ఆచార్య లైగర్ లపై దిల్ రాజు సంచలన కామెంట్స్!

Tue Nov 29 2022 15:09:20 GMT+0530 (India Standard Time)

Dil Raju comments on Acharya and Liger

టాలీవుడ్ లో వున్న స్టార్ ప్రొడ్యూసర్లలో దిల్ రాజు ఒకరు. గత కొంత కాలంగా డిస్ట్రిబ్యూటర్ గానూ నిర్మాతగానూ వరుస క్రేజీ ప్రాజెక్ట్ లతో ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్నారు. యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ తో కలిసి  యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ని ఏర్పాటు చేసిన దిల్ రాజు దీనికి అథ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గత కొంత కాలంగా వరుస వివాదాల్లో ప్రధానంగా ఆయన పేరు వినిపిస్తూ వస్తోంది. ఆగస్టు 1న షూటింగ్ ల బంద్ నుంచి 'వారసుడు' రిలీజ్ వివాదం వరకు ప్రతీ సందర్భంలోనూ దిల్ రాజు పేరు ప్రముఖంగా వినిపిస్తూ వస్తోంది.జగపతిబాబు రాశి జంటగా నటించిన 'పెళ్లి పందిరి' సినిమాతో నైజాం డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ప్రారంభించిన దిల్ రాజు అంచలంచెలుగా ఎదుగుతూ నితిన్‌తో వి.వి.వినాయక్ తెరకెక్కించిన 'దిల్' సినిమాతో నిర్మాతగా అరంగేట్రం చేశారు. ఈ మూవీ పేరునే తన ఇంటి పేరుగా మార్చుకుని దిల్ రాజుగా ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు. ప్రొడ్యూసర్స్ గిల్డ్ తో పాటు నిర్మాతల మండలిలోనూ క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్న దిల్ రాజు 'వారసుడు' రిలీజ్ వివాదంతో పాటు ఆచార్య లైగర్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  

ఓ మీడియాకు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీకి ప్రధాన బలంగా నిలుస్తున్న డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం. 'వారసుడు' సినిమా వివాదంపై మాట్లాడుతూ ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టుగా తాను ముందే ప్రకటించానని ఆ తరువాతే చిరంజీవి బాలకృష్ణ సినిమాల రిలీజ్ లను ప్రకటించారని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ కనుమరుగవుతున్న విధానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  

ఒక సినిమా ప్రారంభించినప్పుడు ఆ సినిమాకు డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ నటించే నటీనటులు అందరూ సినిమా కథ వింటారు. కానీ ఆ సినిమాను ఆడియన్స్ దగ్గరకు తీసుకెళ్లే డిస్ట్రిబ్యూటర్లు మాత్రం సినిమా చూడకుండా కథ ఏంటో కూడా తెలుసుకోకుండా డబ్బులు పెట్టి కొంటున్నారు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నిర్మాతకు వచ్చే నష్టమేమీ లేదు. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్లకు అమ్మిన క్షణం నుంచే తను సేఫ్ జోన్ లోకి వచ్చేస్తున్నాడు.

అయితే సినిమా చూడకుండా కథేంటో తెలుసుకోకుండా కొన్న డిస్ట్రిబ్యూటర్లు సినిమా ఫ్లాప్ అయినప్పుడు మాత్రం  భారీ నష్టాలని భరించాల్సి వస్తోంది. ఉదాహరణకు విజయ్ దేవరకొండ నటించిన 'లైగర్' చిరంజీవి నటించిన 'ఆచార్య' సినిమాలను అధిక రేట్లకు నిర్మాతలు అమ్మారు.

కానీ వాటి అవి ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు నష్టాలని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలాంటి కారణాల వల్లే డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థ రాను రాను కనుమరుగైపోతోందన్నారు. దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పడు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.