దివాళా తీసి రోడ్డున పడిన స్టార్ హీరో ఫ్యామిలీ

Thu Jun 17 2021 08:00:01 GMT+0530 (IST)

Did You Know That Aamir Khan And His Family Faced Financial Problems

టాలీవుడ్ లో ఎందరో వెటరన్ నిర్మాతలు ఈరోజుల్లో సినిమాలు తీయడం లేదు. ఎథిక్స్ లేని చోట పని చేయలేమని వదులుకున్నవాళ్లున్నారు. సనాతన ధర్మం లేని చోట.. విలువల్లేని ప్రకృతి విరుద్ధమైన ఇలాంటి చోట నిర్మాతలుగా కొనసాగలేమని పేరున్న నిర్మాతలు వ్యాఖ్యానించిన సందర్భాలున్నాయి. చాలా పెద్ద బ్యానర్లు అలానే కనుమరుగయ్యాయి. ఇక విలువలతో పెట్టుబడులు పెట్టి రోడ్డున పడిన నిర్మాతలు కోకొల్లలు.తాజాగా మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తన గతంలోకి వెళ్లి తమ కుటుంబం ఎలా దివాళా తీసిందో పెద్ద నిర్మాత అయిన తన తండ్రి గారు ఎలా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారో వెల్లడించారు. అమీర్ ఖాన్ బాలీవుడ్  మెగాస్టార్ గా బోలెడంత ఆర్జించినా కానీ తన కుటుంబానికి ఒక చేదు గతం అనేది ఉంది. అతను ఒక సినీ కుటుంబం నుండి వచ్చినవాడు. తన తండ్రి మామయ్య ఆ కాలపు అగ్ర నిర్మాతలుగా కొనసాగారు.

కానీ అమీర్ తన తండ్రి ఈ రంగంలో సంపాదించిందేమీ లేదని తెలిపారు. ఒక పేద నిర్మాత అని ఈ కమర్షియల్ ప్రపంచంలో డబ్బు సంపాదించలేదని చెప్పారు. ఒకానొక సమయంలో తన తండ్రి ఎలా దివాళా తీశారో వెల్లడించారు. ``నాన్న చాలా ఉత్సాహభరితమైన నిర్మాత. కానీ అతనికి వ్యాపారం ఎలా చేయాలో తెలియదు. కాబట్టి ఎప్పుడూ డబ్బు సంపాదించలేదు. ఆయన చిత్రాలలో ఓ సినిమాని నిర్మించడానికి ఎనిమిది సంవత్సరాలు పట్టింది. మరొకటి మూడు సంవత్సరాలు పట్టింది. మీలో చాలామందికి ఇది తెలియదు. కాని మా కుటుంబం దాదాపు దివాళా తీసింది. ఆ సమయంలో దాదాపు రోడ్లపై ఉన్నాము`` అని అమీర్ అన్నారు.

మిస్టర్ పర్ఫెక్ట్ గా అమీర్ ఖాన్ ఇంతింతై అన్న చందంగా ఎదిగారు. స్టార్ హీరోగా బాలీవుడ్ ని ఏల్తున్నారు. ఆయన నిర్మాతగా ఏనాడూ ఫెయిల్ కాలేదంటే గతంలో నేర్చుకున్న పాఠాలేనని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆయన లాల్ సింగ్ చద్దా అనే చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి పీకే దర్శకుడితోనూ పని చేసే ప్లాన్ లోనూ ఉన్నారు.