కప్ కేక్ ఆస్కార్ షేప్ అదీ విందు ప్రత్యేకత

Sat Mar 18 2023 09:20:22 GMT+0530 (India Standard Time)

Cupcake Oscar shape is the specialty of the party

RRR 'నాటు నాటు..' సంచలనాల గురించి తెలిసిందే. గోల్డెన్ గ్లోబ్- హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్ ని దక్కించుకున్న ఈ పాట ప్రతిష్ఠాత్మక ఆస్కార్ ని సైతం కైవశం చేసుకుంది. ఈ పాట వెనక నిలిచిన అసాధారణ ప్రతిభావంతుల్లో సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి.. కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ సహా  పాటను రాసిన చంద్రబోస్ కి ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. వారి ప్రతిభను కొనియాడని ప్రజలు లేరంటే అతిశయోక్తి కాదు. లెజెండ్స్ అనదగ్గ హాలీవుడ్ ఫిలింమేకర్స్ .. హాలీవుడ్ సూపర్ స్టార్లు 'నాటు నాటు..' పాటను అభిమానించారు. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల మనసులను గెలుచుకుందని కితాబిచ్చారు.ఇక ఈ పాటను సృజించడం వెనక కృషి ఎలాంటిదో ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో సీనియర్ లిరిసిస్ట్ చంద్రబోస్ వెల్లడించారు. మరకతమణి ఎం.ఎం.కీరవాణి- దర్శకధీరుడు రాజమౌళితో తన ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను తెలిపారు. ప్రపంచ విఖ్యాత ఆస్కార్ ని గెలుచుకున్న ఆనందంలో ట్రోఫీతో చంద్రబోస్ ఫోటోగ్రాఫ్ లు వీడియోలు వైరల్ అయ్యాయి. ఆయన ఇప్పటికే పలు హాలీవుడ్ మీడియాల ఆహ్వానం అందుకుని ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ విషయాలన్నీ తెలుగు మీడియాల్లో అనువాదాలుగా ప్రజలకు చేరువయ్యాయి. తెలుగు ప్రజలు సహా భారతీయులంతా గర్వంగా చెప్పుకునే అసాధారణ ప్రతిభావంతుడిగా చంద్రబోస్ కి దక్కిన గౌరవం ఎనలేనిది. సీనియర్ లిరిసిస్ట్ బోస్ ఖ్యాతి ప్రపంచవిఖ్యాతం అయ్యింది. ఇటీవల చంద్రబోస్ అమెరికాలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ MIT నుంచి ప్రత్యేక విందునకు ఆహ్వానం అందుకున్నారు. సదరు సంస్థ ఇచ్చిన విందులో తాను చూసిన ఆసక్తికర విషయాన్ని 'తుపాకి'కి ఎక్స్ క్లూజివ్ గా వెల్లడించారు.

చంద్రబోస్ మాట్లాడుతూ-"ఎంఐటి మసాచు సెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కాలేజ్. అన్ని సృజనాత్మక ఆవిష్కరణలు ఈ కాలేజ్ లోనే జరుగుతాయి. నవీన ఆవిష్కరణల్లో ప్రసిద్ధి. సమాజాన్ని మార్చే కొత్త కొత్త ఆవిష్కరణలకు అద్భుత వేదిక ఇది. ఇక్కడ మీడియా హౌస్ అనే ఒక పెద్ద భవంతిలో విందుకు నాకు ఎంఐటీ టీమ్ నుంచి ఆహ్వానం అందింది. ఎంఐటి టీమ్ డీన్ మన తెలుగు వ్యక్తి. అనంత్ చంద్ర కాసాని వారి పేరు. నేను అక్కడ విందులో పాల్గొన్నాను. కాలేజ్ లో ప్రతి అంశాన్ని నాకు చూపించారు. ఈ విందులోనే ఎరాన్ అనే ప్రముఖుడు పరిచయం అయ్యారు. అతడు గిటార్ హీరో.. వీడియో గేమ్ ఫౌండర్. అలాగే మరికొందరు ప్రవాస భారతీయులను కలిసాను" అని తెలిపారు. అక్కడ విందులో ప్రత్యేకత గురించి మాట్లాడుతూ.."కప్ కేక్ ఆస్కార్ షేప్!లో ఉంద"ని వెల్లడించారు. ఆస్కార్ విజేత అయిన చంద్రబోస్ కి భారతదేశవ్యాప్తంగా ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియన్ డయాస్పోరా ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సాహితీకారుడు.. లిరిసిస్ట్ చంద్రబోస్ కి 'తుపాకి' తరపున మరోసారి శుభాకాంక్షలు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.