క్రేజీ స్టార్స్ ఆన్ లొకేషన్.. ఏస్టార్ ఎక్కడున్నాడు?

Wed May 25 2022 05:00:01 GMT+0530 (India Standard Time)

Crazy Stars on Location..

మన సినిమాకు దేశ వ్యాప్తంగా మార్కెట్ ఏర్పడటం బిజినెస్ కూడా మునుపటికి మించి జరుగుతున్న నేపథ్యంలో మన స్టార్స్ సినిమాల పరంగా స్పీడు పెంచేశారు. ఒక్కో హీరో రెండు మూడు చిత్రాలలో నటిస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. తమ సినిమాల షూటింగ్ ల విషయంలో స్పీడు పెంచేస్తూ రాకెట్ వేగంతో పూర్తి చేసే పనిలో పడ్డారు. స్టార్ హీరోలంతా క్రేజీ సినిమా షూటింగ్ లతో ఎవరెవరు ఎక్కడెక్కడ బిజీ బిజీగా వున్నారు?.. ఏ లొకేషన్ లో వున్నారన్నది ఆసక్తికరంగా మారింది. మరి మన స్టార్స్ ఎక్కడెక్కడ వున్నారు? ఎక్కడ షూటింగ్ చేస్తున్నారన్నది ఇప్పడు చూద్దాం.కేజీఎఫ్ కేజీఎఫ్ 2 లతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో 'సలార్' మూవీని రూపొందిస్తున్నారు. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ లో జరుగుతోంది. అక్కడ ప్రభాస్ పాల్గొనగా పలు కీలక ఘట్టాలని చిత్రీకరిస్తున్నారు. ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఈ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారట.

ఇక తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా ఓ బై లింగ్వల్ మూవీ రూపొందుతున్న విసయం తెలిసిందే. విజయ్ తన సినిమాల షూటింగ్ లని హైదరాబాద్ లో చేసినట్టుగానే ఈ మూవీ షూటింగ్ ని కూడా హైదరాబాద్ లో నే పూర్తి చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే హైదరాబాద్ లో ప్రారంభమైంది.

రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో బైలింగ్వల్ మూవీగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈమూవీ షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ 7 ఎకర్స్ లో జరుగుతోంది. ఇదే తరహాలో మరో తమిళ హీరో ధనుష్ నటిస్తున్న బైలింగ్వల్ మూవీ 'సార్' షూటింగ్ కూడా హైదకరాబాద్ లోనే జరుగుతోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఫార్చూన్ సినిమాస్ బ్యానర్ లపై సూర్యదేవర నాగవంశీ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ వైఫ్ సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

 ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో జరుగుతోంది. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ 'టైగర్ నాగేశ్వరరావు'. వంశీ డైరెక్టర్ గా పరిచయం అవుతున్న ఈ మూవీని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. క్రితి సనన్ సోదరి నుపుర్ సనన్ గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. రవితేజ బందిపోటు దొంగ నాగేశ్వరరావు పాత్రలో నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ లో జరుగుతోంది.

నేచురల్ స్టార్ నాని తొలిసారి పాన్ ఇండియా బాటపడుతున్నారు. ఆయన నటిస్తున్న మాసీవ్ ఎంటర్ టైనర్ 'దసరా'. ఎస్ ఎల్ .వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఓపెన్ కాస్ట్ కోల్ మైన్స్ నేపథ్యంలో సాగే ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివారులోని బాచుపల్లిలో జరుగుతోంది.

అల్లరి నరేష్ హీరోగా రూపొందుతున్న సినిమా 'సభకు నమస్కారం'. సతీష్ మల్లంపాటి ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీ షూటింగ్ సికింద్రాబాద్ లోని వెస్ట్ మారేడు పల్లిలో జరుగుతోంది. ఇక నితిన్ కృతిశెట్టి జంటగా నటిస్తున్న 'మాచర్ల నియోజక వర్గం' షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ క్రేజీ హీరోయిన్ సమంత జంటగా శివ నిర్వాణ రూపొందిస్తున్న 'ఖుషీ' మూవీ ఇటీవలే కశ్మీర్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.