అభిమానుల మధ్య నారప్ప చిచ్చు

Wed Jan 22 2020 19:26:43 GMT+0530 (IST)

Dhanush Fans Trolls Venkatesh Narappa

అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అభిమానం హద్దు మీరితే ఎలా ఉంటుందో ఇప్పటికే చాలా సంఘటనలు నిరూపించాయి. హీరోల్ని అమితంగా ప్రేమించే దక్షిణాది సినీ పరిశ్రమలో ఈ వార్ చాలా కామన్. అదీ తెలుగు-తమిళ్  అభిమానుల అత్యుత్సాహం ఎప్పుడూ హీరోలకు తలనొప్పే. తాజాగా మరోసారి తెలుగు-తమిళ్ స్టార్ హీరోల అభిమానులు ఒకరితో ఒకరు వార్ కి తలపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకుంటూ తెగబడడం హాట్ టాపిక్ గా మారింది.తమిళ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన అసురన్ చిత్రాన్ని విక్టరీ వెంకటేష్ నారప్ప టైటిల్ తో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్...టైటిల్ ని తాజాగా రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో సరికొత్త వివాదానికి తావిచ్చింది. నారప్ప పోస్టర్ విడుదలైన అనంతరం #UnrivalledTamilActors VS #TeluguRealHeroes అనే వివాదాస్పద హ్యాష్ ట్యాగ్  ట్రెండ్ అవుతోంది. అంటే తెలుగు హీరోలే గొప్ప అంటూ కొందరు...కాదు మా తమిళ్ హీరోలే గొప్ప అని ఇంకొందరు నెటిజనులు యుద్దం మొదలు పెట్టారనే దీనర్థం. సరిగ్గా నారప్ప పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత ఈ పదం సోషల్ మీడియాని ఒక రేంజులో ఊపేస్తోంది. ధనుష్ అభిమానులు ఈ పోస్టర్ ని ట్రోల్ చేస్తూ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.

ధనుష్ ఫ్యాన్స్ కి కౌంటర్ గా వెంకీ అభిమానులు ఏమాత్రం తగ్గలేదు. తంబీలంతా సాంబారు ఫ్యాన్స్!! అంటూ కామెంట్లతో ఉడికించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వెంకీ-ధనుష్ అభిమానుల మధ్య భాషాభేధంతో సంబంధం లేకుండా కోల్డ్ వార్  నడుస్తోంది. ఈ వార్ మధ్యలోకి హీరో సిద్దార్థ్ తలదూర్చారు. సౌత్ ఇండియా అభిమానుల్లో పైత్యం పెరిగిపోయి మరో ఛాలెంజ్ మొదలెట్టారు. ఇంటర్నెట్ ను ఎంతగా  వృథా చేస్తున్నారో? అదే సమయాన్ని డేటాని దేశం కోసం ఉపయోగిస్తే ఎంతో మేలు జరిగేదేమో! అంటూ కౌంటర్ గా కామెంట్లు పెట్టాడు. సిద్ధార్థ్ కి మద్దతుగా చాలా మంది హీరోలు స్పందించారు. గతంలో సిద్ధార్థ్  పలువురు నెటిజనులతో ఇదే వేదికపై అక్షింతలు వేయించుకున్న సంగతి తెలిసిందే. తాజా వివాదంలో తల దూర్చిన సిద్ధార్థ్ కు ధనుష్- వెంకీ అభిమానుల నుంచి కౌంటర్ ఎటాక్స్ స్టార్టయ్యాయి.