Begin typing your search above and press return to search.

RRR విష‌యంలో వారు క్ష‌మించ‌రాని త‌ప్పు చేశారా?

By:  Tupaki Desk   |   25 Jan 2023 11:25 AM GMT
RRR విష‌యంలో వారు క్ష‌మించ‌రాని త‌ప్పు చేశారా?
X
యావ‌త్ దేశం మొత్తం ఆస్కార్ అవార్డుల ప్ర‌క‌ట‌న కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. భార‌తీయ ప్రేక్ష‌కులు ఎన్నో ఏళ్ల క‌ల‌ని 'RRR' నిజం చేసి ప్ర‌పంచ య‌వ‌నిక‌పై భార‌తీయ సినిమా కీర్తి ప‌తాకాన్ని రెప రెప‌లాడిస్తుంద‌ని అంతా ముక్త‌ కంఠంతో కోరుకుంటున్నారు. అంతే కాకుండా ఆస్కార్ రేసులో అత్య‌ధిక విభాగాల్లో ఈ సినిమా ఎంట్రీని సాధించ‌డ‌మే కాకుండా ఊహించ‌ని విధంగా అవార్డుల్ని ద‌క్కించుకుని సంచ‌ల‌నం సృష్టిస్తుంద‌ని అత్య‌ధిక శాతం మంది అంచ‌నా వేస్తూ వ‌చ్చారు.

అయితే 24న ఆ అంచ‌నాల‌న్నీ త‌ల‌కిందుల‌య్యాయి. ఊహించ‌ని విధంగా 'RRR' ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో 'నాటు నాటు' పాట ప‌రంగా మాత్ర‌మే నామినేష‌న్ ని ద‌క్కించుకోవ‌డం ప‌లువురిని షాక్ కు గురిచేస్తోంది. ఉత్త‌మ న‌టుడు, ఉత్త‌మ ద‌ర్శ‌కుడు, ఉత్త‌మ చిత్రం విభాగాల్లో 'RRR' మిగ‌తా సినిమాల‌తో పోటీప‌డుతుంద‌ని ఆశ‌ప‌డ్డారు. ఆ ఆశ నిరాశ‌గా మారింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఇప్ప‌టికే 'నాటు నాటు 'పాట‌కు ద‌క్క‌డంతో ఆస్కార్ లోనూ ఇదే సాంగ్ ద్వారా 'RRR'కు ఆస్కార్ ద‌క్కే అవ‌కాశాలైతే వున్నాయి.

కానీ మిగ‌తా విభాగాల్లో 'RRR' పోటీప‌డ‌లేక‌పోవ‌డానికి మ‌న దేశం నుంచి ఓ క్ష‌మించ‌రాని త‌ప్పు జ‌రిగిన‌ట్టుగా ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా వేదిక‌గా హాట్ హాట్ చ‌ర్చ జ‌రుగుతోంది. ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా ఆస్కార్ కు మ‌న దేశం త‌రుపున 'RRR'ని పంపించ‌క‌పోవ‌డ‌మే తాజా త‌ప్పిదానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని అంటున్నారు. ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా క‌న‌క అధికారికంగా 'RRR' ని ఆస్కార్ కు నామినేట్ చేసి వుంటే ప‌రిస్థితి మ‌రోలా వుండేద‌నే విమ‌ర్శ‌లు వెల్లు వెత్తుతున్నాయి.

దేశ విదేశాల‌కు చెందిన ప్రేక్ష‌కులు, సెల‌బ్రిటీలు సైతం ప్ర‌శంస‌లు కురిపిస్తున్న 'RRR' ఖ‌చ్చితంగా ఆస్కార్ బ‌రిలో అద్భుతాలు సృష్టించేద‌ని క‌నీసం మూడు విభాగాల్లో అయినా అవార్డుల్ని సొంతం చేసుకుని భార‌తీయుల ఆశ‌లని నిజం చేసేద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఈ విష‌యంలో త‌ప్పంతా ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా స‌భ్యుల‌దే అని వాపోతున్నారు. వారి కార‌ణంగానే 'RRR' ప‌లు విభాగాల్లో నామినేట్ అయ్యే అవ‌కాశాన్ని కోల్పోయింద‌ని మండిప‌డుతున్నారు.

ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా మ‌న దేశం త‌రుపున ఆస్కార్ కు పంపిన సినిమా 'ఛ‌ల్లో షో'. ఇది గుజ‌రాతీ సినిమా. ఈ మూవీ కార‌ణంగానే 'RRR' ఆస్కార్ కి నామినేట్ కాలేక‌పోయింది. చివ‌రి నిమిషంలో షార్ట్ లిస్ట్ కావ‌డం వ‌ల్లే 'RRR'తో పాటు మ‌న దేశం నుంచి మొత్తం ప‌ది సినిమాలు ఆస్కార్ బ‌రిలో నిలిచిన విష‌యం తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.