బాలీవుడ్ హిట్ కి డేట్ ఫిక్స్ చేసిన దిల్ రాజు

Fri May 13 2022 12:03:00 GMT+0530 (IST)

Dil Raju fixes date for Bollywood hit

తెలుగు సినిమాలకు దేశ వ్యాప్తంగా క్రేజ్ పెరిగిపోవడంతో మన చిత్రాలు చాలా వరకు ఇతర భాషల్లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా మన హిట్ సినిమాలని వేరే ఒకరు రీమేక్ చేయడం ఎందుకని మన వాళ్లే ఈ మధ్య బాలీవుడ్ లోనూ రీమేక్ చేయడం మొదలు పెట్టారు. ఇటీవల 'జెర్సీ' మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించకపోయినా మరో హిట్ మూవీని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు.



మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం 'హిట్ : ద ఫస్ట్ కేస్'. శైలేష్ కొలను దర్శకత్వంలో హీరో నేచురల్ స్టార్ నాని ప్రశాంతి త్రిపిర్నేని సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం క్రైమ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కి సంచలన విజయాన్ని సాధించింది.

హీరోగా విశ్వక్ సేన్ ని కొత్త పంథాలో అవిష్కరించి అతనికి మంచి విజయాన్ని అందించింది. ఇదే చిత్రాన్ని ప్రస్తుతం బాలీవుడ్ లో ఇదే పపేరుతో రీమేక్ చేస్తున్నారు. రాజ్ కుమార్ రావు హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నాడు.

'దంగల్' ఫేమ్  సాన్యా మల్హోత్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఈ చిత్రాన్ని జూలై 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టుగా శుక్రవారం ప్రకటించారు. మా సినిమా థియేటర్లలోకి రాబోతోందని అయితే ముందు అనుకున్నట్టుగా కాకుండా కొత్త రిలీజ్ డేట్ తో జూలై 15న థియేటర్లలోకి రానుందని దిల్ రాజు ప్రొడక్షన్స్ సంస్థ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించింది.

ముందు అనుకున్న ప్రకారం ఈ చిత్రాన్ని మే 20న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ తాజాగా కొత్త రిలీజ్ డేట్ అంటూ జూలై 15న మా సినిమా థియేటర్లలోకి రాబోతోందంటూ ప్రకటించి సర్ ప్రైజ్ చేశారు.

పవర్ ఫుల్ పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజుతో కలిసి టి సిరీస్ అధినేత భూషణ్  కుమార్ నిర్మించారు. హిందీలో మంచి బజ్ క్రియేట్ అయిన ఈ మూవీ అయినా దిల్ రాజుకు బాలీవుడ్ లో శుభారంభాన్ని అందించేనా అన్నది ఆసక్తికరంగా మారింది.