లక్ష్మీస్ ఎన్టీఆర్.. బంతి మళ్లీ ఈసీ కోర్టులోకి!

Mon Apr 15 2019 17:13:57 GMT+0530 (IST)

Election Commission on Lakshmis NTr

ఏపీలో పోలింగ్ ముగిసిన నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు మరి ఇంకేం ఆటంకాలు లేనట్టే. ఈ సినిమా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉందనే దాని విడుదలను ఆపారని అంతా అనుకున్నారు. ఎన్టీఆర్ కు జరిగిన వెన్నుపోటు ఉదంతంపై ఆ సినిమా రూపొందడంతో ఆ సినిమా పట్ల చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ సహజంగానే అభ్యంతరం చెప్పింది.మామూలుగా అయితే ఈ సినిమాకు చట్టపరమైన అడ్డంకులు ఉండేవి కావేమో. కానీ ఎన్నికల వేళ కావడంతో దీనిపై అందరి దృష్టీ పడింది. ఈ సినిమా విడుదలను ఆపాలని తెలుగుదేశం వాళ్లు కోర్టుకు ఎక్కారు. వారి అభ్యర్థన మేరకు ఆ సినిమా విడుదల ఆగింది.

ఏపీ వరకూ ఆ సినిమా విడుదల ఆగింది. తెలంగాణలో మాత్రం యథాతథంగా విడుదల అయ్యింది! తెలంగాణలో టీడీపీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఆ సినిమా అక్కడ విడుదల అయినా తెలుగుదేశం ఫీల్ కాలేదేమో. ఇక ఏపీలో ఎన్నికల ప్రక్రియలో ఇక ఫలితాలే పెండింగ్. ఫలితాలను ప్రభావితం చేసే సమయం ముగిసిపోయింది.

అయితే ఈ సినిమా విడుదలకు మాత్రం ఇంకా మోక్షం లభిస్తున్నట్టుగా లేదు. తాజాగా ఈ సినిమా విడుదలపై మళ్లీ విచారణ జరిగింది. ఈ సందర్భంగా కోర్టు స్పందిస్తూ… ఈ సినిమా విడుదల గురించి వెళ్లీ ఈసీని అడగాలని పిటిషనర్లను ఆదేశించింది.

చివరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల వ్యవహారం మళ్లీ ఈసీ వద్దకు వచ్చింది. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన పోలింగ్ పూర్తి అయ్యింది కాబట్టి ఈ సినిమాను విడుదల చేసుకోవచ్చని ఏపీ ఈసీ చెబుతుందో లేక ఫలితాల వరకూ ఆగమంటుందో!