సుక్కుకు - త్రివిక్రమ్ కు తేడా అదే..!

Tue Sep 29 2020 20:00:14 GMT+0530 (IST)

Difference Between Sukku And Trivikram

టాలీవుడ్‌ను దాటి ఎక్కడికో వెళ్లిపోయిన రాజమౌళిని పక్కన పెట్టేస్తే.. మన సినీ పరిశ్రమలో ప్రస్తుతం టాప్ ఫాంలో ఉన్న అగ్ర దర్శకులు సుకుమార్ త్రివిక్రమ్. దాదాపుగా ఒకే సమయంలో దర్శకులుగా మారిన ఈ ఇద్దరూ స్థాయి పరంగా ఎవరికి ఎవరూ తీసిపోరు. పనితనం పరంగా చూసినా.. విజయాల పరంగా చూసిన వీళ్లిద్దరూ ఎవరికి వాళ్లే సాటి. తమ చివరి చిత్రాలతో ఈ అగ్ర దర్శకులు నాన్-బాహుబలి హిట్లు అందించడం విశేషం. నేరుగా బాక్సాఫీస్ దగ్గర ఢీకొట్టింది లేదు కానీ.. పరోక్షంగా మాత్రం పోటీ నడుస్తూనే ఉంటుంది. ఎవరేం చేసినా.. ఇంకొకరితో పోలిక పోటీ గురించి చర్చ నడుస్తుంటుంది. హీరోల అభిమానుల్లా కొట్టేసుకోవడం ఉండదు కానీ.. ఈ దర్శకుల అభిమానుల మధ్య కూడా వాదనలు చర్చలు నడుస్తుంటాయి. సుకుమార్ తాజాగా ఓ కొత్త సంస్థలో విజయ్ దేవరకొండతో సినిమాను ప్రకటించిన నేపథ్యంలో త్రివిక్రమ్ పేరును తీసుకొచ్చి ఓ చర్చ నడిపిస్తున్నారు నెటిజన్లు.సుకుమార్ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు టాటా చెప్పేయడమే ఇక్కడ డిస్కషన్ పాయింట్. ‘రంగస్థలం’ సినిమాతో ఈ సంస్థతో అసోసియేట్ అయిన సుకుమార్.. దాని తర్వాత ‘పుష్ప’ను కూడా ఇదే బేనర్లో చేస్తున్నారు. అలాగే సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబును దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రీ వాళ్లు ‘ఉప్పెన’ తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కూడా సుక్కు పర్యవేక్షిస్తున్నారు. సుక్కుకు అమితమైన గౌరవం ఇస్తూ.. అన్ని రకాలుగా సహకారమందిస్తున్న మైత్రీ సంస్థ ఆయనకు హోం బేనర్ లాగా మారిపోయిందని అనుకున్నారు. కానీ తన తర్వాతి చిత్రాన్ని వేరే సంస్థకు చేస్తున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచాడు సుక్కు. దీంతో త్రివిక్రమ్ హారిక హాసిని సంస్థకు ఉన్నంత లాయల్‌గా సుక్కు మైత్రీ వాళ్లతో లేడన్న డిస్కషన్ నడుస్తోంది.

కానీ త్రివిక్రమ్ ఏ స్థితిలో హారిక హాసిని వాళ్లతో అసోసియేట్ అయ్యాడన్నది ఇక్కడ కీలక విషయం. ‘ఖలేజా’ ‘అత్తారింటికి దారేది’ సినిమాల విషయంలో నిర్మాతలతో త్రివిక్రమ్‌కు గొడవలొచ్చాయి. ముఖ్యంగా ‘ఖలేజా’ విషయంలో బాగా ఇబ్బంది పడ్డాడు. అలాంటి స్థితిలో హారిక హాసిని వాళ్ల పనితీరు నచ్చి వాళ్లతో వరుసబెట్టి సినిమాలు తీస్తూ వెళ్లాడు. ఆ సంస్థలో త్రివిక్రమ్ నిర్మాణ భాగస్వామిగా చెప్పొచ్చు. బయట చేసిన సినిమాలతో పోలిస్తే చాలా కంఫర్ట్ భారీగా ఆదాయం వస్తుండటంతో త్రివిక్రమ్ మళ్లీ వేరే వాళ్లకు సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించట్లేదు. సుక్కు విషయానికి వస్తే.. మైత్రీ వాళ్లతో మంచి అసోసియేషనే ఉంది కానీ వాళ్లకు తప్ప బయటి వాళ్లకు సినిమాలే చేయకూడదన్న నియమం ఏమీ పెట్టుకోలేదు. ఆయనకూ బయట కొన్ని కమిట్మెంట్లు ఉంటాయి. కాబట్టి ఆయన త్రివిక్రమ్ లాగా ఒకే సంస్థకు అంకితమైపోవాలని కోరుకోవడం కరెక్ట్ కాదేమో.