భారీగా అప్పులు పాలై నిర్మాత ఇల్లు అమ్మారా?

Wed Feb 19 2020 16:30:38 GMT+0530 (IST)

Did The producer sell The House with Huge Debts?

వరుసగా మూడు సినిమాలు ఫ్లాపై వెటరన్ నిర్మాత పీకల్లోతు అప్పుల్లో మునిగారట. అంతేకాదు.. ఆ అప్పులు తీర్చేందుకు సొంత ఇల్లు అమ్ముకున్నారని.. ఇక ఇటీవలే రిలీజై డిజాస్టరైన సినిమాకి పారితోషికాలు చెల్లించేందుకు ఆయన ఉన్నవన్నీ అమ్మేసుకున్నారని ప్రచారం అవుతోంది. ఇప్పుడు సొంత ఇల్లు అయినా లేక మాదాపూర్ లో ఓ ఇల్లును అద్దెకు తీసుకుని నివశిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. బ్యాక్ టు బ్యాక్ అన్ని కష్టాలు వచ్చిన ఆ నిర్మాత ఎవరు? అంటే..ఆయన అభిరుచి గురించి.. ఆయన కమిట్ మెంట్ గురించి .. మంచి మనస్తత్వం గురించి నిరంతరం వేదికలపై ఎందరో ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తుంటారు. మెగాస్టార్ చిరంజీవి అంతటివారే ఆయన ఫ్యాషన్ గురించి రెగ్యులర్ గా ప్రస్థావిస్తుంటారు. కెరీర్ లో ప్రతిదీ క్లాసిక్ మూవీనే. అన్నీ అభిరుచి గల సినిమాలు తీశారు. కానీ వీటి వల్ల పైసా రాకపోగా తిరిగి తీవ్రంగా నష్టాలు తప్పలేదు. అందుకే ఆయన ఇప్పుడు అప్పులపాలై ఉన్నవి అమ్ముకున్నారన్న ప్రచారం సాగుతోంది. లేటెస్టుగా క్రేజీ హీరో నటించిన న మూవీతోనూ ఏకంగా 20కోట్ల మేర నష్టాలు తెచ్చిందన్న టాక్ ట్రేడ్ లో వినిపించింది.

అయితే ఇన్ని ఫ్లాపులొచ్చినా ఆయన ఏనాడూ హీరోలు- దర్శకుల పారితోషికాలు కానీ... ప్రొడక్షన్ వాళ్ల పారితోషికాలు కానీ ఎగ్గొట్టలేదు. లైట్ బోయ్ నుంచి తిండి పెట్టే బోయ్ వరకూ అందరికీ పారితోషికాలు టైముకి చెల్లించారు. ఇచ్చిన మాట ప్రకారం అందరికీ చెల్లింపులు చేశారట. ఇప్పుడు హీరోగారి పారితోషికం చెల్లించేందుకు ఏకంగా తన ఇల్లునే అమ్మేసుకున్నారని ప్రచారమవుతోంది. అప్పు చేస్తే ఐపీ పెట్టేవాళ్లున్న మాయా ప్రపంచంలో ఇలాంటి మంచితనం ఉన్న నిర్మాతలు కూడా ఉంటారా? అంటూ ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఇక ఆయనలాగే కమిట్ మెంట్ తో ఉన్న ఎందరో క్లాసిక్ డేస్ నిర్మాతలు సినిమాలు తీయలేక చేతులెత్తేసి తెరమరుగైపోయారు. కానీ ఈయన మాత్రం ఫ్యాషన్ చంపుకోలేక ఫ్లాపులొస్తున్నా పదే పదే ప్రయత్నిస్తున్నారు. ఎన్ని ఫ్లాపులొచ్చినా వరుసగా అభిరుచి ఉన్న కథల్నే ఎంచుకుని సినిమాలు తీస్తున్నారు. ఆయనకు ఫ్లాపులొచ్చాయని బాధపడాలా.. లేక అప్పులయ్యాయని కుంగిపోవాలా? ఇది పరిశ్రమే నిర్ణయించాలి.