క్రేజీ సినిమా స్పీడ్ కు నెట్ ఫ్లిక్స్ గండం!

Mon Nov 28 2022 12:05:09 GMT+0530 (India Standard Time)

Crazy movie Love Today to Netflix

ఈ మధ్య ప్రేక్షకుల మైండ్ సెట్ పూర్తిగా మారిన విషయం తెలిసిందే. ఎంత పెద్ద స్టార్ వున్నా సరే ఆ సినిమాలో కంటెంట్ లేకపోతే పెద్దగా పట్టించుకోవడం లేదు. అదే పేరే తెలియని వారు నటించిన సినిమాలో కంటెంట్ వుంటే మాత్రం ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కాసుల వర్షం కురిపిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద అలాంటి సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు. రీసెంట్ గా విడుదలైన 'కాంతార'పై ఇదే తరహాలో ప్రేక్షకులు కాసుల వర్షం కురిపించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిపిన విషయం తెలిసిందే.తాజాగా ఓ చిన్ని సినిమాకు ఇలాంటి ఆదరణే దక్కుతోంది. యండ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా దర్శకుడిగా చేసిన తమిళ చిత్రం 'లవ్ టుడే'. ఇదే పేరుతో ఈ మూవీని తెలుగులో దిల్ రాజు విడుదల చేశారు. తమిళంలో ఇప్పటికే రూ.50 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి అక్కడ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ఈ మూవీ తెలుగులో స్లోగా దండయాత్ర మొదలు పెట్టింది. తమిళంలొ ఈ మూవీని నవంబర్ 4న రిలీజ్ చేశారు. తెలుగులో మాత్రం నవంబర్ 18న రిలీజ్ చేయాలనుకున్నారు.

కానీ 'మసూద' కారణంగా ఈ మూవీ రిలీజ్ ని 25కు మార్చారు. ఇదే ఇప్పడు ఈ మూవీకి పెద్ద ఇబ్బందికరంగా మారబోతున్నట్టుగా తెలుస్తోంది. బిసీ సెంటర్స్ లో ఓ ఊపు ఊపుతున్న ఈ మూవీ ఫస్ట్ డే నే రెండు కోట్లు వసూళ్లని రాబట్టి విస్మయపరిచింది. కొతంత నటుడు నటించిన డబ్బింగ్ సినిమా ఈ రేంజ్ లో వసూళ్లని రాబట్టడం ఇదే మొదటి సారి కావడంతో ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. సినిమా రిలీజ్ కు ముందు నుంచి ఈ మూవీపై గట్టి నమ్మకంగా వున్న దిల్ రాజు సినిమా వసూళ్లపై సంతృప్తి కరంగా వున్నారట.

ఆయన చెప్పినట్టుగా 'లవ్ టుడే' రానున్న రోజుల్లో సెన్సేషన్ క్రియేట్ చేయడం గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు కూడా చెబుతున్నాయి. అయితే ఈ సినిమా స్పీడుకు నెట్ ఫ్లిక్స్ గండం వున్నట్టుగా తెలుస్తోంది.

ఈ మూవీని డిసెంబర్ 2 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారట. అదే జరిగితే తెలుగులో కలెక్షన్ లు తగ్గే అవకాశం వుందని తెలుస్తోంది. కారణం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలైతే చాలా వరకు ప్రేక్షకులు ఈ మూవీని థియేటర్లలో చూడటానికి అంతగా ఆసక్తిని చూపించే అవకాశం వుండదు.

ఈ మూవీతో విడుదలైన అల్లరి నరేష్ మూవీ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' యావరేజ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో ఆ సినిమా ప్రేక్షకుల్ని కూడా 'లవ్ టుడే' తన వైపు తిప్పేసుకుని బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తున్న వేళ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అంటూ వార్తలు మొదలవడం ఇబ్బందికరంగా మారింది. మరి ఈ గండాన్ని 'లవ్ టుడే తట్టుకుని ఎలా బయటపడుతుందో.. తెలుగు బాక్సాఫీస్ వద్ద అదే జోరుని చూపిస్తుందో తెలియాలంటే డిసెంబర్ 2 వరకు వేచి చూడాల్సిందే. అదే రోజు అడివి శేష్ 'హిట్ 2' కూడా రిలీజ్ కానుండటంతో అందరి కళ్లు ఇప్పుడు డిసెంబర్ 2పై పడ్డాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.