Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ లో ఫైనల్ సాంగ్ షూట్ మొదలుపెట్టిన జక్కన్న..!

By:  Tupaki Desk   |   3 Aug 2021 10:30 AM GMT
ఉక్రెయిన్ లో ఫైనల్ సాంగ్ షూట్ మొదలుపెట్టిన జక్కన్న..!
X
దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ''ఆర్ ఆర్ ఆర్'' చిత్రం కోసం యావత్‌ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 13న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనికి తగ్గట్టుగా షూటింగ్ జరుపుతున్న చిత్ర బృందం.. ఒక పాట మినహా చిత్రీకరణ మొత్తం పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు నుంచి ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలోని చివరి పాట కోసం చిత్ర యూనిట్ ఫారిన్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఈ మేరకు రాజమౌళి అండ్ టీమ్ మంగళవారం ఉక్రెయిన్‌ కు పయనమయ్యారు. ఈ విషయాన్ని వెల్లడించిన RRR టీమ్ ఫ్లైట్ లో ప్రయాణిస్తున్న ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ''ఫైనల్ షెడ్యూల్‌ కోసం ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ చిత్ర బృందం ఉక్రెయిన్‌ లో ల్యాండ్‌ అయింది. ఎగ్జైటింగ్'' అని పేర్కొన్నారు. అక్కడ ఈరోజు పాట చిత్రీకరణ ప్రారంభించారు. ఎన్టీఆర్ - రామ్ చరణ్ లతో పాటుగా మిగతా తారాగణం షూట్ లో జాయిన్ అయ్యారని తెలుస్తోంది.

రాజమౌళి రెండు వారాల పాటు RRR సాంగ్ షూటింగ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. భారీ ఖర్చుతో షూట్ చేయనున్న ఈ సాంగ్.. స్పెషల్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ షెడ్యూల్ తో షూటింగ్ పూర్తి అవుతుంది.. కాబట్టి ఆగస్ట్ మూడో వారంలో ట్రిపుల్ ఆర్ టీమ్ హైదరాబాద్ కు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మరియు ప్రమోషన్స్ మీద పూర్తిగా దృష్టి పెట్టనున్నారు. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన 'ఆర్ ఆర్ ఆర్' (రౌద్రం రణం రుధిరం) చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని జక్కన్న ఫిక్స్ అయ్యారు.

ఒకవేళ పోస్ట్ పోన్ అయితే మాత్రం ఇప్పట్లో మరో మంచి రిలీజ్ డేట్ దొరికే అవకాశం లేదు. అంతేకాదు ఇది మిగతా సినిమాల విడుదలకు కూడా తలనొప్పులు తెచ్చి పెట్టే ఛాన్స్ ఉంది. అందుకే RRR మరోసారి వాయిదా పడకూడదని చాలామంది కోరుకుంటున్నారు. ఇక ట్రిపుల్ ఆర్ ఫైనల్ స్టేజ్ కి రావడంతో హీరోలు రామ్ చరణ్ - ఎన్టీఆర్ తదుపరి సినిమాలను మొదలు పెట్టాడని ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నారు. చరణ్ సెప్టెంబర్ లో శంకర్ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే ఎన్టీఆర్ 'ఎవరు మీలో కోటీశ్వరులు' గేమ్ షో షూటింగ్ పూర్తి చేసి, అక్టోబర్‌ లో కొరటాల శివ దర్శకత్వంలో రెండో సినిమాకి సంబంధించిన పనులు ప్రారంభిస్తారు.

కాగా, అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ వంటి ఇద్దరు రియల్ లైఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ పాత్రల ఆధారంగా కల్పిత కథతో ''ఆర్ ఆర్ ఆర్'' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. భారీ బడ్జెట్‌ తో రూపొందుతోన్న ఈ చిత్రంలో రామరాజుగా రామ్‌ చరణ్‌.. కొమురం భీమ్ గా ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. వీరి సరసన ఆలియా భట్‌ - ఒలివియా మోరిస్‌ హీరోయిన్ లుగా కనిపించనున్నారు. అజయ్‌ దేవ్‌ గణ్‌ - శ్రియ - సముద్ర ఖని తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.