మూవీ రివ్యూ : దసరా

Thu Mar 30 2023 19:21:59 GMT+0530 (India Standard Time)

Dasara Movie Review

'దసరా' మూవీ రివ్యూ
నటీనటులు: నాని-కీర్తి సురేష్-దీక్షిత్ శెట్టి-షైన్ టామ్ చాకో-సముద్రఖని-సాయికుమార్-ఝాన్సీ తదితరులు
సంగీతం: సంతోష్ నారాయణన్
ఛాయాగ్రహణం: సత్యన్ సూర్యన్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
రచన-దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెలటాలీవుడ్లో అత్యంత ప్రతిభావంతులైన యువ నటుల్లో నాని ఒకడు. కెరీర్లో ఎక్కువగా వైవిధ్యమైన సినిమాలతోనే అలరించిన నాని.. ఇప్పుడు నెవర్ బిఫోర్ అనదగ్గ పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆ పాత్ర ధరణి కాగా.. ఆ సినిమా దసరా. సుకుమార్ శిష్యుడైన కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.


కథ:

తెలంగాణ ప్రాంతంలోని వీర్లపల్లి అనే గ్రామంలో 90వ దశకంలో నడిచే కథ ఇది. ఆ ఊర్లో ధరణి (నాని).. వెన్నెల (కీర్తి సురేష్).. సూరి (దీక్షిత్) చిన్నప్పట్నుంచి స్నేహితులు. ధరణికి వెన్నెల అంటే ఇష్టం. వెన్నెల ఏమో సూరిని ఇష్టపడుతుంది. ఈ ముక్కోణపు ప్రేమకథ ఇలా సాగుతుండగా.. ఆ ఊరి సర్పంచ్ పదవికి సంబంధించిన గొడవ వల్ల ఈ ముగ్గురి జీవితాలు ఊహించని మలుపు తిరుగుతాయి. ఆ మలుపేంటి.. తర్వాత ఏం జరిగింది అన్నది తెర మీదే చూడాలి.


కథనం-విశ్లేషణ:

తెలుగు సినిమాలంటే సహజత్వం ఉండదని.. ఒక మూసలో సాగిపోతాయని.. హీరోలు ఎక్కడ్నుంచో ఊడి పడ్డట్లు ఉంటారని నిట్టూరుస్తూ.. తమిళం మలయాళ చిత్రాలతో పోల్చుకుని నిరాశ చెందే వాళ్ళం ఒకప్పుడు. కానీ గత కొన్నేళ్లలో మన కథలు చాలానే మారాయి. మన మట్టి కథల్లో కూడా కమర్షియాలిటీ ఉందని ఇక్కడి ఫిల్మ్ మేకర్స్ అర్థం చేసుకుని.. మన నేటివిటీతో సినిమాలు తీస్తున్నారు.
 
మనకి తెలిసిన మనుషుల్నే హీరోలుగా చూపిస్తున్నారు. నేటివిటీ ఫ్యాక్టర్ని హైలైట్ చేస్తూ.. సామాన్య పాత్రల్ని అసామాన్యంగా చూపిస్తూ తీసిన రంగస్థలం.. పుష్ప లాంటి సినిమాలు మంచి ఫలితాన్ని అందుకున్నాయి. ఇప్పుడు అదే కోవలో వచ్చిన చిత్రం.. దసరా. 90వ దశకంలో సింగరేణి ప్రాంతంలోని ఒక పల్లెటూరి నేపథ్యంలో చాలా నాటుగా తీసిన సినిమా ఇది. నాని పెర్ఫార్మెన్స్ కి తోడు స్టాండ్ ఔట్ గా నిలిచే కొన్ని ఎపిసోడ్లతో బలమైన ముద్రే వేస్తుంది. కథగా చూస్తే ఇదొక సగటు రివెంజ్ డ్రామాలాగా అనిపించినా.. ట్రీట్మెంట్ భిన్నంగా ఉండటం వల్ల 'దసరా' ఒక వైవిధ్యమైన సినిమా చూసిన ఫీలింగ్ కలిగిస్తుంది 'దసరా'.

