యాడ్ తెచ్చిన తంట.. తలపట్టుకున్న స్టార్ హీరోయిన్!

Thu Mar 04 2021 10:00:01 GMT+0530 (IST)

Deepika starred in the  Levis Jeans commercial ad

గ్లామర్ ప్రపంచంలో సినీతారలు ఎంతగా పాపులారిటీ దక్కించుకుంటారో.. ఒక్కసారి దొరికితే అదే రేంజిలో విమర్శలు కూడా ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్నిసార్లు అనుకోకుండా జరిగిన దానికి అర్హులమైతే వేరే సంగతి. కానీ వేరేవాళ్ల పొరపాటు ప్రభావం మన మీదపడితే మాత్రం అసలు భరించలేం. అలాగని ఏమి చేయలేము. ప్రస్తుతం అలాంటి సమస్యనే ఎదుర్కొంటుంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే. ఆమె చేయని పొరపాటుకు కూడా పలువురు నెట్టింట ఆరోపణలు తనమీద తోసేస్తున్నారు. కాపీ క్యాట్ అనే ఆరోపణలను భరించాల్సి వస్తోంది దీపికకు. మరి అంతటి చిక్కు ఏం వచ్చిపడింది.. అంటే మాత్రం లెవి క్లాత్స్ యాడ్ ఫిల్మ్ గురించి మాట్లాడాల్సిందే.వివరాల్లోకి వెళ్తే.. ఇటీవలే దీపికా లెవిస్ జీన్స్ కమర్షియల్ యాడ్‌లో నటించింది. అంతా కూల్ గా బాగానే ఉంది. కానీ యాడ్ ప్రసారం అయ్యాక మూడు రోజులకే వివాదం మొదలయింది. ఈ యాడ్ షూట్ కోసం వేసిన స్టూడియో సెటప్ యే బాలెట్ అనే సినిమాకోసం వేసిన సెటప్‌లా ఉండటం వివాదాలకు దారితీసింది. ఇంతలో యే బ్యాలెట్ డైరెక్టర్ సూని సూని తారాపోరేవాలా ఈ యాడ్ పై స్పందించడంతో ఈ వివాదానికి మరింత బలం చేకూరింది. నిజానికి యాడ్ చూస్తే.. 1982లో బప్పిలహరి ఉషా ఉతుప్ పాడిన హిట్ నంబర్ "ఆవా-ఆవా" ట్యూన్స్‌కు దీపిక సెట్స్‌లోకి ప్రవేశించి డ్యాన్స్ చేయడం వీడియోలో కనిపిస్తుంది.

ఈ వీడియో ఇప్పటికే యూట్యూబ్‌లో 5.6 మిలియన్లకు పైగా వీక్షణలను పొందింది. అయితే ఈ యాడ్ షూట్ చేసిన స్టూడియో గురించి.. క్రియేటివ్ డైరెక్టర్ రూపీన్ సూచక్ ను అడిగింది డైరెక్టర్ సూని. ఏమనంటే.. 'చూస్తుంటే మా యే బ్యాలెట్ సెట్ లో షూట్ చేసినట్లుగా ఉంది నిజమేనా..?' అనే ప్రశ్నకు రూపీన్ స్పందిస్తూ.. 'అవును. మా డైరెక్టర్ కోరుకున్న విధంగా అదే సెట్ రీక్రియేట్ చేసాం' అని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు ఆ సంభాషణ స్క్రీన్ షాట్ కూడా సోషల్ మీడియాలో పెట్టింది డైరెక్టర్ సూని.ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ 'భారతదేశంలో కాపీకాట్ సంస్కృతి పోవాలి' అని ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట సంచలనంగా మారింది.