'ఎవరు మీలో కోటీశ్వరులు' గేమ్ షో ని ఎన్టీఆర్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే..!

Thu Jul 22 2021 09:00:01 GMT+0530 (IST)

Date Locked For Jr NTR Re entry With Evaru Meelo Koteeswarulu

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మరో స్టార్ హీరో రామ్ చరణ్ తో కలిసి 'ఆర్ ఆర్ ఆర్' సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ప్రమోషన్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ఇందులో పలువురు స్టార్స్ తో పాటుగా తారక్ కూడా పాల్గొంటున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయనున్న ''ఎవరు మీలో కోటీశ్వరులు'' గేమ్ షో ని ప్రారంభించడానికి రెడీ అవుతున్నారు. జెమినీ టీవీలో ప్రసారం కానున్న ఈ షో కోసం ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.'ఎవరు మీలో కోటీశ్వరులు' క్విజ్ షో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న మొదలు కానుందని టాక్ నడుస్తోంది. సోషల్ మీడియాలో దీని గురించి వార్తలు వస్తుండటంతో నందమూరి అభిమానులు బుల్లితెర పై ఎన్టీఆర్ ను మరోసారి చూడొచ్చని ఖుషీ అవుతున్నారు. ఇకపోతే స్టార్టింగ్ ఎపిసోడ్స్ కి తన 'RRR' కో స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా హాజరవుతారని తెలుస్తోంది. ఈ విధంగా గేమ్ షో ని గ్రాండ్ గా ప్రారంభించడంతో పాటుగా 'ఆర్ ఆర్ ఆర్' చిత్రానికి ప్రమోషన్స్ కూడా చేయనున్నారు.

'బిగ్ బాస్' తెలుగు రియాలిటీ షో ద్వారా బుల్లితెర పై హోస్ట్ గా అడుగుపెట్టిన ఎన్టీఆర్ కు.. 'ఎవరు మీలో కోటీశ్వరులు' రెండవ షో. వెండితెర పై ప్రేక్షకులను అలరించిన తారక్..'బిగ్ బాస్' షో తో టెలివిజన్ స్క్రీన్ పై కూడా సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అవుతున్న తారక్.. క్విజ్ షో కోసం 60 ఎపిసోడ్లకు గానూ 10 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసిన 'కౌన్ బనేగా కరోడ్ పతి' గేమ్ షో తరహాలో ''ఎవరు మీలో కోటీశ్వరులు'' షో ఉండబోతోంది. ఇప్పటికే తెలుగులో 'కింగ్' అక్కినేని నాగార్జున హోస్ట్ గా 'మీలో ఎవరు కోటీశ్వరుడు' పేరుతో 'స్టార్ మా' లో మూడు సీజన్లను నడిపించారు. నాలుగో సీజన్ కు మాత్రం మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ హోస్ట్ గా వస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో కొన్ని మార్పులతో జెమిని టీవీలో ప్రసారం కానుంది. ఇందులో అన్ని ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పిన వారికి రూ.కోటి ప్రైజ్ మనీగా ఇవ్వనున్నారు.

వాస్తవానికి ఈ గేమ్ షో ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉంది. 'ఇక్కడ కథ మీది కల మీది.. ఆట నాది కోటి మీది.. రండి గెలుద్దాం' అంటూ ఎన్టీఆర్ కూడా తనదైన శైలిలో ప్రమోషన్స్ కూడా చేశారు. అలానే ఈ గేమ్ షో కు సంబంధించిన ప్రశ్నలకు కూడా అడిగేశారు. అయితే కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల వల్ల ఆలస్యం అయింది. ఈ క్రమంలో వచ్చే నెలలో 'ఎవరు మీలో కోటీశ్వరులు' ప్రసారనికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది.

ఇక సినిమాల విషయానికొస్తే.. కొమురం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 13న భారీ సస్థాయిలో విడుదల చేయనున్నారు. దీని తర్వాత 'జనతా గ్యారేజ్' దర్శకుడు కొరటాల శివ తో '#NTR30' సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఇదే క్రమంలో 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ ఓ పాన్ ఇండియా మూవీలో నటించనున్నారు.