పల్లెటూరి కథల్ని చాలా కాలం పక్కన పెట్టేసిన టాలీవుడ్.. ఈ మధ్యే వాటి సత్తా ఏంటో అర్థం చేసుకుంటోంది. మామూలు కథల్ని కూడా పల్లెటూరి నేపథ్యంలో రా అండ్ రస్టిగ్గా చూపిస్తే.. పాత్రల్ని కొంచెం టిపికల్ గా ప్రెజెంట్ చేస్తే ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వొచ్చని సుకుమార్ 'రంగస్థలం'తో రుజువు చేస్తే.. ఆయన శిష్యుడు శ్రీకాంత్ ఓదెల కూడా అదే బాటలో నడిచాడు. గురువు గోదావరి ప్రాంత నేపథ్యంలో గ్రామీణ రాజకీయాలతో ముడిపెట్టి 'రంగస్థలం' తీస్తే.. శిష్యుడు పక్కా తెలంగాణ నేటివిటీతో సినిమా తీశాడు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో.. అక్కడి రాజకీయాల చుట్టూ తిరిగే పక్కా కమర్షియల్ సినిమాగా 'దసరా'ను చెప్పొచ్చు. 90వ దశకం నాటి సింగరేణి గ్రామాల నేపథ్యాన్ని శ్రీకాంత్ ప్రెజెంట్ చేసిన తీరు సినిమాకు మేజర్ హైలైట్.  మనల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లినట్లుగా దర్శకుడి విజన్ కు తగ్గట్లుగా సాంకేతిక విభాగాలన్నీ 'దసరా'కు వెన్నుదన్నుగా నిలిచాయి. చాలా త్వరగా ఒక రస్టిక్ ఫీల్ వచ్చేస్తుంది 'దసరా' చూస్తుంటే. ఇక నాని సహా నటీనటులందరూ అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇవ్వడం.. సన్నివేశాలు కూడా ఆసక్తికరంగా సాగడంతో 'దసరా'తో కనెక్ట్ అయిపోతాం.

కమర్షియల్ సినిమాలు అనగానే స్టాండౌట్ గా నిలిచే కొన్ని ఎపిసోడ్లు ఆశిస్తాం. హీరోయిజం ఎలివేట్ అవ్వాలని కోరుకుంటాం. 'దసరా' వీటికి లోటు లేని సినిమా. ఇంకా పూర్తి స్థాయి మాస్ ఇమేజ్ సంపాదించని నాని.. 'దసరా'తో ఆ లోటు తీర్చేసుకున్నాడు. ఇంట్రో సీన్ దగ్గర్నుంచి నాని పాత్ర ఎలివేట్ అయ్యే సీన్లు బాగానే పడ్డాయి. సెకండాఫ్ లో ఇంకో లెవెల్ ఆశిస్తాం కానీ.. ఆ విషయంలో కొంచెం నిరాశ తప్పదు. 'దసరా'లో హైలైట్ అంటే ప్రథమార్ధమే. వీర్లపల్లి అనే గ్రామంలో సర్పంచి ఎన్నికల చుట్టూ దశాబ్దాలుగా సాగుతున్న రాజకీయ పరిస్థితులను దర్శకుడు బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. ముందు కథ చెప్పి.. ఆ తర్వాత మూడు ప్రధాన పాత్రలతో ప్రేక్షకులకు ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడేలా చేశాడు. క్రికెట్ ఎపిసోడ్.. ఆ తర్వాత ఎన్నికల సీన్.. కథ రసపట్టులో పడేందుకు కారణమయ్యాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ సినిమాలో స్టాండౌట్ గా నిలుస్తుంది. ఒళ్లు గగుర్పొడిచేలా ఆ ఎపిసోడ్ ను తీర్చిదిద్దాడు దర్శకుడు. ఆర్టిస్టులు.. టెక్నీషియన్లు అందరూ కూడా తమ బెస్ట్ ఇచ్చారు ఈ ఎపిసోడ్లో. తెలుగు సినిమాల్లో ఊహించలేని అరుదైన సన్నివేశంతో ఇంటర్వెల్ బ్యాంగ్ షాక్ కు గురి చేస్తుంది.

ఇంటర్వెల్ ఇచ్చిన హైతో ద్వితీయార్ధం నుంచి చాలా ఆశిస్తాం. కానీ సెకండాఫ్ ఒక ఫార్మాట్లో సాగిపోతుంది. సగటు రివెంజ్ డ్రామాలాగే సినిమా నడుస్తుంది. ముగుస్తుంది. నాని-కీర్తి సురేష్ తమ పెర్ఫామెన్సులతో ద్వితీయార్ధాన్ని కొంత నిలబెట్టారు కానీ.. చాలా సీన్లు బోరింగ్ గా అనిపిస్తాయి. 'దసరా'ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లడానికి దర్శకుడికి మంచి అవకాశం లభించినా అతను ఉపయోగించుకోలేదు. ప్రథమార్ధంలో అతను చూపించిన ప్రతిభను కొనసాగించి ఉంటే.. అలాంటి స్టాండౌట్ సీన్లు కొన్ని పడి ఉంటే 'దసరా' రేంజే వేరుగా ఉండేది. ఎక్కువగా సెంటిమెంట్.. రిపీటెడ్ సీన్లతో 'దసరా' విసిగించడం మొదలవుతుంది. ప్రి క్లైమాక్స్ నుంచి సినిమా కొంచెం వేగం పుంజుకుని.. మళ్లీ పతాక సన్నివేశంతో పైకి లేస్తుంది. ఇంటర్వెల్ తర్వాత మళ్లీ క్లైమాక్సే స్టాండౌట్ గా నిలుస్తుంది. ఓవరాల్ గా రా అండ్ రస్టిక్ గా అనిపించే సినిమాలను ఇష్టపడేవారికి 'దసరా' బాగా నచ్చుతుంది. ద్వితీయార్ధాన్ని కొంచెం భరించగలిగితే 'దసరా' మంచి కిక్కే ఇస్తుంది. సున్నితమైన సినిమాలను ఇష్టపడేవారు.. హార్డ్ హిట్టింగ్ సీన్లను అందరూ తట్టుకోలేకపోవచ్చు. వాటికి ముందే ప్రిపేరైతే బెటర్.


