాలని కోరుకున్నాను. నాకు చాలా సహాయం చేసిన మా సోదరుడికి నేను కృతజ్ఞతలు చెప్పాలి. నేను లేనప్పుడు అతను నిర్మాణాన్ని పర్యవేక్షించాడు.. అంటూ తన డ్రీమ్ హౌస్ గురించి అతడు గతంలో చెప్పాడు.
ప్రజలు తన 'నవాబ్'ను షారుఖ్ ఖాన్ మన్నత్ తో పోల్చారని తన వద్ద ప్రస్తావించినప్పుడు నవాజ్ దానికి ఎదురు ప్రశ్నించాడు. ''ఇద్దరినీ పోల్చాల్సిన అవసరం లేదు. అది అతని కలల ఇల్లు. ఇది నా కలల ఇల్లు. సబ్కే సప్నే అలగ్ అలగ్ హోతే హై (ప్రతి ఒక్కరికి తన సొంత కల ఉంటుంది). మీరు (ప్రజలు) నా ఇంటిని చూడటానికి రావాలని నేను కోరుకుంటున్నాను'' అని తెలిపాడు. నవాజుద్దీన్ డ్రీమ్ హౌస్ అంధేరిలోని యారీ రోడ్ లో ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.