`గోల్డ్ మ్యాన్` సంపూ కిర్రాక్ ఫన్ వర్కవుట్ చేస్తాడా?

Sun Oct 25 2020 18:30:00 GMT+0530 (IST)

Does 'Goldman' Helps To Sampu Carrier

కెరీర్ ఆరంభం నుంచి విభిన్నమైన కథాంశాల్ని ఎంచుకుని సెటైరికల్ వేలో తనకంటూ ఒక విధానం ఉందని నిరూపించాడు సంపూర్ణేష్ బాబు. హృదయ కాలేయం చిత్రంతో హీరోగా పరిచయమై అటుపై కొబ్బరి మట్ట అనే చిత్రంలోనూ నటించాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. హీరోలపై సెటైర్లు వేసినా.. లేక ఇండస్ట్రీ పై పంచులు వేసినా కానీ సంపూకే అది బాగా వర్కవుటైంది.ఇక ఇటీవలి కాలంలో సంపూర్ణేష్ బాబు స్పీడ్ కాస్త తగ్గిందేమిటో అనుకుంటుండగానే వరుసగా సినిమాలను లాంచ్ చేస్తున్నాడు. ఆ కోవలోనే సంపూ నటిస్తున్న తాజా చిత్రం గోల్డ్ మ్యాన్. టైటిల్ కి తగ్గట్టే ఒళ్లంతా బంగారంతో ఇలా దిగిపోయాడు. విజయదశమి కానుకగా రిలీజ్ చేసిన గోల్డ్ మ్యాన్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తించింది. పూర్వా కాలంలో జమీందారీ వ్యవస్థ పట్వారీ వ్యవస్థలో ఇలాంటి గోల్డ్ మ్యాన్ లు కనిపించేవారు. కోమట్లు ఎక్కువగా ఒళ్లంతా బంగారం ధరించి కనిపించడం చూస్తుంటాం.

కానీ అందుకు భిన్నంగా ఒక హీరో ఒళ్లంతా బంగారం ధరించి ఇలా షాకిస్తున్నాడేమిటి? అంటే.. అందుకు కొన్ని రియల్ లైఫ్ క్యారెక్టర్లు స్ఫూర్తి అని అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్ కమెడియన్ కారుమంచి రఘు ఒళ్లంతా బంగారంతో పది వేళ్లకు బరువైన ఉంగరాలతో మెడలో నగలతో కనిపిస్తుంటాడు. అలాగే ఫలానా ఎమ్మెల్యే గోల్డ్ మ్యాన్ అన్న కథనాలు ఇంతకుముందు ప్రచురితం అయ్యాయి. పూణే గోల్డ్ మ్యాన్.. గోల్డ్ మాస్క్ మ్యాన్ ఇలా చాలా మంది ఇటీవల పాపులరయ్యారు. ఏదైతేనేం ఇలాంటి పాత్రలో సంపూర్ణేష్ ని చూసే భాగ్యం కలగడం తెలుగు ప్రేక్షకుల అదృష్టం అనే చెప్పాలి. కామెడీ వర్కవుటైతే సెటైర్ ఫన్ క్లిక్కయితే బంపర్ హిట్టు కొట్టినట్టే. శ్రీవాస్ క్రియేషన్స్ తో కలిసి గుడ్ సినిమా గ్రూప్ గుడ్ ఫ్రెండ్స్ అంతా కలిసి నిర్మిస్తున్న చిత్రమిది. 2021 సంక్రాంతికి రిలీజ్ కానుంది. ది మ్యాన్ బిహైండ్ గోల్డ్ ఈజ్ బర్నింగ్ అంటూ పోస్టర్ పై క్యాప్షన్ ఆకట్టుకుంది. గోల్డ్ మ్యాన్ గా సంపూ మాయాజాలం ఏమేరకు వర్కవుటవుతుంది? అన్నది కాస్త ఆగితే కానీ తెలీదు.