ధమాకా ఎఫెక్ట్.. మాస్ రాజా విభిన్నమైన ప్రయత్నం

Tue Jan 24 2023 08:00:01 GMT+0530 (India Standard Time)

Dhamaka Effect.. Mass Raja In a different effort

ధమాకా మరియు వాల్తేరు వీరయ్య సినిమాలతో మాస్ మహారాజా రవితేజ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను తన ఖాతాలో వేసుకున్న విషయం తెల్సిందే. ధమాకా సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేయడం... వాల్తేరు వీరయ్య సినిమాలో కీలక పాత్రలో నటించడం తో రవితేజ గత కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తూ ఉన్నాడు. తాజాగా మరోసారి రవితేజ వార్తల్లో నిలిచాడు.ప్రస్తుతం రవితేజ సినిమాల లైనప్ చాలానే ఉంది. వెంటనే రావణాసుర అనే సినిమా తో రాబోతున్నాడు. ఆ తర్వాత టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా లైన్ లో ఉంది. ఈ రెండు సినిమాలు కాకుండా మరో రెండు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నట్లుగా ఆయన సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది.

ఇన్ని సినిమాలు ఉండగా రవితేజ తో సినిమాను చేసేందుకు విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న ప్రశాంత్ వర్మ ప్రయత్నాలు చేస్తున్నాడని.. ఇటీవల రవితేజకు ఆయన చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడనే వార్తలు కూడా జోరుగా వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం హనుమాన్ సినిమా ను విడుదల చేసే పనుల్లో బిజీగా ఉన్న ప్రశాంత్ వర్మ ఈ సమ్మర్ లోనే రవితేజ తో సినిమాను పట్టాలెక్కించేలా ప్లాన్ చేస్తున్నాడట.

అ! సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ జార్జిరెడ్డి సినిమాను చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో హనుమాన్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

రవితేజ ఇమేజ్ కు ప్రశాంత్ వర్మ మేకింగ్ స్టైల్ కి కచ్చితంగా తేడా ఉంటుంది. అయినా కూడా ధమాకా సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో ప్రశాంత్ వర్మతో రవితేజ ప్రయోగం చేస్తే పోయేది ఏమీ లేదు అంటూ ఆయన అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన హనుమాన్ విడుదల అయిన తర్వాత వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.