నటీనటులు:

నాని లాంటి నటుడు టాలీవుడ్లో ఉండటం తెలుగు ప్రేక్షకుల అదృష్టం అని మరోసారి రుజువవుతుంది 'దసరా' సినిమాతో. ధరణి పాత్రలో నానిని చూసి షాకవ్వకుండా ఉండలేం. అందగాడైన నానిని మరీ ఇంత డీగ్లామరస్ పాత్రలో చూసి అలవాటు పడటానికి కొంచెం సమయం పడుతుంది కానీ.. పడ్డాక మాత్రం ఆ పాత్రతో ట్రావెల్ అవుతాం. నాని ఒక కన్విక్షన్ తో ఆ పాత్ర చేసిన విషయం తెరపై కనిపిస్తుంది. తెలంగాణ యాస విషయంలో అక్కడక్కడా ఇబ్బంది పడ్డప్పటికీ.. ఓవరాల్ గా అతను మంచి ఇంపాక్టే చూపించాడు. ఎమోషనల్ సీన్లలో నాని చెలరేగిపోయాడు. ఇంటర్వెల్ సహా కీలకమైన సన్నివేశాల్లో నాని ఎంత మంచి నటుడో అర్థమవుతుంది. కీర్తి సురేష్ చాన్నాళ్ల తర్వాత తెలుగులో తనదైన ముద్ర వేసింది. చాలా కొద్దిమంది హీరోయిన్లు మాత్రమే ఈ పాత్రను చేయగలరు. 'మహానటి' స్థాయి కాదు కానీ.. నటన పరంగా కీర్తి కెరీర్లో ఇది ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ పాత్రల్లో ఒకటి. తెలంగాణ యాస విషయంలో ఆమె ఓకే అనిపించింది. కీర్తి నాటు డ్యాన్స్ భలేగా అనిపిస్తుంది. తెలుగులో తొలి సినిమా అయినప్పటికీ దీక్షిత్ శెట్టి బాగా చేశాడు. కథలో అతడి పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. కొన్ని సీన్లలో నానికి దీటుగా నటించాడతను. మలయాళ నటుడు షైన్ టామ్ చాకో విలనీని బాగానే పండించాడు. తక్కువ సన్నివేశాల్లోనే తన ప్రత్యేకతను చాటుకున్నాడు. తెలుగులో ఎంట్రీకి అతను మంచి పాత్రనే ఎంచుకున్నాడు. సముద్రఖని నుంచి చాలా ఆశిస్తాం కానీ.. ఆయన పాత్ర పెద్దగా ప్రభావం చూపలేదు. సాయికుమార్.. ఝాన్సీ.. మిగతా నటీనటులు ఓకే.


సాంకేతిక వర్గం:

'చమ్కీల అంగీలేసి' సహా సంతోష్ నారాయణన్ పాటలన్నీ బాగున్నాయి. కానీ తెర మీద పాటలను ఆశించిన స్థాయిలో ప్రెజెంట్ చేయలేకపోయారు. నేపథ్య సంగీతం విషయంలో సంతోష్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. కానీ తెలుగు కమర్షియల్ సినిమాల్లో ఎలివేషన్-ఎమోషనల్ సీన్లు వచ్చినపుడు కొంచెం హడావుడితో కూడిన ఆర్ఆర్ ఆశిస్తారు మన ప్రేక్షకులు. సంతోష్ తన స్టయిల్లో డిఫరెంటుగా ఆర్ఆర్ బాగా చేసినా.. మన ఆడియన్స్ కొంత నిరాశకు గురి కావచ్చు. సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం సినిమాలో మేజర్ హైలైట్లలో ఒకటి. ఆరంభం నుంచి ఒక మూడ్ క్రియేట్ చేసి.. ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఒక థీమ్ లో సాగింది సినిమాటోగ్రఫీ. విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. కొత్త దర్శకుడిని నమ్మి.. ఇలాంటి కథకు రాజీ లేకుండా ఖర్చు పెట్టిన నిర్మాత అభినందనీయుడు. రైటర్ కమ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.. తొలి సినిమా కోసం పడ్డ కష్టం తెరపై కనిపిస్తుంది. గురువు సుకుమార్ లాగే దర్శకుడిగా తనకూ ఒక స్టైల్ ఉందని చాటిచెప్పాడు. కొన్ని ఎపిసోడ్లలో దర్శకుడిగా శ్రీకాంత్ స్థాయి కనిపిస్తుంది. నేటివిటీ.. డైలాగుల విషయంలో జాగ్రత్త వహించాడు. ద్వితీయార్ధం విషయంలో అతను ఇంకొంత కసరత్తు చేయాల్సింది. నరేషన్ స్లో అన్నది ఒక్కటే దర్శకుడి మీద కంప్లైంట్.

చివరగా: దసరా..  నాని వీర నాటు వీరంగం

రేటింగ్-2.75/5