2020 సెప్టెంబర్ లో చిత్రపురి ఎన్నికలు

Thu Apr 25 2019 15:16:48 GMT+0530 (IST)

Chitrapuri Elections In 2020

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. 23 మే కౌంటింగ్ గురించే అందరూ వెయిటింగ్. ఈసారి ఎన్నికల్లో సినీ ప్రముఖుల క్యాంపెయినింగ్ మునుపటితో పోలిస్తే కాస్త ఎక్కువగానే కనిపించింది. ఆ సంగతి అటుంచితే.. సినిమా 24 శాఖల కార్మికులు నివాసం ఉండే చిత్రపురి కాలనీ ఎన్నికలు ఎప్పుడు? అంటే దానికి సంబంధించిన ఓ కీలక సమాచారం రివీలైంది.హైదరాబాద్ మణికొండ- గచ్చిబౌళి మధ్య పరిసరాల్లో అత్యంత ఖరీదైన సౌకర్యవంతమైన ప్రైమ్ ఏరియాలో దాదాపు 16 ఎకరాల్లో చిత్రపురి కాలనీని నిర్మించారు. ఇందులో సింగిల్ బెడ్ రూమ్స్.. ట్రిపుల్ బెడ్ రూమ్స్ ఇప్పటికే ఆక్యుపై అయ్యాయి. ప్రస్తుతం డబుల్ బెడ్ రూమ్స్.. డూప్లెక్సులు.. రోహౌసెస్ నిర్మాణం పూర్తవుతోంది. సాధ్యమైనంత తొందర్లోనే వీటిని కూడా హక్కుదారుకు అందించే పనిలో వేగం పెంచారని తెలుస్తోంది. ఇకపోతే కాలనీలో అన్ని రకాల ఇళ్లలో కార్మికులు చేరితే కోలాహాలం మరింతగా పెరిగే ఛాన్సుంటుందని చెబుతున్నారు. ఇప్పటికే కాలనీకి అనుసంధానంగా అన్ని వైపుల నుంచి రోడ్లు క్లీన్ గా రెడీ అయ్యాయి. అటు నానక్ రామ్ గూడ నుంచి రింగ్ రోడ్ - విజయవాడ- వైజాగ్ కనెక్టివిటీ కాలనీకి ప్రత్యేక ఆకర్షణ. ఇటువైపు కాజగూడ- దర్గా- ఫిలింనగర్ కి రోడ్లు పూర్తి క్లారిటీతో ఉండడంతో ఈ కాలనీకి అన్ని విధాలా సౌకర్యం కుదిరింది. కూతవేటు దూరంలో మల్టీప్లెక్సులు.. సినిమా థియేటర్లు.. కార్పొరెట్ ఆస్పత్రులు అందుబాటులో ఉండడం మరో ప్రధాన ఆకర్షణ. అందుకే ఈ కాలనీపై ప్రముఖుల కన్ను ఎప్పుడూ ఉంటుంది. మొన్నటి ఎన్నికల్లో చిత్రపురి వాసుల ఓట్లు ఎవరికి పడ్డాయి? అంటే చిత్రపురి కమిటీ తొలి నుంచి తెరాస ప్రభుత్వానికే అనుకూలంగా ఉంది. ఈసారి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వారసుడు సహా తెరాస నాయకుల తరపున కాలనీ వాసులే ప్రచారం చేశారు. ఓట్లు గంపగుత్తగా తెరాస అభ్యర్థులకే పడ్డాయన్న సంకేతాలు ఉన్నాయి. ఆ క్రమంలోనే చిత్రపురి ఎన్నికల గురించి ఆసక్తికర చర్చ సాగింది.

చిత్రపురికి ఎన్నికలు ఐదేళ్ల కోసారి జరుగుతుంటాయి. ఆ కోవలో పరిశీలిస్తే 2020 సెప్టెంబర్ లో ఈ కాలనీ ఎన్నికలు నిర్వహించనున్నారని తెలుస్తోంది. కాలనీకి తొలి అధ్యక్షుడిగా కొమర వెంకటేష్ ఉన్నారు. 2010   నుంచి (నిర్మాణ కాలం) కాలనీ ఆయన పాలనలోనే ఉంది. 2015 లో మరోసారి ఆయన్నే అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇండస్ట్రీ ప్రముఖులైన దర్శకరత్న డా.దాసరి నారాయణరావు.. పరుచూరి బ్రదర్స్ సహా ఎందరో కొమర వెంకటేష్ కి తొలి నుంచి అండగా నిలిచారు. ముఖ్యంగా ఫెడరేషన్ తరపున పదవిలో ఉన్న కొమర వెంకటేష్ కి కార్మికుల్లోనూ ఆదరణ అంతే ఇదిగా ఉంది. అయితే ఇటీవలే కాలనీ కమిటీలో కొన్ని విభేధాలు పొడచూపాయి. వాటిని హౌసింగ్ సొసైటీ కమీషనర్ .. ప్రతినిధుల సమక్షంలో పరిష్కరించుకున్నారు. ఆ క్రమంలోనే అధ్యక్షుని మార్పు జరిగింది. ప్రస్తుతం పెండింగ్ కాలానికి పరుచూరి వెంకటేశ్వరరావు అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. అయితే 2020 సెప్టెంబర్ లో జరిగే ఎన్నికల్లో మరోసారి కొమర వెంకటేష్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తారని తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్ని అంతర్గత విభేధాల వల్ల మరింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకునే వీలుందని చెబుతున్నారు. అయితే అధ్యక్షుడు ఎవరైనా కాలనీ సమస్యల్ని పరిష్కరించడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే కాలనీలో కొన్ని లీకేజీలు.. లిఫ్ట్ ల రిపెయిర్.. పార్కింగ్.. పారిశుధ్యం వంటి సాధారణమైన సమస్యలు ఉన్నాయి. ఇలాంటి చిన్నా చితకా సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం జరుగుతోంది. అయితే కాలనీలో లీకేజీల్ని శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించాలన్న నివేదనలు మెయింటెనెన్స్ వాళ్లకు అందాయని తెలుస్తోంది. వీటితో పాటు ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న భవంతుల నిర్మాణం పూర్తి చేసి త్వరగా అప్పజెప్పాల్సి ఉంది. ఎన్నికలొచ్చే ముందు పలకరించే నాయకుడు కాకుండా రెగ్యులర్ గా ఎవరు పని చేస్తారో.. అందరికీ చేరువగా ఉంటారో అలాంటి నాయకుడికే ఓట్లు వేస్తామని కాలనీ వాసులు చెబుతుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది.