టాలీవుడ్ అనైక్యత.. సమస్యలు పరిష్కరించేదెలా?

Mon Nov 29 2021 05:00:01 GMT+0530 (IST)

Disunity In Tollywood

ఒక్క చీమకు ఏదైనా హాని జరిగితే.. పది చీమలు దానిచుట్టూ చేరి.. ఏదైనా చేసేందుకు ప్రయత్నిస్తాయి. ఇది కలివిడి! ఒక కార్మికుడికి ఏదైనా జరిగితే.. వందల మంది కార్మికులు.. ఏకమవుతారు. ఇది ఐక్యత!! మరి దీనిలో ఏదీ లేని తెలుగు సినీ పరిశ్రమ.. సమస్యలను ఎలా గట్టెక్కిస్తుందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. నాకెందుకొచ్చింది.. నా కాళ్లు తడవట్లేదుకదా! అన్నట్టుగా టాలీవుడ్ పెద్దలు.. వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం.. టికెట్లను ఆన్‌లైన్ చేసింది. అదే చేత్తో.. ఎవరిమీదో కసితోనో.. పొలిటికల్ వ్యూహంతోనో.. టికెట్ల ధరలను దారుణంగా తగ్గించింది. ఇది ఇండస్ట్రీకి కరోనా గోరుచుట్టుపై రోకలిపోటు లాంటిదే!ఈ నిర్ణయాన్ని అందరూ తప్పుబడుతున్నారు. ఇళ్లలో కూర్చుని పిట్ల కబుర్లు చెబుతున్నారు. కానీ ఏ ఒక్కరూ బయటకు రావడం లేదు. కలిసి చర్చిద్దాం.. లేదంటే.. కలివిడిగా పోరాడదాం! అనే వాదాన్ని నినాదాన్ని టాలీవుడ్ పెద్దలు భుజాన వేసుకోలేక పోతున్నారు. కొన్నాళ్ల కిందట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇదే విషయాన్ని ప్రస్తావించి.. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించినప్పుడైనా.. పెద్దలు స్పందించి ఉంటే.. బాగుండేది. కానీ.. అప్పుడు పవన్‌ను దూరం పెట్టి.. జగన్‌కు దగ్గరయ్యేందుకు ప్రయాస పడ్డారు. తీరా.. బిల్లు ప్రవేశపెట్టి.. దానిలో ఉన్న విషయాలు బహిర్గతమయ్యే  సరికి.. కళ్ల కనిపిస్తున్న కష్టాల భవితవ్యాన్ని తలుచుకుని కుయ్యో మొర్రో అంటున్నారే తప్ప.. కలిసికట్టుగా.. స్పందిస్తున్న దాఖలా కనిపించడం లేదు.

పోనీ.. ఎవరూ స్పందించడం లేదా? అంటే.. స్పందిస్తున్నారు. కానీ సుతిమెత్తగా.. ఆర్నొక్కరాగం వినిపిస్తున్నారు. సినిమా టిక్కెట్ రేట్ల ఖరారు విషయంలో సీఎం జగన్ పునరాలోచించాలి అని చిరంజీవి ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేశారు. జీఎస్టీ మాదిరిగానే టికెట్ల రేట్లు ఉండాలన్నారు.. అంతేకాదు.. ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారో.. దాని ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే..అదేదో.. చిరు సార్..నేరుగా రంగంలోకి దిగి.. ఆ రాష్ట్రంలో ఇలా.. ఈ రాష్ట్రంలో ఇలా చేస్తున్నారు.. మీరు కూడా ఈ పంథానే అనుసరించండి.. అని నేరుగా చెబితే.. అధ్యయనం చేస్తే.. బాగుండేదనే.. వాదన వినిపిస్తోంది. దొంగ చేతికి తాళాలు ఇచ్చి.. అవి తీసుకోవద్దు.. ఇవి ముట్టుకోవద్దు.. అని చెప్పినట్టుగా.. చిరు వ్యవహరించారనే గుసగుస వినిపిస్తోంది.

ఇక బడా నిర్మాత.. దగ్గుబాటి సురేష్ బాబు ఒకింత గట్టిగా స్పందించారు. అయితే.. ఈయన కూడా నొప్పి తగలకుండా వ్యాఖ్యలు చేశారు. యుద్ధమే చేయకుండా.. అస్త్రాలు జారవిడిచినట్టు.. ఇలా అయితే వ్యాపారాలు మూసుకోవడమే అన్నారు. వాస్తవానికి ఈ మాట.. చివరాఖరిది!  ఎందుకంటే.. ముందుగా సర్కారుతో చర్చించాలి. లేదా.. కొన్ని డిమాండ్లు పెట్టాలి. అవి నెరవేరకపోతే.. ఉద్యమ బాట ఎలానూ ఉంది. కానీ ఇవేవీ లేకుండానే.. సురేష్.. నిరాశ నిస్పృహతో కూడిన వ్యాఖ్యలు చేశారు. పోనీ.. ఎవరు ఎలా వ్యాఖ్యానించారని అనుకున్నా.. అసలు టాలీవుడ్ పెద్దలు ఏక తాటిపైకి రావడం లేదు. తమ సమస్యలేమిటో అందరూకలిసి చెప్పి ప్రభుత్వం తప్పు చేస్తుంటే అదే విషయం బహిరంగంగా చెప్పి .. ఒత్తిడి చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేయడం లేదు.

మరీముఖ్యంగా.. ఇటీవలే పోరుబాటలో విజయం దక్కించుకున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఏం చేస్తోందన్నది ప్రధాన ప్రశ్న. పైగా మా అధ్యక్షుడు మంచు విష్ణుకు.. సీఎం జగన్‌కు మధ్య రిలేషన్ కూడా ఉందనే విషయం తెలిసిందే. మరి ఆయన కానీ ఆయన తండ్రి మోహన్‌బాబు కానీ.. స్పందించడం లేదు. ఇక్కడ ఒక్క విషయం మాత్రం కామన్‌గా వినిపిస్తోంది. కొందరిపై కసితో ఏపీ సర్కారు అందరికీ చెక్ పెడుతోందనే! ఏపీ ప్రభుత్వం ఖచ్చితంగా బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతోందని టాలీవుడ్ పెద్దలు నమ్ముతున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని అతి తక్కువ రేట్లను నిర్ణయించడం వెనుక తమ నుంచి ఏపీ ప్రభుత్వం ఏదో ఆశిస్తోందని వారు నమ్ముతున్నారు.

ఈ కోణంలో టాలీవుడ్ పెద్దలతోనే వారి అనుమతితో వచ్చిన వారితోనే దఫదఫాలుగా చర్చలు సాగాయి. చివరికి జగన్ ఆత్మీయు డిగా.. వ్యాపార భాగస్వామిగా పేరు పొందిన నాగార్జున కూడా వచ్చి మాట్లాడారు. కానీ సమస్య పరిష్కారం కాలేదు. మరి ఇప్పటికైనా.. చీమల దండు మాదిరిగా ఒక్కచోటకు చేరి.. సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారో.. లేదా.. మాకెందుకులే అనుభవించేవారు అనుభవిస్తారని ఊరుకుంటారో చూడాలి. ఏదేమైనా.. తెలుగు ఇండస్ట్రీని నడిపించే పెద్దలు లేకపోవడం మాత్రం జూనియర్ సహా.. ఈ రంగంపై ఆధారపడిన ఆర్టిస్టులకు పెను శాపంగా మారిందనడంలో సందేహం లేదు.