Begin typing your search above and press return to search.

మంత్రి ముందు కన్నీటి పర్యంతమైన ఎగ్జిబిటర్..!

By:  Tupaki Desk   |   20 Sep 2021 3:06 PM GMT
మంత్రి ముందు కన్నీటి పర్యంతమైన ఎగ్జిబిటర్..!
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో ఈరోజు సోమవారం టాలీవుడ్ ప్రముఖులు భేటీ అయిన విషయం తెలిసిందే. ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో థియేటర్ సమస్యలు - ఆన్ లైన్ సినిమా టికెట్ విధానం వంటి పలు అంశాలపై ప్రధానంగా చర్చించారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు - డీవీవీ దానయ్య - సి.కల్యాణ్ - ఆది శేషగిరిరావు - యువీ క్రియేషన్స్ వంశీ - ఎన్వీ ప్రసాద్ - మైత్రీ మూవీ మేకర్స్ రవి - నవీన్ - దామోదరప్రసాద్.. పంపిణీదారులు ఎల్వీఆర్ - సత్యనారాయణ - వీర్రాజు - అలంకార్ ప్రసాద్ - ఒంగోలు బాబుల తో పాటుగా పలువురు డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు.

ఈ సమావేశంలో థియేటర్ల సమస్యలను చెప్పుకొని ఓ ఎగ్జిబిటర్.. మినిస్టర్ పేర్ని నాని ఎదుట కన్నీటి పర్యంతం అయినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో సవరించిన టికెట్ ధరలతో థియేటర్స్ నడపలేమని చెబుతూ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అవకాశం ఇవ్వాలని.. అలాగే సెకెండ్ షో లకు కూడా అనుమతివ్వమని సినీ ప్రముఖులు మంత్రిని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడి హామీ వచ్చేలా చూస్తానని పేర్ని నాని హామీ ఇచ్చారు.

ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న సినిమా టికెట్ ఆన్ లైన్ విధానం తప్పనిసరి వ్యవహారామని మంత్రి స్పష్టం చేసారు. ఈ సిస్టమ్ కు టాలీవుడ్ ప్రముఖులు అందరూ అంగీకరించారు. అయితే టికెట్ రేట్లను 50 నుంచి 250 మధ్యన వుండేలా ఫ్లెక్సిబుల్ రేట్లకు అనుమతి ఇవ్వాలని.. దాని వల్ల సినిమాకు, కలెక్షన్లకు అనుగుణంగా రేట్లు మార్చుకుంటామని ప్రతినిధులు కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి.. ఈ విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

''ప్రజలకు మేలు చేసేలా ఎవరు ఏ విన్నపం చేసినా ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది. ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల గురించి తాజా సమావేశంలో వారికి వివరించాం. త్వరలోనే ఆన్‌ లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థ ద్వారా ప్రజలకు వినోదాన్ని అందిస్తాం. పారదర్శకతతో కూడిన టికెట్ రేట్లను అమలు చేస్తాం. ప్రభుత్వ నిర్దేశించిన ధరలను మాత్రమే థియేటర్‌లో అమలు చేయాలి. అందుకు ఆన్‌లైన్‌ వ్యవస్థ ద్వారా వినోదాన్ని అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమిది. ఇందుకు అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వచ్చింది. చట్టాలకు అతీతంగా వ్యాపారాలు చేసే పరిస్థితి ఉత్పన్నం అవదని నేను అనుకుంటున్నా. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌, థియేటర్‌ యజమానులు ‘ప్రభుత్వం ఇలా చేస్తే బాగుంటుంది’ అని అనేక విషయాలు మా దృష్టికి తీసుకొచ్చారు. వారి విజ్ఞప్తులను పరిశీలించి సాధ్యమైనంత మేర సానుకూలంగా స్పందించాం అని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవి అంటే సీఎం జ‌గ‌న్‌ కు ఎంతో గౌర‌వం ఉంద‌ని.. చిరంజీవిని సోద‌ర భావంతో చూస్తార‌ని మంత్రి స్పష్టం చేశారు.