టాప్ స్టోరి: డిజిటల్ దునియాలో కొత్త ఇన్నింగ్స్

Sun Nov 17 2019 09:21:31 GMT+0530 (IST)

Digital Platform Hawa with Web Series

డిజిటల్ రంగం నెమ్మదిగా విస్తరిస్తోంది. ఇది కొత్త అవకాశాలకు దారులు తెరుస్తోంది. సినిమాల తరువాత అవకాశాలు రాని.. సీనియర్ నటీనటులంతా .. ఇక టీవీ సీరియళ్లు రియాలిటీ షోలే దిక్కు అని సరిపెట్టుకునేవారు. దాంతో ఆ వైపు అడుగులు వేసేవారు. అక్కడ వచ్చే అరకొర ఆదాయంతో సరిపెట్టుకునేవారు. అయితే ఇది నిన్నమొన్నటి మాట. కాలం మారింది. టైమ్ రివర్సులో అవకాశాల గేట్లు తెరిచి సినిమా తరువాత కెరీర్ వెబ్ సిరీస్ ఇతరత్రా డిజిటల్ మాధ్యమాలు అనేంతగా కోటి ఆశలు రేకెత్తిస్తూ వారికి కొత్త జీవితాన్ని అందిస్తోంది. దీంతో ఇంత కాలం బుల్లితెరకు లేదా ఇంటికే పరిమితమైన తారలు ఒక్కొక్కరుగా డిజిటల్ దునియా బాట పడుతున్నారు.అయితే అలా వెండి తెర నుంచి వెబ్ సిరీస్‌ల బాట పట్టిన వారు ఎందరున్నారు? ఏ ఏ సిరీస్ లలో నటిస్తున్నారనేది చాలా మందికి తెలియదు. 2011లో సినిమాలకు బ్రేకిచ్చిన మీనా ఆ తరువాత మెల్ల మెల్లగా తల్లి పాత్రలకు షిఫ్ట్ అయిపోయింది. అయితే ఆ పాత్రలకు భిన్నంగా నటించే అవకాశం దక్కడంతో బిగ్ స్క్రీన్ కు బాయ్ బాయ్ చెప్పేసి వెబ్ ప్రపంచంలోకి ఎంటరైంది. మీనా టైటిల్ పాత్రలో నటించిన వెబ్ సిరీస్ `కరోలిన్ కామాక్షి`. జీ5లో ఈ వెబ్ సిరీస్ రాబోతోంది. ఇక హీరోయిన్ గా మంచి స్టేజ్‌లో వుండగానే వెబ్ సిరీస్ ల బాటపడుతున్నారు హన్సిక..అమలాపాల్.

`పిల్ల జమీందార్` భాగమతి చిత్రాల ఫేమ్ అశోక్ ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ ని రూపొందిస్తున్నారు. దీని ద్వారానే హన్సిక డిజిటల్ రంగంలోకి ఎంటరవుతోంది. బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన `లస్ట్ స్టోరీస్` ఆధారంగా తెలుగులో ఓ వెబ్ సిరీస్ రూపొందుతోంది. మొత్తం నాలుగు సిరీస్ లుగా రానున్న ఈ వెబ్ సిరీస్ లోని ఓ సీజన్ ని నందినిరెడ్డి రూపొందిస్తోంది. ఇందులో అమలాపాల్ నటిస్తోంది. మరో వెబ్ సిరీస్ లో యంగ్ హీరోయిన్ ఇషా రెబ్బా రష్మీగౌతమ్ నటిస్తున్నారు. రష్మీగౌతమ్ ట్రాన్స్ జెండర్ గా కనిపించబోతోంది. కాజల్ అగర్వాల్ తమిళ దర్శకుడు రూపొందిస్తున్న ఓ వెబ్ సిరీస్ తో ఎంటర్ కాబోతోంది. ఇప్పటికే రాధికా ఆప్టే.. నిహారిక కొణిదెల పలు వెబ్ సిరీస్ లలో నటించారు. ఇప్పటికీ నటిస్తున్నారు. త్వరలో ఈ రంగంలోకి సమంత కూడా ఎంటరవుతోంది. `ఫ్యామిలీ మ్యాన్ 2`లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ మ్యాన్ 1లో ప్రియమణి కీలక పాత్రను పోషించి మెప్పించింది. పార్ట్ 2లోనూ కనిపించనుంది. అలాగే యంగ్ హీరో వరుణ్ సందేశ్ సతీమణి `బిగ్ బాస్ 3` ఫేం వితిక శేరు ఇప్పటికే `ఉర్మి` అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్ ఎగ్జయిట్ చేసింది. కళ్యాణ్ రామ్ సొంతంగా వెబ్ సిరీస్ లు నిర్మిస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పటికిప్పుడు 20-30 కంపెనీలు వెబ్ సిరీస్ ల నిర్మాణంలోకి అడుగు పెడుతున్నాయి. పలు కార్పొరెట్ కంపెనీలు వెబ్ సిరీస్ ల బాట పడుతుండడంతో ఆర్టిస్టులు.. రైటర్లకు.. దర్శకత్వ శాఖలో ఉన్నవారికి మంచి అవకాశాలొస్తున్నాయని తెలుస్తోంది.