ఎఫ్3 స్టోరీ లీక్ : వాటే క్రేజీ ఐడియా

Sun Jan 20 2019 18:09:57 GMT+0530 (IST)

F3 Movie Story

సంక్రాంతి బరిలో తీవ్రమైన పోటీ మధ్య విడుదలైనా బ్లాక్ బస్టర్ హిట్ తో ఫైనల్ విన్నర్ గా నిలిచిన ఎఫ్2 దూకుడు వారం దాటినా ఆగడం లేదు. అపోజిషన్ లో ఉన్న మూడు సినిమాల పరిస్థితి చాలా దయనీయంగా ఉండటం ఎఫ్2కి ఇంకా బాగా కలిసి వస్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడి గత మూడు సినిమాల కన్నా ఇది పెద్ద హిట్ గా నిలవబోతోంది. గత కొన్నేళ్ళుగా తన బ్యానర్ రేంజ్ బ్లాక్ బస్టర్ లేక ఇబ్బంది పడుతున్న దిల్ రాజుని పూర్తిగా సంతృప్తి పరుస్తోంది ఎఫ్2.ఎండ్ టైటిల్స్ లో ఎఫ్3 కూడా ఉంటుంది అనే హింట్ ఇచ్చారు కాని అంతకు మించి వివరాలయితే ఏమి చెప్పలేదు టీం. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎఫ్3 కి సంబంధించి ఒక స్టొరీ పర్ఫెక్ట్ గా సింక్ అయ్యేలా ఉండటంతో ఇలా అయితే బాగుంటుంది కదా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది తుపాకీ వెబ్ సైట్ టీం సభ్యులలో ఒకరు రాసినది కావడం మరో విశేషం. తన సోషల్ మీడియా ఎకౌంటులో పోస్ట్ చేసిన అతని స్టొరీకి స్పందన కూడా బాగుంది.  అదేంటో మీరే చూడండి

" వెంకీ వరుణ్ లు సతీసమేతంగా హైదరాబాద్ తిరిగి వచ్చాక రెండు జంటలు ఒకే ఇంట్లో కాపురం పెడతారు. తమన్నా మొదటి కాన్పులో కవల పిల్లలకు జన్మనిస్తుంది. అప్పటి నుంచి వరుణ్ హనీల ప్రైవసీకి ఇబ్బందులు మొదలవుతాయి. ఓ ఐదారేళ్ళు పిల్లలు వద్దనుకున్న ఈ జంటకు వెంకీ పిల్లలు తమ అల్లరితో ప్రత్యక్ష నరకం చూపిస్తూ ఉంటారు. ఈ గోల భరించలేక వరుణ్ హనీలు రెస్టారెంట్ బ్రాంచ్ పెట్టే సాకుతో దుబాయ్ వెళ్ళిపోతారు.

ఈ లోపు అన్నపూర్ణమ్మ టపా కట్టేస్తుంది. వీలునామాలో డెబ్భై కోట్లు విలువ చేసే తన యాభై ఎకరాల పొలాన్ని హారిక హనీల పిల్లలకు సమానంగా రాసి పోతుంది.ఒకవేళ ఇద్దరిలో ఎవరికైనా పిల్లలు కలగకపోతే ఆ భాగం కూడా రెండో వాళ్ళు తీసుకోవాలన్న మెలిక పెడుతుంది. దీంతో వరుణ్ హనీని పిల్లల కోసం తొందరపెడతాడు. అయితే హనీ ఒప్పుకోదు. దీంతో మధ్యే మార్గంగా దుబాయ్ లో ఉండే తన స్నేహితుడు పాపను తీసుకుని ఇండియాకు ల్యాండ్ అయిపోతాడు.

ఇద్దరు పిల్లల అల్లరి ఇప్పుడు ముగ్గురయ్యేసరికి పీక్స్ కు వెళ్ళిపోతుంది. ఈ లోపు వెంకీ వరుణ్ ల లైఫ్ లో పిల్లల పుణ్యమా అని కొత్త ఫ్రస్ట్రేషన్ మొదలవుతుంది. మా పిల్లలు గొప్పంటే మా పిల్లలు గొప్పని పోటాపోటీగా హెచ్చులకు పోవడం మొదలుపెడతారు. అపార్థాలు మొదలవుతాయి. ఈ లోపు వరుణ్ దుబాయ్ ఫ్రెండ్ ఇండియాకు వచ్చి డబ్బు కావాలని బ్లాక్ మెయిల్ చేస్తూ ఇంట్లోనే తిష్ట వేస్తాడు. అన్నపూర్ణమ్మ రాసిన వీలునామా చెల్లుబాటు అయ్యే రోజున వెంకీ కవల పిల్లలకు సంబంధించి ఒక ట్విస్ట్ బయట పడుతుంది.

అదేంటో మిగిలిన బాలన్స్ ఏంటో ఎఫ్3 చూసి తెలుసుకోండి "

ఇది వినగానే ఎఫ్3 కథే అనిపించడం సహజం . ఎలాగూ పెళ్లి తాలుకు ఫ్రస్ట్రేషన్ ఎఫ్2లో చూపించారు కాబట్టి అంతకు మించిన వినోదం రావాలి అంటే ఇలా పిల్లల పాత్రల ద్వారా చక్కగా పండించవచ్చు. అయితే ఇది అఫీషియల్ వెర్షన్ కాదు కాని సరదాగా చదువుకునేందుకు మాత్రం బాగుంది. కాస్త వర్క్ అవుట్ చేసి మార్పులు చేస్తే పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేలా కూడా ఉంది. ఒక బ్లాక్ బస్టర్ హిట్ వస్తే ఇలాంటి క్రేజీ ఐడియాలు సహజంగానే వస్తూ ఉంటాయి. నెటిజెన్లు తమ క్రియేటివిటీకి పదును పెట్టి ఇదుగో ఇలా సీక్వెల్స్ కు కథలు కూడా రాసేస్తున్నారు. అంతా టెక్నాలజీ మహత్యం.