చిరంజీవి - విజయశాంతి కలిసి నటించబోతున్నారా...?

Sun May 24 2020 22:42:59 GMT+0530 (IST)

Chiranjeevi and Vijay Shanti Share Screen For Lucifer Remake

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి - లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కాంబినేషన్ కి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు 21 సినిమాలు వచ్చాయి. వాటిలో 'పసివాడి ప్రాణం' 'యముడికి మొగుడు' 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు' 'స్వయం కృషి' 'ఛాలెంజ్' 'కొండవీటి రాజా' 'కొండవీటి దొంగ' 'మంచి దొంగ' 'గ్యాంగ్ లీడర్' వంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. చిరంజీవి - విజయశాంతి కలిసి నటించిన ఆఖరి చిత్రం 'మెకానిక్ అల్లుడు'. ఈ తరవాత కాలంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసిన విజయశాంతి రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. మెగాస్టార్ చిరంజీవి కూడా రాజకీయాల్లోకి వెళ్లడంతో కొన్నాళ్లపాటు సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం ఇటు మెగాస్టార్ అటు లేడీ సూపర్ స్టార్ ఇద్దరూ వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చారు.చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150'తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టగా.. విజయశాంతి ‘'సరిలేరు నీకెవ్వరు'తో మళ్లీ మేకప్ వేసుకున్నారు. అంతేకాకుండా 'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వీరిద్దరూ పాల్గొని సందడి చేశారు. అయితే ఇప్పుడు వీరిద్దరూ వెండితెరపై కలిసి కనిపించబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మాట్నీ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'ఆచార్య' సినిమా తర్వాత మెగాస్టార్ మలయాళంలో సూపర్ హిట్ అయిన 'లూసిఫర్' సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు. పొలిటికల్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను కూడా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మించనున్నాడు. ఈ రీమేక్ కు 'సాహో' ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటికే మన నేటివిటీకి తగ్గట్లు తగినన్ని మార్పులు చేస్తున్నాడట సుజీత్.

ఇదిలా ఉండగా అయితే 'లూసిఫర్' సినిమాలో మంజు వారియర్ పాత్ర కూడా కీలకమైనదే. కాగా తెలుగు వర్షన్ లో ఆ పాత్రలో విజయశాంతి నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఇదే కనుక నిజమైతే ఎన్నో ఏళ్ళ తర్వాత ఈ జంట మరోసారి సిల్వర్ స్క్రీన్ పై ఒకే సినిమాలో కనిపించనున్నారన్నమాట. కాగా తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా లూసిఫర్ స్క్రిప్ట్ లో మెగాస్టార్ కొన్ని కీలకమైన మార్పులను సూచించాడని సమాచారం. అయితే సుజీత్ ఆ మార్పులను పూర్తి చేసి చిరుకి స్క్రిప్ట్ వినిపించాడని.. ఫైనల్ గా చిరు కూడా స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ముఖ్యంగా హీరోయిజమ్ ఎలివేషన్స్ ఉన్న సన్నివేశాలు సినిమాలోనే మెయిన్ హైలైట్ గా నిలుస్తాయని.. మెగా ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ ని ఇచ్చేలా ఉండబోతున్నాయని సమాచారం.