వర్మ కంటే తోపులా ఉన్నాడే.. ఎవరు ఈ తేజ?

Sat Sep 19 2020 14:20:01 GMT+0530 (IST)

Who is this Teja?

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. చాలా వరకు ఆయన్ను తిట్టేందుకే వచ్చాయి. ఇప్పుడు ఆయన స్వయంగా తన సినిమాను చేయించే పనిలో ఉన్నాడు. 'రాము' టైటిల్ తో రూపొందబోతున్న వర్మ బయోపిక్ మూడు పార్ట్ లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొదటి పార్ట్ లో వర్మ కాలేజ్ డేస్ మరియు సినిమాల్లోకి ఎంటర్ అవ్వడానికి చేసిన ప్రయత్నాలు ఏంటీ అనేది చూపించబోతున్నారు. రెండవ పార్ట్ లో సినిమాల్లో రాణించడం.. అమితాబ్ తో పరిచయం.. మాఫియాతో సంబంధంను చూపిస్తారట. మూడవ పార్ట్ లో వర్మనే నటించడంతో పాటు ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల గురించి చూపిస్తారట.ఈమూడు పార్ట్ ల్లోకి వర్మ కాలేజ్ డేస్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో అంతా కూడా మొదటి పార్ట్ పై ఆసక్తితో ఉన్నారు. మొదటి పార్ట్ లో వర్మ పాత్రలో దొరసాయి తేజ కనిపించబోతున్నాడు. 20 ఏళ్ల ఈ కుర్రాడు కేవలం వర్మ పాత్రలో నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించబోతున్నాడు. వర్మ చిన్న వయసులో దర్శకుడిగా మారాడు. అలాగే దొరసాయి తేజ కూడా దర్శకుడిగా మరియు నటుడిగా చేయడం జరుగుతుంది.

చాలా అనుభవం ఉన్న వారు మాత్రమే తమ సినిమాలకు తాము దర్శకత్వం వహించుకోగలరు. ఒకేసారి రెండు పనులు చేయడం అంటే కష్టం. అయినా కేడా 20 ఏళ్ల వయసులోనే అంతటి బాధ్యతను నెత్తిన పెట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. చూడబోతుంటే ఇతడు వర్మ కంటే పెద్ద తోపులా ఉన్నాడే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇతడిని జూనియర్ వర్మ అంటూ పిలిస్తే బాగుంటుందని మరికొందరు అంటున్నారు. మొత్తానికి ఈ దొరసాయి తేజ ఎవరు అంటూ చాలా మంది గూగుల్ ను అడుగుతున్నారు. రాము సినిమా సెన్షేషనల్ సక్సెస్ అయితే ఖచ్చితంగా తేజ ఎక్కడికో వెళ్లడం ఖాయం అనిపిస్తుంది.