ఇండస్ట్రీలో చిరంజీవి ఓ పిల్లోడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శకుడు!

Sun Mar 07 2021 11:08:58 GMT+0530 (IST)

Chiranjeevi is a child in the industry .. a director who made sensational comments!

‘‘అద్భుతం జరుగుతున్నప్పుడు ఎవ్వరూ గుర్తించరు.. అద్భుతం జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు’’ అంటాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ మాటలు అక్షర సత్యం అనడానికి అసలు సిసలైన ఎగ్జాంపుల్ కొణిదెల శివశంకర వరప్రసాద్. ఆయన చిరంజీవిగా మారి మెగాస్టార్ గా వెలుగొందుతారని తెలుగు సినిమా ఇండస్ట్రీని మకుఠం లేని మహారాజులా ఏలుతారని ఆనాడు ఎవ్వరూ గుర్తించి ఉండరు. ఇప్పుడు ప్రత్యేకంగా గుర్తించాల్సిన పని కూడా లేదు!ఏ అండా లేకుండా.. ఎవరూ కనీస పరిచయం లేకుండా.. సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లడం ఎంత కష్టమో ఆ ప్రయత్నాలు చేసిన వారికే పూర్తిగా తెలుసు. అలా.. చిత్ర పరిశ్రమ తలుపు తట్టి అడ్డంకులన్నీ అధిగమిస్తూ హీరోగా మారి విజయ పరంపర కొనసాగిస్తూ మెగాస్టార్ స్థాయికి చేరుకోవడం అనేది అనితర సాధ్యమైన విషయం. అకుంఠిత దీక్షతో మనసా వాచా కృషి చేసినా.. అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఇలాంటి అద్భుతాన్ని తెలుగు తెరపై సాధించి చూపాడు చిరంజీవి.

అయితే.. ఇక్కడ మరో విశేషం ఏమంటే ఒక స్థాయి దాటిన తర్వాత ఏ నటుడైనా రిలాక్స్ అవుతారు. షాట్ రెడీ అంటే వచ్చేసి ఫినిష్ చేసి వెళ్లి కార్ వ్యాన్ లో రిలాక్స్ అవుతుంటారు. కానీ.. అలా చేస్తే  మెగాస్టార్ ఎందుకు అవుతాడు? 150 సినిమాలు చేసినా.. ఇప్పటికీ తాను చేసే ప్రతీ సినిమాను మొదటి సినిమాలో నటిస్తున్న హీరో ఎంతటి దీక్షతో చేస్తాడో.. అలాగే చేస్తాడు చిరంజీవి. అరవై ఐదు సంవత్సరాల వయసులోనూ ఇరవై ఐదు సంవత్సరాల కుర్రాడిలా ఆయన సినిమాపై చూపించే ప్యాషన్ చూసి ఆశ్చర్యపోవడం మిగిలిన వారి వంతవుతోందట. ఇదే విషయాన్ని చక్కగా వర్ణించారు దర్శకుడు శ్రీ రాజ్ మాదిరాజు. ఆంధ్రాపోరి రుషి ఐతే 2.0 చిత్రాలను రూపొందించిన ఈ దర్శకుడు ఫేస్ బుక్‌లో చిరంజీవి అంకిత భావంపై ఓ పోస్టు రాశారు. ఇదిప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

'' చిరంజీవి అని ఇండస్ట్రీకి ఓ కొత్త అబ్బాయొచ్చాడంట. పొద్దున్నే నాలుగున్నరకి లేచి గంటన్నర సేపు జిమ్ లో కసరత్తులు చేస్తున్నాడంట. నిన్ననే ఆచార్య అనే సినిమాకి గుమ్మడికాయ కొట్టేశాడంట. మండే మార్చి ఏప్రిల్ మే ఎండల్లో ఒక సినిమా షూటింగుకి డేట్లు ఇచ్చేశాడంట. జూన్ వొదిలేసి జులై ఆగస్టు సెప్టెంబరు రెండోది అక్టోబరు నుంచి క్రిస్మస్ లోగా మరొకటి షూటింగు ఫినిష్ చేయాలని ప్లానింగట. పారలాల్ గా రైటర్లతో కథాచర్చల్లో.. కూర్చుంటే పన్నెండు పద్నాలుగు గంటలపాటు నాన్ స్టాప్ కొట్టేస్తున్నాడంట. షాటు పూర్తయ్యాక సెట్టులోనే కూర్చొని షాటు కోసం వెయిటింగంట. బాబూ చిరంజీవీ.. నచ్చావోయ్. యేడాదికి మూడు సినిమాల షూటింగ్ అలవోకగా ఫినిష్ చేసి రిలీజు చేయగలిగిన దమ్మున్నోడివి గాబట్టి కాదూ.. అరవై ఐదొచ్చినా.. ఇరవయ్యయిదేళ్లవాడిలా కష్టపడతావని ప్రొఫెషనలిజానికి పెద్దపీట వేస్తావనీ కాదూ.. కథానాయకుడిగానే కాదు కష్టకాలంలో ఇండస్ట్రీకి నాయకుడిలా బై ఎగ్జాంపుల్ ముందుండి నడిపిస్తావని కాదూ.. ఇందుక్కాదూ మెగాస్టారయింది నువ్వు.. ఆచార్యా.. టేకేబౌ ''అంటూ తన పోస్టును ముగించాడు రాజ్ మాదిరాజు. చిరంజీవి అకుంఠిత దీక్షను సినిమా పట్ల అంకిత భావాన్ని ఒక పేరాలో అద్భుతంగా వర్ణించారు మాదిరాజు.