భారీ ఆఫర్ కొట్టేసిన 'బంగార్రాజు' డైరెక్టర్!

Mon Jan 17 2022 09:11:59 GMT+0530 (IST)

Director Kalyan Krishna Next Film Under Studio Green

ఇప్పుడు ఎక్కడ చూసినా 'బంగార్రాజు' సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. సంక్రాంతి పండుగకి అంతా కలిసి ధైర్యంగా థియేటర్స్ కి వెళ్లి చూస్తున్న సినిమా ఇది. ఒక వైపున కరోనా భయపడుతుంటే . మరో వైపున ఆంక్షలు వెంటాడుతూ ఉంటే అంతా కలిసి థియేటర్స్ కి వెళ్లి ఎంజాయ్ చేసిన సినిమా ఇది. నిజానికి 'బంగార్రాజు' సంక్రాంతికి థియేటర్స్ కి వస్తుందని ఎవరూ కూడా అనుకోలేదు. కానీ చాలా తక్కువ సమయంలో ఎంతమాత్రం క్వాలిటీ తగ్గకుండా 'బంగార్రాజు'ను బరిలోకి దింపేసి .. విజేతగా నిలబెట్టిన ఘనుడు కల్యాణ్ కృష్ణ అనే చెప్పాలి.'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాతో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా తన సత్తా చాటుకున్న కల్యాణ్ కృష్ణ ఆ సినిమా సీక్వెల్ గా 'బంగార్రాజు' కథతో నాగార్జునను ఒప్పించడానికి చాలా కష్టపడ్డాడు. ఆ కథపై ఆయన ఆ స్థాయి కసరత్తు చేసిన కారణంగానే ఈ రోజున ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. చాలా ప్రతికూల పరిస్థితుల్లో సైతం రెండు రోజుల్లో 36 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసింది. ఈ సినిమా తప్పకుండా సంక్రాంతికి విడుదల కావలసిందే అని నాగార్జున చెప్పినప్పుడు ఎవరైనా సరే టెన్షన్ పడిపోతారు.

కానీ కల్యాణ్ కృష్ణ అవుట్ పుట్ విషయంలో ఎంతమాతం తగ్గకుండా .. హడావిడి పడిపోకుండా కూల్ గానే ఈ సినిమాను పూర్తిచేశాడు. విస్తృతంగా ఉన్న ఒక కథను .. భారీ బడ్జెట్ తో కూడిన ప్రాజెక్టును .. భారీ తారాగణాన్ని హ్యాండిల్ చేయడం అంత ఆషా మాషీ విషయమేం కాదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున కూడా ఈ విషయంలోనే కల్యాణ్ కృష్ణకి మంచి సర్టిఫికెట్ ఇచ్చేశారు. అలాంటి కల్యాణ్ కృష్ణ ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుండగానే ఆయన కి కోలీవుడ్ నుంచి ఒక భారీ ఆఫర్ వచ్చింది .. అదీ స్టార్ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా నుంచి కావడం విశేషం.

తమిళనాట నిర్మాతగా జ్ఞానవేల్ రాజాకి మంచి పేరు ఉంది. ఆయన బ్యానర్ నుంచి చాలా సూపర్ హిట్లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సూర్య .. కార్తి హీరోలుగా ఆయన ఎక్కువ సినిమాలను నిర్మించారు .. ఎక్కువ విజయాలను అందుకున్నారు. ఇక అక్కడ ఆర్య .. శివకార్తికేయన్ వంటి హీరోలతోను సక్సెస్ ఫుల్ మూవీస్ ను నిర్మించారు. అలాంటి ఆయన తన తదుపరి సినిమాకి దర్శకుడిగా కల్యాణ్ కృష్ణను ఎంచుకోవడం విశేషం. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.