పవన్ ఖర్చు.. చార్టర్డ్ విహంగానికే తడిసి మోపెడు!

Wed Jan 22 2020 19:34:25 GMT+0530 (IST)

Daily Travel Expenses Of Pawan To Reach One Crore?

ఒకేసారి రెండు పడవల పయనం అంటే అది చాలా రిస్క్ తో కూడుకున్నది. పైగా ఎంతో స్ట్రెస్ తప్పనిసరి. అయితే అలాంటి రిస్క్ కే సిద్ధమయ్యారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. జనసేనానిగా ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ ఉన్నట్టుండి వరుసగా సినిమాలకు కమిటవుతుండడం చూస్తుంటే షాక్ నిస్తోంది. ఓవైపు ఏపీ రాజకీయాలు అంతకంతకు హీటెక్కిపోతున్నాయి. విశాఖ రాజధాని అంశం వేడెక్కిస్తోంది. ఇలాంటి టైమ్ లో పింక్ రీమేక్ షూటింగుని ప్రారంభించిన పవన్ రెగ్యులర్ గా సెట్స్ కి జాయిన్ అవుతున్నారు. వయసు 50కి చేరువైనా పవన్ దూకుడు ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారింది.అయితే ఆయన ఉదయం షూటింగులు.. సాయంత్రం రాజకీయాలు చేస్తుండడంతో ఆ మేరకు అటూ ఇటూ ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. అప్పటికప్పుడు హైదరాబాద్ లో షూటింగ్ చేయాలి. షెడ్యూల్ ఎక్కడ ఉంటే అక్కడికి పరుగెత్తాలి. మధ్యాహ్నానికి ప్యాకప్ చెప్పి గంటలోనే తిరిగి అమరావతి- వైజాగ్- న్యూ దిల్లీ అంటూ అటూ ఇటూ చక్కర్లు కొట్టాలి. అలా వెళ్లగలగాలంటే పవన్ కి ప్రత్యేకించి ఒక వినువీధి విహంగం అవసరం. ఇంతకీ దానిని నిర్మాత దిల్ రాజు ఎరేంజ్ చేశారా లేదా?  దానికి ఎంత ఖర్చవుతోంది? అంటే.. క్లోజ్ సోర్సెస్ నుంచి ఓ లీక్ అందింది.

పవన్ కోసం శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు ఒక ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్ ని ఎరేంజ్ చేశారట. ఇందులోనే పవన్ సెట్స్ కి హాజరవుతున్నారు. అలాగే సెట్స్ లో షూటింగ్ పూర్తవ్వగానే అక్కడి నుంచి డైరెక్టుగా వెళ్లాల్సిన నగరానికి లేదా పొలిటికల్ కారిడార్ కి వెళ్లిపోతున్నారు. ఒకేసారి ఇలా డ్యూయల్ రోల్ పోషించేందుకు అనువుగా వినువీధి విహంగం తనకోసం రెడీగా ఉంటోందట. మరి దీనికి ఖర్చు ఎంత? అంటే రోజుకు 4లక్షల వరకూ ఖర్చవుతోందట. అంటే అతడు ఎన్ని కాల్షీట్లు ఇచ్చారో అన్ని రోజులు డెయిలీ ఇంత పెద్ద మొత్తం కేవలం విమాన ప్రయాణానికే ఖర్చవుతుందన్నమాట. దాదాపు నెలరోజుల పాటు ఆయన షూటింగులో పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి ఆ మేరకు ఖర్చు తడిసిమోపెడవుతుందని అంచనా వేస్తున్నారు. దాదాపు కోటిన్నర వరకూ కేవలం ఈ ప్రయాణానికే ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో మరో పీరియాడికల్ వారియర్ మూవీలో పవన్ నటించనున్న సంగతి తెలిసిందే. భారీ కాన్వాసుతో తెరకెక్కనున్న ఆ సినిమాని ఎలా మ్యానేజ్ చేస్తారు? అన్నది ఇప్పటి నుంచే ఉత్కంఠ పెంచుతోంది. నేటి సాయంత్రం భాజపా నాయకులతో కలిసి జనసేనాని దిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. అభివృద్ధి వికేంద్రీకరణకు వ్యతిరేకంగా అమరావతి రాజధానికి అనుకూలంగా పవన్ నినదిస్తున్నారు. కేంద్రం మద్దతును కూడగట్టే ప్రయత్నాల్లో ఉన్నారు.