ఆర్జీవీకి కోవిడ్ ఫీవర్.. ఇదిగో ఆన్సర్

Mon Aug 10 2020 09:15:21 GMT+0530 (IST)

Covid Fever For Rgv

ఆర్జీవీకి తీవ్ర జ్వరం.. ఆయనతో పాటు ఉన్న కుటుంబ సభ్యులకు తీవ్ర జ్వరం రావడంతో కోవిడ్ 19 సోకిందన్న అనుమానం.. కానీ అది నిజమా అంటే.. కేవలం వైరల్ ఫీవర్ అని తేలింది... ఇదీ తాజాగా సోషల్ మీడియా ప్రచారం. దీనికి ఆర్జీవీ ఇచ్చిన కౌంటర్ హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ట్విట్టర్ లో  డంబెల్ ఎత్తి కసరత్తులు చేస్తున్న వీడియోని రామ్ గోపాల్ వర్మ షేర్ చేశారు. తనదైన ఫన్నీ వేలో తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.``నాకు తీవ్ర జ్వరం వచ్చిందని ప్రచారమవుతోంది. కోవిడ్ 19 నా కాదా అన్నది నాకు తెలీదు. కానీ నేను ఆరోగ్యంగానే ఉన్నా. నాన్ స్టాప్ గా సినిమాల కోసం పని చేస్తున్నా. సీరియస్ గా వర్కవుట్లు చేస్తున్నా. మిమ్మల్ని నిరాశపరుస్తున్నందుకు సారీ గయ్స్`` అంటూ ఆర్జీవీ కౌంటర్ ఇచ్చారు.

ఇటీవల ఆర్జీవీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఓ వైపు వివాదాలు.. మరోవైపు షూటింగులు ఇదీ ఆర్జీవీ స్టైల్. `పవర్ స్టార్` తర్వాత వరసగా పలు సినిమాలు తీస్తున్నారు. ఇప్పటికే `కరోనావైరస్` విడుదలకు సిద్ధంగా ఉంది. థ్రిల్లర్ అనే టైటిల్ తో మరో సినిమాని పూర్తి చేశారు. ప్రణయ్ హత్యోదంతం ఆధారంగా రూపొందిస్తున్న `మర్డర్` చిత్రీకరణ సాగుతోంది. ఈ మూవీని ఆపాలంటూ బాధిత కుటుంబం కోర్టుని ఆశ్రయించిన సంగతి విధితమే. హైదరాబాద్ పరిసరాల్లో హత్యాచార ఘటన ఆధారంగా `దిశా` అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  ఒక వైద్యురాలిని అత్యాచారం చేసి ఆపై హత్య చేసి పోలీసుల ఎన్ కౌంటర్ లో మరణించిన దిశ ఘటన దీనికి ఆధారం. అలాగే 12 ఓ క్లాక్ అనే హర్రర్ థ్రిల్లర్ సహా అల్లు అనే చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటితో పాటు మరిన్ని సినిమాలకు స్క్రిప్టు పనులు సాగుతున్నాయి. వీటిలో మెజారిటీ పార్ట్ ఆర్జీవీ వరల్డ్ థియేటర్ (ఏటీటీ)లో రిలీజయ్యే వీలుందని సమాచారం.