తమిళ ప్రేక్షకులకు 'దృశ్యం 2' అదృష్టం లేనట్లేనా?

Wed Jun 09 2021 13:01:53 GMT+0530 (IST)

Drishyam 2 Tamil Remake

మలయాళ సూపర్ హిట్ మూవీ దృశ్యంకు సీక్వెల్ గా వచ్చిన దృశ్యం 2 కూడా సెన్షేషనల్ సక్సెస్ దక్కించుకుంది. విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు కమర్షియల్ గా కూడా దృశ్యం 2 సక్సెస్ గా నిలిచింది. దృశ్యం 2 సూపర్ హిట్ అయిన నేపథ్యంలో తెలుగులో వెంటనే రీ మేక్ చేసేందుకు సిద్దం అయ్యారు. వెంకటేష్ ఈ సినిమా కోసం వెంటనే డేట్లు ఇవ్వడం.. షూటింగ్ ప్రారంభించడం పూర్తి చేయడం కూడా జరిగింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలుగు దృశ్యం 2 కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక తమిళ దృశ్యం 2 గురించి గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి.దృశ్యం ను తమిళంలో పాపనాశం టైటిల్ తో రీమేక్ చేయడం జరిగింది. కమల్ కు జోడీగా ఈ సినిమాలో గౌతమి నటించింది. నివేథా థామస్ మరియు ఎస్తేర్ లు నటించిన ఈ సినిమా సీక్వెల్ చేయాలంటే మళ్లీ ఆ నలుగురు మరియు ఇతర నటీనటులు కావాల్సి ఉంది. కాని గౌతమి మరియు కమల్ హాసన్ ల మద్య గతంలో మాదిరిగా ఇప్పుడు పరిస్థితి లేదు. పాపనాశం సమయంలో సహజీవనం చేస్తున్న ఇద్దరు ఇప్పుడు మాత్రం విడిపోయి దూరంగా ఉంటున్నారు. సినిమా కోసం కలవాలంటే మాత్రం సాధ్యం కాదంటున్నారు.

కమల్ ను ఇటీవలే జీతూ జోసెఫ్ సంప్రదించాడట. రెండు నెలల్లో షూటింగ్ ను ముగించేస్తానంటూ కమల్ తో దర్శకుడు అన్నాడట. కాని కమల్ మాత్రం గౌతమితో నటించేందుకు సిద్దంగా లేనంటూ చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో ఆయన మీనా లేదా మరే హీరోయిన్ తో అయినా నటిస్తానని అన్నాడట. కాని అన్ని భాషల్లో మాదిరిగా కాకుండా తమిళంలో హీరోయిన్ ను మార్చి నటింపజేస్తే ఫీల్ పోతుందని దర్శకుడు భావిస్తున్నాడట. కమల్.. గౌతమి లు ఓకే చెప్తేనే చేయాలని కూడా ఆయన భావిస్తున్నాడట. కమల్ మాత్రం అందుకు ఒప్పుకునే అవకాశం లేదంటున్నారు. కనుక తమిళ ప్రేక్షకులకు దృశ్యం 2 అదేనండి పాపనాశం 2 చూసే అదృష్టం లేనట్లే అంటున్నారు.