నటకిరీటి విషయంలో ఆపరేషన్ సక్సెస్ పేషెంట్..!

Fri Jan 17 2020 16:08:16 GMT+0530 (IST)

Did Rajendra Prasad Help SLN Or AVPL?

హీరోగా ఎన్నో హిట్ చిత్రాలు అందించి ప్రస్తుతం కమెడియన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా పెద్ద సినిమాల్లో కనిపిస్తున్న నటుడు రాజేంద్ర ప్రసాద్. ఈయన గతంతో పోల్చితే ఈమద్య తన పాత్రలతో ఆకట్టుకోలేక పోతున్నాడు అని చెప్పక తప్పదు. ముఖ్యంగా సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు మరియు అల వైకుంఠపురంలో చిత్రాల్లో ఈయన కీలక పాత్రల్లో కనిపించాడు. రెండు పెద్ద సినిమాలు.. అవి కూడా సంక్రాంతి సినిమాల్లో ఈయన కనిపించడం అంటే మామూలు విషయం కాదు.రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కాని ఈయన పాత్రలు మాత్రం సినిమాల్లో పేలలేదు. ఈయన్ను దర్శకులు చాలా తేలికైన పాత్రల్లో చూపించడంతో పాటు ఏదో కూరలో కరివేపాకు పాత్రల్లో ఈయన్ను నటింపజేశారు. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ బాబు పక్కన ఉండే పాత్ర అయినా కూడా పెద్దగా ప్రాముఖ్యత లేదు. ఉన్న కొన్ని సీన్స్ లో రాజేంద్ర ప్రసాద్ నవ్వించడంలో విఫలం అయ్యాడు.

ఇక అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో చిత్రంలోనూ రాజేంద్ర ప్రసాద్ ఒక సాదా సీదా పాత్రలో కనిపించాడు. పెద్దగా ఆకట్టుకోలేక పోయాడు. ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ మంచి కామెడీ సీన్స్ చేశాడు. కాని ఇప్పుడు ఆయన స్టామినా అయ్యిపోయిందా లేదంటే ఆయన్ను దర్శకులు వినియోగించుకోలేక పోతున్నారా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సంక్రాంతి సినిమాలు సక్సెస్ అయినా ఆయనకు మాత్రం ఏమాత్రం లాభం లేకుండా పోయింది. అందుకే ఆపరేషన్ సక్సెస్ అయినా పేషెంట్ డెడ్ అంటూ రాజేంద్ర ప్రసాద్ గురించి సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.