ధాకడ్ ట్రైలర్ 2 : మరో లెవల్లో ఏజెంట్ విరవిహారం

Thu May 12 2022 21:22:20 GMT+0530 (IST)

Dhaakad Official Trailer 2

రణభూమిలో ప్రవేశిస్తే శత్రువు అంతం చూడడం ఒక్కటే లక్ష్యం. ఓవైపు ప్రవాహంలా యుద్ధభూమి నెత్తురోడుతుంటే దానిని కూడా ఆస్వాధిస్తూ ముందుకు సాగిపోవాలి. అలా లేకపోతే శత్రువు మనల్ని అంతం చేస్తాడు. ఫస్ట్ బ్లడ్ - ర్యాంబో లాంటి చిత్రాల్లో సిల్వస్టర్ స్టాలోన్ నటనను వీక్షించిన వారు ఎప్పటికీ ఇది మరువలేరు. మళ్లీ ఇప్పుడు ఆ రేంజు ధాకడ్ లో కనిపిస్తోంది. ఇందులో లేడీ స్టాలోన్ రేంజులో విరుచుకుపడుతోంది కంగన రనౌత్.తాజాగా ధాకడ్ ట్రైలర్ 2 విడుదలైంది. రుద్రవీర్ (అర్జున్ రాంపాల్ ) కోసం వేటలో ఏజెంట్ అగ్నిగా కంగనా రనౌత్ నిప్పులు చెరుగుతోంది.  ఈ ఇద్దరూ హీరో విలన్ గా నటించిన ఈ చిత్రం మే 20న విడుదలకు సిద్ధమవుతుండగా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.  ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ యాక్షన్ చిత్రం ధాకడ్ విడుదలకు సిద్ధమవుతుంటే కంగన ఫ్యాన్స్ లో టెన్షన్ రగులుకుంటోంది.

కంగనా రనౌత్ - అర్జున్ రాంపాల్ ఈ చిత్రంలో ఒకరితో ఒకరు పోటీపడి మరీ నటించారని తాజా ట్రైలర్ 2 వీక్షిస్తే అర్థమవుతోంది. ఈ చిత్రంలో కంగనా భీకరమైన ఏజెంట్ అగ్ని పాత్రలో అల్లాడిస్తోంది. అర్జున్ రాంపాల్ రుద్రవీర్ తో ముఖాముఖి తలపడే అగ్నిగా చండ్ర నిప్పులు చెరుగుతోంది.  

కంగన రుద్రవీర్ ని వెతుకుతూ వెళ్లే క్రమంలో రక్తపాతం హింస ఒక రేంజులో కనిపిస్తోంది. అయితే కంగన పాత్ర ఆద్యంతం బోలెడన్ని ట్విస్టులతో సాగ నుందని విజువల్స్ చూస్తుంటే అర్థమవుతోంది. భారీ వెపన్స్ తో విరుచుకుపడుతూ కంగన హత్యాకాండకు దిగడం ... రుద్రవీర్  వద్దకు రావడానికి ఏమైనా చేసేందుకు వెనకాడని తత్వం ఇందులో కనిపిస్తోంది. ట్రైలర్ 2లోనూ గూండాలతో పోరాడుతూ కనిపించింది . సినిమా మొదటి ట్రైలర్ లో వెల్లడించినట్లుగా ఆసియాలోని అతిపెద్ద మానవ అక్రమ రవాణా సిండికేట్ ను ఛేదించడానికి రహస్యంగా వేట ప్రారంభిస్తుంది అగ్ని.  కొన్ని హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలలో కంగన అభినయం అద్భుతం. కత్తి ఝలిపిస్తూ తుపాకీతో విరుచుకుపడుతూ అల్లాడిస్తోంది కంగన.

ట్రైలర్ లో అర్జున్ రాంపాల్ విలన్ గా కనిపించిన చాలా తక్కువ సన్నివేశాలు ప్రేక్షకులకు అతని పాత్ర ఎలా ఉంటుందో సూచనలు ఇచ్చాయి. అతను ఏజెంట్ అగ్నితో ముఖాముఖిగా తలపడతాడు. యాక్షన్ సన్నివేశాల్లో వీక్షకులు వారి సీట్ల అంచున ఆగి వీక్షిస్తారనడంలో సందేహం లేదు. ట్రైలర్ చివరలో విలన్ల భరతం పడుతూ.. ``అమ్మాయితో చెలరేగిపోవడం తప్పు`` అని విలన్ చెప్పేలా చేస్తుంది.

రజ్నీష్ ఘాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటి ట్రైలర్ వీక్షకులకు ప్లాట్ గురించి ఒక ఆలోచనను ఇచ్చింది. విడుదల కోసం ఆసక్తిగా వేచి చూసేలా చేయగలిగింది. ట్రైలర్ లో అనేక విన్యాసాలు జేమ్స్ బాండ్ మూవీ తరహాలో ఆకట్టుకున్నాయి. మధ్య భారతదేశంలోని బొగ్గు గనుల బెల్ట్ నుండి నిర్వహించబడుతున్న ఆసియాలో అతిపెద్ద మానవ అక్రమ రవాణా సిండికేట్ ను ఛేదించే లక్ష్యంతో ఏజెంట్ అగ్ని దూకుడుగా ముందుకు వెళుతున్నట్లు ట్రైలర్ లో కనిపించింది. సిండికేట్ ను నడుపుతున్న వారి పేర్లతో కూడిన పుస్తకాన్ని ఆమెకు అందజేస్తారు.

ఆమె భయంకరమైన ఎటాక్ స్టార్ట్ చేస్తుంది. కంగన తన గతం నుండి వచ్చిన బాధలను ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి ఆమె దుర్బలంగా ఉన్నట్లు కూడా  ట్రైలర్ లో చూపించారు. కొన్నిసార్లు ట్రైలర్ లో గూండాలచే బంధించినట్టు కనిపించింది. ఆమె స్వేచ్ఛ కోసం పోరాడవలసి వచ్చింది. ఈ చిత్రం మే 20న విడుదల కానుంది. కంగనను సరికొత్త అవతారంలో వీక్షించేందుకు అభిమానులు వేచి ఉండలేరనడంలో సందేహం లేదు.