దిల్ రాజు ఘనకీర్తి గతమేనా..?

Thu Oct 10 2019 20:00:01 GMT+0530 (IST)

Dil Raju Success Fadeout in Telugu Film Industry

ఇండస్ట్రీలో దిల్ రాజు అంటే విజయానికి ఓ చిరునామా అన్నట్టుగా ఉండేది.  డిస్ట్రిబ్యూషన్ అయినా.. నిర్మాణం అయినా దిల్ రాజు టేకప్ చేసిన ప్రాజెక్టు హిట్టే అని అటు ట్రేడ్ వర్గాలవారు ఇటు ప్రేక్షకులు నమ్మేవారు. అయితే గత కొంత కాలంగా దిల్ రాజు బ్రాండుకు డ్యామేజ్ జరుగుతోంది. అప్పట్లో  'శ్రీనివాసకళ్యాణం' సినిమా గురించి దిల్ రాజు చేసిన ప్రమోషన్ ను చూసిన వారు అది ఎపిక్ ఫిలిం అయి ఉంటుందని అనుకున్నారు. కానీ ఆ సినిమా చూసినవారికి నోటమాట రాలేదు.  నిజానికి అప్పటి నుంచి దిల్ రాజు మాటలపై ప్రేక్షకులకు నమ్మకం సడలిపోవడం ప్రారంభమైంది.ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన 'F2' ఒక్కటే ఆయన ఖాతాలో జెన్యూన్ హిట్టు.  ఆ సినిమా కాకుండా ఆయన బ్యానర్ లో వచ్చిన సినిమాలన్నీ నిరాశపరిచినవే. ఇవే కాకుండా చిన్న సినిమాలతో అసోసియేట్ అయితే ఆ సినిమాల పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. దిల్ రాజు ఈమధ్య ప్రెజెంట్ చేసిన చిన్న సినిమా 'ఎవ్వరికీ చెప్పొద్దు'.. అయితే ఆ సినిమా అసలు రిలీజ్ అయిన సంగతి చాలామందికి తెలియదు.. అది రాజుగారి సినిమా అని ప్రేక్షకులు గుర్తించలేదు అంటే అంతకంటే షాకింగ్ అంశం మరోటి ఉండదు. పోస్టర్ పై దిల్ రాజు పేరు ఉంటే చాలు.. ప్రేక్షకులు ఆ సినిమాకు వెళ్ళేవారు.. ఇప్పుడు ఆయన ప్రెజెంట్ చేస్తున్న సినిమా రిలీజ్ అవుతుందని జనాలకు తెలియడం లేదంటే ఏమనుకోవాలి? ఈ సినిమానే అనుకుంటే దిల్ రాజు ప్రెజెంట్ చేస్తున్న మరో సినిమా రవిబాబు 'ఆవిరి' టీజర్లు కూడా ప్రేక్షకులను హడలకొడుతున్నాయి..హర్రర్ సీన్స్ తో కాదు ఔట్ డేటెడ్ కంటెంట్ తో.

రాజుగారు డిస్ట్రిబ్యూషన్ చేసిన సినిమాల పరిస్థితి కూడా నిరాశాజనకంగానే ఉంది.  మరి రాజుగారు తన రూటు మార్చి తన కెరీర్ మొదట్లో చేసిన విధంగా అద్భుతమైన సినిమాలతో మెప్పిస్తారా లేదా ఇక అది గతం అని సరిపెట్టుకోవాల్సిందేనా?..  ఈ విషయంపై క్లారిటీ రావాలంటే కొంతకాలం మనం వేచి చూడకతప్పదు. సినిమాల విషయం ఇలా ఉంటే దిల్ రాజు గతంలో చాలా థియేటర్లకు చేసుకున్న లీజ్ అగ్రిమెంట్ల సమయం పూర్తవుతోందని సమాచారం.  మరి ఆ అగ్రిమెంట్ల విషయంలో రాజుగారు ఏం చేస్తారో చూడాల్సి ఉంది.