రావు గోపాలరావును ఇమిటేట్ చేసిన చిరూ!

Mon Jun 27 2022 09:28:23 GMT+0530 (India Standard Time)

Chiru imitated Rao Gopalrao pakka commercial pre release event

మారుతి దర్శకత్వంలో రూపొందిన 'పక్కా కమర్షియల్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్నరాత్రి హైదరాబాద్  శిల్పకళావేదికలో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ చీఫ్ గెస్టుగా వచ్చిన చిరంజీవి మాట్లాడుతూ .. " రావు  రమేశ్ .. నేను కలవడంగానీ .. సినిమాలు చేయుటం గాని లేనే లేదు. కానీ వాళ్ల నాన్నగారు రావు గోపాలరావుగారితో కలిసి నేను చాలా సినిమాలు చేశాననే సంగతి తెలిసిందే. ఆయనను నేను ఎప్పుడూ చిన మావయ్యగారు అంటూ పిలుస్తుండేవాడిని. ఆయనకి నేను అంటే ఎంతో ప్రేమ.షూటింగులో లంచ్ టైమ్ లో తన శ్రీమతి .. అదే రావు రమేశ్ గారి అమ్మగారు చేసిన వంటకాలను తెప్పించి నాతో తినిపించేవారు. వంకాయ తినకుండా నేను వదిలిస్తే  .. "ఏంటండయ్యా మీరలా వంకాయ వదిలేశారు .. అది మీ అత్తయ్యగారు మీ కోసమే పెట్టారయ్యా .. ఆ వంకాయను చూడండి నిగనిగలాడిపోతూ శ్రీదేవి బుగ్గల్లా కనిపించడం లేదూ.

మీలాంటి కుర్రాళ్లు కసుక్కున కొరికి మింగేలయ్యా " అని వడ్డిస్తూ ఆ వంటకాలను నాతో తినిపించేవారు" అంటూ  రావు గోపాలరావు డైలాగ్ డెలివరీని చిరంజీవి ఇమిటేట్ చేశారు.  

దాంతో ఎమోషనల్ అయిన రావు రమేశ్ .. చిరంజీవి పాదాలకు నమస్కరించారు. చిరంజీవి ఆప్యాయంగా ఆయనను పైకి లేవనెత్తి "రావు రమేశ్  మరింత అత్యున్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను.

అలాగే నా సినిమాలలోను చేయాలని ఆశిస్తున్నాను. అప్పట్లో రావు గోపాలరావుగారి టైమింగ్ ను చూసి ఎంత ఎంజాయ్  చేసేవాడినో ఈ మధ్య కాలంలో రావు రమేశ్  టైమింగ్ చూసి అంతే ఎంజాయ్ చేస్తున్నాను" అంటూ ఆయన భుజం తడుతూ ప్రోత్సహించారు.

ఇక బన్నీ వాసు గురించి మాట్లాడుతూ .. " అరవింద్ గారు నమ్మి పూర్తి బాధ్యతను బన్నీ వాసుకి అప్పగించారు. బన్నీ వాసు ఎంతో సమర్థుడైతే తప్ప ఆయన అలాంటి అవకాశం ఇవ్వరు. పాలకొల్లు నుంచి వచ్చిన బన్నీవాసు .. బన్నీ వ్యక్తిగత వ్యవహారాలు చూస్తూ .. బన్నీ ఎదుగుదలకు ఎంతో తోడ్పడ్డాడు. ఆ తరువాత అల్లు అరవింద్  గారు అప్పగించిన పనులను ఎంతో అంకితభావంతో  పూర్తి చేస్తూ ఆ ఫ్యామిలీకి రామబంటులా మారిపోయాడు. ఆయన కష్టపడే తత్వం .. నిజాయితీ ఇవన్నీ కూడా ఆయనను ఇంత దూరం తీసుకుని వచ్చాయి" అని చెప్పుకొచ్చారు.