Begin typing your search above and press return to search.

చిరు ఎవరిని ఉద్దేశించి అన్నాడు..??

By:  Tupaki Desk   |   29 Sep 2022 6:29 PM GMT
చిరు ఎవరిని ఉద్దేశించి అన్నాడు..??
X
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. వర్షంలోనూ సాగిన ఈ ఫంక్షన్ కు మెగా అభిమానులు రెండు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. చిరు తన స్పీచ్ తో వారందరినీ ఆకట్టుకున్నారు. అయితే ఈ సందర్భంగా చిరంజీవి చెప్పిన ఓ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది

''ఇన్నాళ్లూ రోడ్డు కాంట్రాక్టులు, ఇసక కాంట్రాక్టులు, కొండ కాంట్రాక్టులు, నేల కాంట్రాక్టులు, నీళ్ళ కాంట్రాక్టులు, మందు కాంట్రాక్టులు అంటూ ప్రజల సొమ్ము అడ్డంగా తిని బలిసి కొట్టుకుంటున్నారు ఒక్కొక్కళ్ళూ.. ఇక నుంచి మీరు పీల్చే గాలి కాంట్రాక్టు నేను తీసుకుంటున్నా.. ఇందులో ఒకటే రూల్.. ఇక నుంచి ప్రజలకు సుపరిపాలన అందించాలనే నిర్ణయం.. తప్పుచేయ్యాలంటే భయం మాత్రమే మీ మనసుల్లో ఉండాలి.. లేదంటే.. మీ ఊపిరి గాల్లో కలిసిపోతుంది..'' అంటూ వేదిక మీద చిరంజీవి పవర్ ఫుల్ డైలాగ్ చెప్పి ఫ్యాన్స్ ని ఉత్సాహపరిచారు.

మెగాస్టార్ 'గాడ్ ఫాదర్' సినిమాలోని డైలాగ్ చెప్పినప్పటికీ.. ఇది సోషల్ మీడియాలో ఒక్కసారిగా పొలిటికల్ చర్చకు దారి తీసింది. నెటిజన్లు రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకునే వరకూ వెళ్ళింది. చిరు పరోక్షంగా ఏపీలోని వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్లుగా జనసేన ఫాలోవర్స్ మరియు టీడీపీ సానుభూతిపరులు కామెంట్స్ చేస్తున్నారు.

జగన్ సర్కారుపై నిరంతరం ప్రతిపక్షాలు చేసే ఆరోపణలనే చిరంజీవి తన డైలాగ్ రూపంలో చెప్పారని అంటున్నారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ వాణిని అన్నయ్య తన నోటితో వినిపించారని జనసైనికులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇది కేవలం సినిమాలోని సంభాషణ మాత్రమే అని వైసీపీ సపోర్టర్స్ కామెంట్స్ చేస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డితో చిరు చాలా సన్నిహితంగా ఉంటారని.. ఇద్దరూ సోదరభావంతో మెలుగుతుంటారని.. అలాంటిది ఒక డైలాగ్ తో ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే ప్రశ్నే లేదని పేర్కొంటున్నారు.

అనంతపురంలో 'గాడ్ ఫాదర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నందుకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా చిరంజీవి కి శుభాకాంక్షలు తెలిపిన సంగతి ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. టాలీవుడ్ సమస్యలపై చర్చించడానికి జగన్ తో చిరు భేటీ అయినప్పుడు జరిగిన విషయాలను గుర్తు చేస్తున్నారు. ఇది పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ కాబట్టి.. కథ ప్రకారం అలాంటి డైలాగ్స్ పెట్టి ఉంటారని.. జనాలు దీన్ని ఒక సినిమా డైలాగ్‌ గా మాత్రమే చూస్తారని వ్యాఖ్యానిస్తున్నారు.

'గాడ్ ఫాదర్' డైలాగ్ గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. అలాంటి పవర్ ఫుల్ డైలాగ్ రాసిన రచయితను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఈ చిత్రానికి పవర్ ఫుల్ డైలాగ్స్ సమకూర్చిన లక్ష్మీ భూపాల్ కి నా అభినందనలు.. మంచి ప్రతిభ ఉన్న నీకు మరెంతో మంచి భవిష్యత్ ఉంటుందని నమ్ముతున్నాను అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ డైలాగ్ ని షేర్ చేశారు. దీంతో చిరు ఈ సంభాషణను సినిమాలో ఏ సందర్భంలో చెప్తాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా, 'గాడ్ ఫాదర్' చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లపై రామ్ చరణ్ - ఆర్బీ చౌదరి - ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో రాష్ట్ర రాజకీయాలను శాసించే పవర్ ఫుల్ పాత్రలో చిరంజీవి కనిపించనున్నారు.

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ లో నటించగా.. నయనతార - సత్యదేవ్ కీలక పాత్రలు పోషించారు. ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. 'గాడ్ ఫాదర్' చిత్రాన్ని విజయదశమి కానుకగా అక్టోబరు 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నారు. తెలుగుతో పాటుగా హిందీలోనూ ఈ సినిమా విడుదల కానుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.