Begin typing your search above and press return to search.

ఏపీ సీఎం జగన్‌ తో చిరు భేటీపై నిర్మాత సంచలన వ్యాఖ్యలు..!

By:  Tupaki Desk   |   14 Jan 2022 3:15 PM GMT
ఏపీ సీఎం జగన్‌ తో చిరు భేటీపై నిర్మాత సంచలన వ్యాఖ్యలు..!
X
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో సీనియర్ హీరో మెగాస్టార్‌ చిరంజీవి భేటీ అయిన సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీలోని సమస్యలను సీఎం కు వివరించిన చిరు.. సినిమా టికెట్ల ధరలను పెంచాలని.. కోవిడ్‌ దృష్ట్యా సినీ కార్మికులు కష్టాల్లో ఉన్నారని.. సినీ పరిశ్రమకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సామాన్యుడికి వినోదం అందించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఉన్నారని.. తమ వైపు ఉన్న కష్టాలను విని సానుకూలంగా స్పందించారని చిరంజీవి తెలియజేశారు.

మరో వారం పది రోజుల్లో పరిశ్రమకు అనుకూలమైన నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన చిరంజీవి.. ఈలోపు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కూడా వ్యక్తిగత స్టేట్మెంట్ ఇవ్వడం వంటివి చేయకుండా సంయమనం పాటించాలని సూచించారు. త్వరలోనే ఈ సమస్యలన్నింటికీ ఫుల్ స్టాప్ పడుతుందని చిరు తెలియజేసారు. ఇండస్ట్రీలో బాధ్యత గల బిడ్డగా మాత్రమే ఇదంతా చేస్తున్నానని అన్నారు. అయితే ఏపీ సీఎంని చిరంజీవి ఒక్కరే వెళ్లి కలిసి రావడంపై పలు రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.

సీఎం జగన్ తో చిరంజీవి భేటీ విషయమై తాజాగా తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ స్పందిస్తూ.. ఏపీ ముఖ్యమంత్రిని ఆర్ నారాయణమూర్తి - రామ్ గోపాల్ వర్మ - చిరంజీవి ఎవరు కలిసినా అది వారి వ్యకిగత భేటీ మాత్రమేనని.. ఇండస్ట్రీ పెద్ద అంటే తెలుగు సినిమా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని అన్నారు. వాళ్ళు ఇండస్ట్రీ మంచి గురించి మాట్లాడినా అది వారి వ్యక్తిగతమేనని తెలిపారు. ''వ్యక్తులు ఎంత గొప్ప వారైనా సంస్థ కన్నా పెద్దవాళ్లు కాదు. చిరంజీవి గారు తనకున్న పరిచయాలతో జగన్ గారిని కలిసుండొచ్చు. ఇండస్ట్రీలో అందరితో చర్చించి మరోసారి విన్నవిస్తామని జగన్ తో చెప్పారు'' అని అన్నారు.

ఇటీవల బాలకృష్ణ గారు కూడా అందరం కలిసి దీనిపై చర్చించాలని అన్నారని గుర్తు చేసారు. ''ఇప్పుడు జగన్ ను చిరంజీవి కలవడం ఆయన వ్యక్తిగతమే కానీ.. ఇండస్ట్రీకి సంబంధం లేదు. వారి మధ్య కుటుంబ విషయాల గురించి చర్చ జరిగిందా? రాజ్యసభ సీటు గురించి జరిగిందా? సినిమాల గురించి జరిగిందా? అనేది వారు చెబితేనే బయటకు తెలుస్తుంది. మిగిలినవన్నీ ఊహాగానాలే'' అని ప్రసన్న కుమార్ పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు ఎంతో మంది వ్యక్తులు వస్తుంటారు.. పోతుంటారు. కానీ ఆర్గనైజేషన్ మాత్రం ఎప్పటికీ ఉంటుందని అన్నారు.

''అప్పట్లో ప్రొడ్యూసర్స్ ని ముందు పెట్టి స్టార్స్ వెనుక ఉండేవారు.. కానీ ఈ మధ్య హీరోలు హడావిడి చేస్తున్నారని.. ఇంటర్నల్ గా మాత్రం ఆర్గనైజేషన్ పరిధిలో జరగాల్సినవి జరుగుతున్నాయన్నారు. ఇండస్ట్రీకి పెద్ద అంటే ఆర్గనైజేషన్ మాత్రమే. వ్యక్తులు ఎంత గొప్పరైనా వ్యవస్థల తర్వాతే. ఎన్టీఆర్ - ఏఎన్నార్ - కృష్ణ - దాసరి నారాయణరావు - రామానాయుడు వంటి వంటివారు కూడా తాము ఇండస్ట్రీ పెద్దలమని ఏనాడూ చెప్పుకోలేదు. చిరంజీవి గారికి పద్మ అవార్డు వచ్చినపుడు కూడా ఆర్గనైజేషన్ ద్వారానే సన్మానం జరిగింది'' అని ప్రసన్న కుమార్ తెలిపారు. గతంలో చిరంజీవి ఇంట్లో ఇండస్ట్రీ సమస్యలపై మీటింగ్ పెట్టడంపై ప్రసన్న కుమార్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ఇకపోతే సినీ పరిశ్రమకు చెందిన సమస్యలపై చర్చించేందుకు చిరంజీవి ఏపీ సీఎంతో భేటీ అయిన నేపథ్యంలో చిరుకి వైకాపా రాజ్యసభ సీటు ఇస్తున్నట్టు ప్రచారం జరిగింది. దీని గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని మరోసారి స్పష్టం చేసారు మెగాస్టార్. తాను పదవులకు లోబడే వ్యక్తిని కాదని.. తనకు రాజ్యసభ సీటు ఇస్తారన్న వార్తలను ఖండిస్తున్నట్టు చెప్పారు. రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు ఇలాంటి ఆఫర్లు రావని.. పదవులు కోరుకోవడం తన అభిమతం కాదని చిరంజీవి వెల్లడించారు.

ఇదే విషయం మీద చిరంజీవి ట్విట్టర్ వేదికగా మరోసారి క్లారిటీ ఇచ్చారు. ''తెలుగు సినీ పరిశ్రమ మేలు కోసం, థియేటర్ల మనుగడ కోసం, ఆంధ్రప్రదేశ్ సిఎం శ్రీ వైయస్ జగన్ గారిని కలిసి చర్చించిన విషయాలని పక్కదోవ పట్టించే విధంగా.., ఆ మీటింగ్ కి రాజకీయరంగు పులిమి నన్ను రాజ్యసభకు పంపుతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. అవన్నీ పూర్తిగా నిరాధారం. రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేను మళ్ళీ రాజకీయాలలోకి, చట్టసభలకు రావటం జరగదు. దయచేసి ఊహాగానాలని వార్తలుగా ప్రసారం చేయవద్దు. ఈ వార్తలకి, చర్చలకు ఇప్పటితో పుల్ స్టాప్ పెట్టమని కోరుతున్నాను'' అని ట్వీట్ చేసిన చిరు.. #GiveNewsNotViews అనే హ్యాష్ ట్యాగ్ జోడించారు.