తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించిన దిల్ రాజు!

Tue Aug 16 2022 17:09:09 GMT+0530 (IST)

Dil Raju reacts to the allegations against him!

టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా దిల్ రాజు కు మంచి పేరుంది. నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ గా ఆయన పలు రంగాల్లో వున్నారు. ఇదిలా వుంటే నిఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ 'కార్తికేయ 2' రిలీజ్ పలు మార్లు వాయిదా పడి ఫైనల్ గా ఆగస్టు 13న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈ మూవీ రిలీజ్ వాయిదాల వెనకు దిల్ రాజు ప్రమేయం వుందంటూ పలు వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై తాజాగా దిల్ రాజు స్పందించారు.

వాస్తవాలు తెలుసుకుని రాయండి. లేకపోతే మూసుకు కూర్చోండి. అని మీడియాను ఉద్దేశించి ఘాటుగా స్పందించారు. 'కార్తికేయ 2' సక్సెస్ మీట్ లో అతిథిగా పాల్గొన్న దిల్ రాజు తనపై వచ్చిన ఆరోపణలపై మీడియాని టార్గెట్ చేస్తూ మండిపడ్డారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ 'మీడియా వారు అడిగితే టైమ్ ఇస్తాను.

నిజానిజాలు తెలుసుకుని రాయండి. మీ వ్యూస్ క్లిక్కులు సబ్స్ క్రైబర్స్ కోసం నా పేరును పాడు చేయవద్దు. మీరు తొక్కితే తొక్కించుకునేంత చేతకాని వారెవరూ లేరిక్కడ. అసలు ఏమీ తెలుసుకోకుండానే మీడియా రాద్దాంతం మొదలు పెట్టింది.

సాధారణంగా నేను ఎవరితోనూ గొడవలు పెట్టుకోను. 'కార్తికేయ2' వదంతి నన్ను చాలా అప్సెట్ చేసిందన్నారు. అంతే కాకుండా ఈ విషయంలో మీడియా నన్ను బలిపశువుని చేసిందన్నారు. ఒక పక్క ఐదు సినిమాలు ఆడుతున్నా.. 'కార్తికేయ 2' నైజాంలో రూ. 4 కోట్లు వసూలు చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టాలీవుడ్ లో నెంబర్ వన్ నిర్మాణ సంస్థ. వారిని తొక్కేంత దమ్ము టాలీవుడ్ లో ఎవరికి వుంది? .. మీడియాకు కొంచెమైనా కామన్ సెన్స్ వుండాలి. ఇప్పడొక సినిమా మరో సినిమాకు ఊపిరి పోస్తోంది.

అభిషేక్ అగర్వాల్ ప్రీ రిలీజ్ కు కూడా పిలిచారు. నాకు మంచి స్నేహితుడు. 'హ్యాపీడేస్' యువత చిత్రాల నుంచి నిఖిల్ నాకు బాగా క్లోజ్.. సినిమా రిలీజ్ ను రెండు సార్లు వాయిదా వేసే ముందు అందరినీ సంప్రదించారు. ఆ పైనే నిర్ణయం తీసుకున్నారు తప్ప ఇందులో నా ప్రమేయం ఎంత మాత్రం లేదు. మీ ఇష్టం అన్నాను తప్ప బలవంతం చేయలేదు' అని దిల్ రాజు స్పష్టం చేశారు.