భారత రైతు ఫిల్మ్ ఆస్కార్ కు నామినేట్

Thu Sep 19 2019 07:00:01 GMT+0530 (IST)

Documentary On Farmer From Remote Himalayan Village Nominated for Oscars

ఆస్కార్ అవార్డులు అంటే కేవలం హాలీవుడ్ సినిమాలకే అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇండియన్ సినిమాలకు ఆస్కార్ అవార్డులు అనేవి కేవలం అందరి ద్రాక్ష తరహాలో అయ్యాయి. ఇండియన్ సినిమాలు ఆస్కార్ బరిలో నిలిచినా కూడా చివరకు హాలీవుడ్ సినిమాలకే ఆస్కార్ అవార్డులు వరిస్తున్నాయి. ఇక ఈసారి కూడా ఇండియా నుండి ఆస్కార్ కు నామినేట్ అవ్వడం జరిగింది. ఒక సామాన్య రైతు గురించి నిర్మల్ చందర్ అనే దర్శకుడు డాక్యుమెంటరీ రూపొందించడం జరిగింది. అదే ఇప్పుడు ఆస్కార్ కు నామినేట్ అయ్యింది.ఉత్తరాఖండ్ ఫౌరీ గఢ్వాల్ ప్రాంతానికి చెందిన విద్యాదత్ అనే రైతు గురించి నిర్మల్ చందర్ 'మోతీ భాగ్' అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ ను చిత్రీకరించడం జరిగింది. అందులో విద్యాదత్ సాధించిన విజయాలను.. ఆయన వ్యవసాయంలో పొందిన ఫలితాలను గురించి చూపించడం జరిగింది. ఫౌరీ గఢ్వాల్ ప్రాంతానికి చెందిన యువకులు అంతా కూడా ఉద్యోగాల పేరుతో ఊరు వదిలి వెళ్లడం లేదా వ్యవసాయం మానేయడం చేశారు. కాని విద్యాదత్ మాత్రం ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నా కూడా వ్యవసాయంను వదిలి పెట్టకుండా రైతుగా కొనసాగాలనుకున్నాడు.

భారతదేశంలో అతి పెద్ద రాడిష్ దుంపలు పండిస్తున్న రైతుగా విద్యాదత్ రికార్డు సాధించాడు. అలాగే మన దేశంలో పండుతున్న రాడిష్ దుంపల్లో అత్యంత నాణ్యమైన దుంపలను విద్యాదత్ పండిస్తున్నాడు. యువతలో వ్యవసాయంకు ఉన్న ప్రాముఖ్యతను గురించి చెప్పేందుకు ప్రయత్నించాడు. అందుకే ఆయన గొప్పదనం గురించి దర్శకుడు డాక్యుమెంటరీ తీశాడు. ఆ డాక్యుమెంటరీ పలు ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించడంతో పాటు తాజాగా ఆస్కార్ కు నామినేట్ అయ్యింది. మరి ఆస్కార్ అవార్డు ఈసారైనా మోతీ భాగ్ వల్ల ఇండియాను వరించేనా చూడాలి.