మేనల్లుడి సినిమాకు మెగా సర్టిఫికేట్!

Mon Apr 15 2019 14:03:04 GMT+0530 (IST)

Chiranjeevi Review on Sai Dharam Tej Chitralahari Movie

కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా తెరకెక్కిన 'చిత్రలహరి' ఏప్రిల్ 12 న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.   కళ్యాణి ప్రియదర్శన్.. నివేద పేతురాజ్ లు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు.  పాజిటివ్ టాక్ తో రన్ అవుతున్న ఈ సినిమా తేజుకు రిలీఫ్ ఇచ్చేలానే ఉంది. రీసెంట్ గా ఈ సినిమా గురించి మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.ఈ సినిమాలో తండ్రికొడుకుల అనుబంధం చక్కగా చూపించారని.. యువతకు మంచి మెసేజ్ ఉందని తెలిపారు చిరంజీవి.  జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనా..ఓటమి బారిన పడినా మన లక్ష్యం కోసం కష్టపడుతూ ధైర్యంగా ముందుకెళ్తే ఏదైనా సాధించగలమని ఈ సినిమాలో చూపించారు. ఇలాంటి మంచి మెసేజ్ తో దర్శకుడు కిషోర్ తిరుమల చిత్రలహరి ని చక్కగా తీర్చిదిద్దారని..  సాయి తేజ్ కూడా మెచ్యూరిటీ తో కూడిన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడని తెలిపారు.  ఈ సినిమాలో పోసాని.. సునీల్ పాత్రలు కూడా చక్కగా కుదిరాయని అన్నారు. దేవీ శ్రీప్రసాద్ మరో సారి తన పాటలతో.. నేపథ్య సంగీతంతో సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చాడని అన్నారు.  నిర్మాతలు నవీన్.. రవి శంకర్.. మోహన్ మరోసారి తమ బ్యానర్ ఇమేజ్ తగ్గకుండా మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారని మెచ్చుకున్నారు.

 'చిత్రలహరి' సమ్మర్ హాలిడేస్ లో అందరూ చూడదగ్గ సినిమా అని అభిప్రాయపడ్డారు. విజయం సాధించిన సందర్భంగా 'చిత్రలహరి' టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు.  మొత్తానికి మేనల్లుడికి మెగాస్టార్ సర్టిఫికేట్ వచ్చేసిందన్నమాట.  మెగా సర్టిఫికేట్ మాత్రమే కాకుండా సినిమా ఫుల్ రన్ లో బయ్యర్లను కూడా లాభాలతో ఖుషీ చేస్తే నిజంగానే తేజుకు పెద్ద రిలీఫ్ వస్తుంది.