'మా' లో లుకలుకలు.. అధ్యక్షుడికి షోకాజ్?

Wed Sep 11 2019 11:39:28 GMT+0530 (IST)

Cold War Between Rajasekhar and Naresh in MAA

మూవీ ఆర్టిస్టుల సంఘ (మా) లొల్లి గురించి తెలిసిందే. `మా` అసోసియేషన్ లో మరోసారి ముసలం మొదలైంది. కొత్త కమిటీ ఎన్నికై ఏడాది కూడా పూర్తి కాకుండానే కమిటీలో లుకలుకలు తారా స్థాయికి చేరినట్టు తెలుస్తోంది. ఎన్నికల ముందు గొడవలు.. పదవి చేపట్టేప్పుడు ఆధిపత్య పోరాటాలు చీత్కారం కలిగించాయి. మాజీ `మా` అధ్యక్షుడు శివాజీ రాజాను గద్దె దింపడమే లక్ష్యంగా సీనియర్ నరేష్ బరిలోకి దిగి పెద్ద మంత్రాంగమే నడిపి చివరికి అనుకున్నట్టుగానే ఓట్లు కొల్లగొట్టి `మా` అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకున్నాడు. అయితే అతనిలో `మా` పట్ల - సభ్యుల పట్ల ఎంత అంకిత భావం.. ఎంత చులకన భావం వుందో ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజునే బయటపడింది. హేమ మాట్లాడటానికి మైక్ అడిగిన సందర్భంలో తను మాట్లాడటం అవసరం లేదన్నట్టుగా  నరేష్ మైకు లాక్కోవడం వివాదంగా మారింది.దీనిపై హేమ అప్పటికప్పుడే నరేష్ ని కడిగి పారేసింది. వైస్ ప్రెసిడెంట్ గా ఎంపికైన డా. రాజశేఖర్ అదే వేదిక సాక్షిగా నరేష్ ని మందలించడం హాట్ టాపిక్ గా మారింది. ఆ తరువాత నుంచి ఇద్దరి మధ్య దూరం పెరుగుతూ రావడం.. `మా` అంటే తానే అనే భావంతో నరేష్ వ్యవహరిస్తూ పోవడం మిగతా సభ్యులకు ఆగ్రహాన్ని తెప్పించిందట. పదవి చేపట్టే రోజునే ఈ లుకలుక అంతా బయటపడింది.

ఇన్నాళ్లకు అది కాస్తా నివురుగప్పిన నిప్పులా మారిందట. తాజాగా హీరో రాజశేఖర్ నేతృత్వంలో మిగతా టీమ్ అంతా ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మీటింగ్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ `మా` లో లుకలుకలు ఏ స్థాయికి చేరాయో అద్దంపడుతున్నాయి. హీరో రాజశేఖర్ ఆధ్వర్యంలో  అధ్యక్షుడు నరేష్ పై షోకాజ్ కు రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది.