Begin typing your search above and press return to search.

'గుడ్ లక్ సఖి' ఆ దర్శకులిద్దరూ కలిసి తీసినట్టుగా ఉంటుంది!

By:  Tupaki Desk   |   27 Jan 2022 2:37 AM GMT
గుడ్ లక్ సఖి ఆ దర్శకులిద్దరూ కలిసి తీసినట్టుగా ఉంటుంది!
X
తెలుగు .. తమిళ భాషల్లో కీర్తి సురేశ్ కి మంచి క్రేజ్ ఉంది. ఈ రెండు భాషల్లోను ఆమె స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. 'మహానటి' తరువాత తెలుగులో ఆమె చేసిన నాయిక ప్రధానమైన 'మిస్ ఇండియా' అంతగా ఆడలేదు. ఆ తరువాత సినిమాగా 'గుడ్ లక్ సఖి' సినిమా రావలసింది. కానీ కొన్ని కారణాల వలన ఈ సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమాను ఈ నెల 28వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ - పార్క్ హయత్ హోటల్లో నిర్వహించారు.

ఈ వేడుకకి ముందుగా చిరంజీవిని ఆహ్వానించారు. అయితే ముందురోజునే చిరంజీవి కరోనా బారిన పడటంతో, తన ప్లేస్ లో ఆయన చరణ్ ను పంపించారు. అలా ఈ కార్యక్రమానికి చరణ్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈ వేదికపై ఈ సినిమా దర్శకుడు నాగేశ్ కుకునూర్ మాట్లాడుతూ .. "నేను తెలుగువాడినే .. 25 సంవత్సరాల క్రితం నేను 'హైదరాబాద్ బ్లూస్' చేశాను. ఇంతకాలానికి మళ్లీ ఈ సినిమా చేశాను. ఇది నా పూర్తి స్థాయి తెలుగు సినిమా. నేను ఈ సినిమాను చేయడానికి కారణం .. కీర్తి. నిర్మాత సుధీర్ చంద్ర నా దగ్గర ఉన్న ఈ కథ కీర్తికి బాగా నచ్చిందని చెప్పాడు .. నన్ను చేయమని అడిగాడు.

దాంతో నేను ఈ సినిమాను చేయడానికి ఓకే చెప్పాను. కీర్తి సురేశ్ తో వర్క్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. టైటిల్ లో ఉన్నట్టుగా అందరికీ 'గుడ్ లక్'. ఈ సినిమాకి కీర్తి సురేశ్ .. ఆది పినిశెట్టి .. జగపతిబాబు హైలైట్. చాలా తక్కువ సమయంలోనే దేవిశ్రీ ప్రసాద్ గారు నాకు మంచి ఫ్రెండ్ అయ్యారు. నాకు కావలసిన మంచి అవుట్ పుట్ ఇచ్చారు. అందుకు నేను ఆయనకి థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమా కె. విశ్వనాథ్ గారు .. జంధ్యాలగారు కలిసి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది" అని చెప్పుకొచ్చారు.

ఇక దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ .. "నాగేశ్ కుకునూర్ గారి 'ఇక్బాల్' అంటే నాకు చాలా ఇష్టం .. ఆ సినిమాను నేను చాలాసార్లు చూశాను. ఆయన చేసిన ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. కీర్తి మేడమ్ మంచి కీర్తి ప్రతిష్ఠలు సంపాదిస్తారనే వాళ్ల పేరెంట్స్ ఆ పేరు పెట్టరేమో. దేవిశ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఆయనకి పాటలంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. ఆయన ఎక్కువ మైఖేల్ జాక్సన్ సంగీతాన్ని వినేవారు. ఈ రోజున ప్రపంచమంతా ఆయన సంగీతం వింటోంది. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది" అని చెప్పుకొచ్చాడు.