Begin typing your search above and press return to search.

ఎవరీ దుర్గవ్వ? పవన్ సినిమా పాటవరకూ ఆమె ఎలా వచ్చింది?

By:  Tupaki Desk   |   5 Dec 2021 10:30 AM GMT
ఎవరీ దుర్గవ్వ? పవన్ సినిమా పాటవరకూ ఆమె ఎలా వచ్చింది?
X
తెలుగు సినిమా ఇప్పుడు జానపదాలను వెతుక్కుంటూ పల్లెబాట పడుతోంది. గతంలో పల్లెల్లో కొన ఊపిరితో ఉన్న పాటలను తీసుకొచ్చి ఇక్కడి గాయనీ గాయకులతో పాడించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పల్లె పాటను పల్లె గాయానీ గాయకుల నోటివెంట వినడానికే శ్రోతలు ఇష్టపడుతున్నారు. దాంతో వాళ్లతో పాడించడానికే సంగీత దర్శకులు ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఈ విధంగా చేయడం వలన సహజమైన పల్లె వాసనలు నేరుగా ప్రేక్షకుల హృదయాలను చేరుతున్నాయి. పల్లెల్లో పొలం గట్లకి మాత్రమే పరిమితమైన స్వరాలు సరిహద్దులు దాటుకుని ప్రయాణం చేస్తున్నాయి.

ఆ మధ్య త్రివిక్రమ్ జానపదాలను ఎక్కువగా ఆలపించే పెంచల్ దాస్ ను పరిచయం చేశాడు. ఆయన స్వరం తెలుగు పాటకి కొత్తగా .. గమ్మత్తుగా అనిపించింది. ఇక 'పుష్ప' సినిమా ద్వారా 'నువ్వు అమ్మే అమ్మీ అంటా ఉంటే' పాటతో మౌమిక యాదవ్ పరిచయమైంది. అలా 'భీమ్లా నాయక్' సినిమా కోసం 'కిన్నెర మొగిలయ్య'ను కూడా పరిచయం చేశారు. కిన్నెర వాద్యాన్ని మోగిస్తూ పాటలు పాడే కళాకారుల సంఖ్య ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనను వెతికి తీసుకుని వచ్చి ఈ సినిమాలో టైటిల్ సాంగ్ తొలి వరుసలను పాడించడం విశేషం.

ఈ పాట తరువాత ఏ టీవీ ఛానల్ లో చూసినా .. ఏ యూ ట్యూబ్ ఛానల్ లో చూసినా ఆయన ఇంటర్వ్యూలే. ఎంతోకాలంగా తాను పడిన కష్టానికి ఫలితంగా .. వారసత్వంగా వస్తున్న కళను కాపాడుకుంటూ వస్తున్నందుకు బహుమానంగా ఈ రోజున ఆయనకి ఇంతటి గుర్తింపు లభించింది. ఒక కళాకారుడు ఇంతకుమించి కోరుకునేదేముంటుంది?. అలాగే ఇదే 'భీమ్లా నాయక్' సినిమా కోసం మరో పల్లె స్వరాన్ని పరిచయం చేశారు. ఆ పల్లె పరిమళం పేరే 'కుమ్మరి దుర్గవ్వ'. ఈ సినిమా నుంచి నిన్న విడుదలైన 'అడవితల్లి మాట' అనే పాటకి ఆమె స్వరం కలిపింది.

ఈ పాటను దుర్గవ్వ .. సాహితి చాగంటితో కలిసి ఆలపించింది. ఈ పాటకి ఆమె స్వరం ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చింది. దుర్గవ్వ మంచిర్యాలకు చెందిన మట్టిమనిషి. పొలం పనులు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటుంది. అయితే ఆమె స్వరంలోని ప్రత్యేకతనే ఈ రోజున ఆమెను పవన్ సినిమా పాటవరకూ తీసుకొచ్చింది. 'భీమ్లా నాయక్' కోసం దుర్గవ్వ పాడిన పాట ఇప్పుడు యూ ట్యూబ్ లో ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. తరాలు మారుతున్నా జానపదం తన ప్రభావం చూపుతూనే ఉంది .. తనని నమ్ముకున్న కళాకారులకు కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెడుతూనే ఉంది.