తెలుగు ఎంటర్ టైన్మెంట్ లో కొత్త శకం

Wed Apr 17 2019 11:09:19 GMT+0530 (IST)

Digital Providers huge Investment on Web Series

హాలీవుడ్ లో ఎప్పుడో మొదలై అక్కడి ఎంటర్ టైన్మెంట్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న వెబ్ సిరీస్ లు క్రమంగా ఇండియాలో అందులో తెలుగులోనూ ఊపందుకుంటున్నాయి. ప్రముఖ నటీనటులు మెల్లగా వీటి వైపు దృష్టి సారిస్తున్నారు. డిజిటల్ కంటెంట్ మీద ఎంత పెట్టుబడి పెట్టేందుకైనా సదరు సంస్థలు వెనుకాడటం లేదు. అమెజాన్-నెట్ ఫ్లిక్స్ వీటిలో ముందువరసలో ఉన్నప్పటికీ ఇప్పుడు జీ5 లాంటివి కూడా ఏ మాత్రం తీసిపోని రీతిలో పోటీకి సై అంటున్నాయి.నిజానికి ఏడాది క్రితమే అమెజాన్ తెలుగులో జగపతి బాబు లాంటి నోటెడ్ ఆర్టిస్టులతో గ్యాంగ్ స్టార్స్ అనే వెబ్ సిరీస్ చేసింది. అదింకా తొలిదశ కాబట్టి ఆశించిన స్థాయిలో భారీ స్పందన దక్కలేదు. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న అమెజాన్ హిందీలో కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించిన మీర్జాపూర్-ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్-హన్నా-మేడ్ ఇన్ హెవెన్ లాంటి వాటిని డబ్బింగ్ రూపంలో అందించి తెలుగు ప్రేక్షకులకు ఇంకాస్త చేరువయ్యింది

ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఢిల్లీ క్రైమ్ హాట్ స్టార్ ద్వారా అందుబాటులోకి తెచ్చిన క్రిమినల్ జస్టిస్ లాంటివి సౌత్ భాషలు అన్నిటిలోకి డబ్బింగ్ చేసి విడుదల చేయడంతో అర్థం కాకుండా పోయే ఇబ్బంది తప్పి ఎక్కువ శాతం ప్రేక్షకులు చూసే అవకాశం దక్కింది. వచ్చే వారం హై ప్రీస్టెస్ అనే మరో వెబ్ సిరీస్ రాబోతోంది. సస్పెన్స్ హారర్ ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ మూవీలో అక్కినేని అమల లీడ్ రోల్ పోషిస్తుండగా వరలక్ష్మి శరత్ కుమార్-బ్రహ్మాజీ లాంటి ప్రముఖ తారాగణం నటిస్తోంది.

సినిమాల నిర్మాణం స్థాయిలోనే వీటికి ఖర్చు పెడుతూ ఆదరణ దక్కించుకోవడం కోసం డిజిటల్ సంస్థలు ఖరీదైన వ్యవహారంలా అనిపించే టీవీ యాడ్స్ ఇచ్చేందుకు సైతం వెనుకాడటం లేదు. అరచేతిలో ఫోనూ 4జి సిం లేదా ఇంట్లో స్మార్ట్ టీవీకి వైఫై  ఉంటే చాలు ఇంత ఈజీగా  ఎంటర్ టైన్మెంట్ దొరుకుతున్న రోజుల్లో ముందు ముందు ఎలాంటి మార్పులు రానున్నాయో ఊహించడం కూడా కష్టంగానే ఉంది. అంతా టెక్నాలజీ మహిమ