దర్శకేంద్రుడి కోసం చిరు మెగాఫోన్ చేపడతారా?

Mon Aug 02 2021 05:00:01 GMT+0530 (IST)

Chiranjeevi expresses his willingness to direct Raghavendra Rao

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు `పెళ్లి సంద-D` చిత్రంతో నటుడిగా  ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. రాఘవేంద్రరావు శిష్యురాలు రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వశిష్ట అనే పాత్రతో రాఘవేంద్రరావు  నటుడిగా పరిచయం అవుతున్నారు. 100కి పైగా చిత్రాలు తెరకెక్కించిన దర్శకేంద్రుడు నటుడిగా పరిచయం అవ్వడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. నటుడిగా ఆయన పెర్పామెన్స్ ఎలా ఉంటుందో చూడాలన్న క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. ఇటీవలే వశిష్ట పాత్రలో ఆయన లుక్ ని  కూడా యూనిట్ రిలీజ్ చేసింది. ఆయన ఛరిష్మాకు ఎంత మాత్రం తగ్గకుండా లుక్ ఆకట్టుకుంటోంది.తాజాగా ఈ లుక్ మేకోవర్ చూసిన మెగాస్టార్  చిరంజీవి తన మనసులో కోరికను బయట పెట్టారు. దర్శకేంద్రుడి కోసం తానే దర్శకుడిగా మారుతానని ఓ ట్వీట్ చేసారు. 100కి పైగా  సినిమాలు డైరెక్ట్ చేసిన ఆయన్ని నేను మాత్రమే డైరెక్ట్ చేస్తానంటూ ఆసక్తిని కనబరిచారు.పెళ్లి సంద-డిలో కె. రాఘవేంద్రరావు నటిస్తున్నారని వినగానే చాలా ఉత్సాహంగా అనిపించింది. ఆయన్ని బిగ్ స్క్రీన్ లో చూడటానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని అన్నారు. చాలా మందిని స్టార్లుగా మార్చిన ఆయన ఇప్పుడు నటుడిగా మారడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

అనంతరం ఇద్దరి మధ్యా ఆసక్తికర ఫోన్ సంభాషణ జరిగింది. చిరు మాటలకు దర్శకేంద్రుడు నవ్వుతూ స్పందించారు. మెగాస్టార్ సరదాగా స్పందించినా నిజంగా తన ఫేవరెట్ దర్శకుడి కోసం మెగా ఫోన్ పడితే గనుక అది అద్భుతమే అవుతుంది. చిరంజీవికి ఆయన కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోయిన `జగదీక వీరుడు అతిలోక సుందరి`.. `ఘరానా మొగుడు` లాంటి చిత్రాల్ని దర్శకేంద్రుడే అందించారు. నటుడిగా మెగాస్టార్ కెరీర్ ని మరో మెట్టు ఎక్కించిన సినిమాలివి. ఆ అభిమానంతోనే చిరు అంత ఆసక్తిని కనబరిచారన్నమాట.