ఫుల్ స్వింగ్ లో క్రేజీ సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్..!

Thu Jul 07 2022 09:28:44 GMT+0530 (IST)

Crazy sequel pre production works in full swing

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుప్పు: ది రైజ్' సినిమా దేశ వ్యాప్తంగా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. పుష్పరాజ్ గా బన్నీ మేనరిజం.. 'తగ్గేదే లే' అంటూ ఆయన చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.శేషాచలం అడవుల్లోని ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందించబడిన 'పుష్ప' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో తీస్తే ప్రపంచ వ్యాప్తంగా రూ. 360 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో ఊహించని విధంగా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఇప్పుడు 'పుష్ప: ది రూల్' మూవీపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ అంచనాలను అందుకునేందుకు సుక్కూ స్క్రిప్ట్ పై మరింత శ్రద్ధ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం 'పుష్ప 2' ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. సుకుమార్ ఈ కథను ట్రైడెంట్ హోటల్ లో కూర్చొని డెవెలప్ చేస్తున్నారని సమాచారం. అలానే మధ్య మధ్యలో గోవాకు కూడా వెళ్లి వస్తున్నారు.

ముందుగా అనుకున్న స్క్రిప్టుకు అదనంగా కొన్ని హంగులు అద్దుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా 'పుష్ప 2' లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని రంగంలోకి దించబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

సినిమా చివరి ఇరవై నిమిషాల్లో ఎంట్రీ ఇచ్చిన ప్రతినాయకుడు ఫహద్ ఫాజిల్ ను ఎవరూ మర్చిపోలేరు. క్లైమాక్స్ లో పుష్పరాజ్ - భన్వర్ సింగ్ షెకావత్ మధ్య వార్ డిక్లేర్ చేస్తూ సీక్వెల్ పై అంచనాలను భారీగా పెంచేశారు.

అయితే పుష్పరాజ్ దూకుడుకి అడ్డుకట్ట వేయడానికి భన్వర్ సింగ్ తో పాటుగా మరో భారీ విలన్ అవసరం ఉన్న నేపథ్యంలోనే విజయ్ సేతుపతిని సంప్రదించినట్లు ఫిలింనగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే రెండో భాగం పై అంచనాలు మరింత పెరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

'పుష్ప: ది రూల్' లో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించనుంది. సునీల్ - రావు రమేష్ - అజయ్ పాత్రలు ఇందులోనూ కొనసాగుతాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చనున్నారు. 2023 ద్వితీయార్థంలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.