Begin typing your search above and press return to search.

'డైరెక్టర్ చెప్పిందే మేం చేశాం'.. 'ఆచార్య' ప్లాప్ పై చిరు వ్యాఖ్యలు..!

By:  Tupaki Desk   |   1 Oct 2022 10:49 AM GMT
డైరెక్టర్ చెప్పిందే మేం చేశాం.. ఆచార్య ప్లాప్ పై చిరు వ్యాఖ్యలు..!
X
మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారిగా పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా ''ఆచార్య''. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. సాదారణ ప్రేక్షకులనే కాదు.. మెగా డ్యాన్స్ ని కూడా ఈ సినిమా నిరాశ పరిచింది. అయితే ఈ సినిమా పరాజయం తనని బాధించలేదని చిరంజీవి తెలిపారు.

'గాడ్ ఫాదర్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా 'ఆచార్య' పరాజయంపై పెదవి విప్పారు. అది దర్శకుడి ఛాయిస్ అని.. అతను చెప్పిందే చేశామని.. ఆ ఫెయిల్యూర్ తనపై ఏమాత్రం ప్రభావం చూపదని మెగాస్టార్ పేర్కొన్నారు.

చిరంజీవి మాట్లాడుతూ.. "కెరీర్ ప్రారంభంలో సక్సెస్ వచ్చినప్పుడు బాగా ఆనందించేవాడిని.. పరాజయం వస్తే బాధపడేవాడిని. కానీ ఆ రోజులు గడిచిపోయాయి. మొదటి 15 ఏళ్లలోనే ఎన్నో ఎదుర్కొన్నాను. మానసికంగా, శారీరకంగా అన్నింటినీ తట్టుకోవడం నేర్చుకున్నాను. నటుడిగా పరిణతి చెందిన తర్వాత.. సినిమాలు పరాజయాలు నన్నెప్పుడూ బాధ పెట్టలేదు. అలానే విజయాన్ని తలకెక్కించుకోలేదు" అని అన్నారు.

"సినిమా రిజల్ట్ అనేది ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు. కానీ మన వర్క్ లో మనం బెస్ట్ ఇస్తాం. 'ఆచార్య' వైఫల్యం నాపై ఏమాత్రం ప్రభావం చూపదు. ఎందుకంటే అది డైరెక్టర్ ఛాయిస్. ఆయన ఏది చెబితే అది చేశాం. చరణ్ విషయంలో కూడా అదే జరుగుతుంది. అతనిని కూడా ఆ ఫెయిల్యూర్ పెద్దగా ప్రభావితం చేయదు. చరణ్ చాలా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. సినిమా రిజల్ట్ తన చేతిలో ఉండదని తనకి తెలుసు''

''ఈ సినిమా విషయంలో ఉన్న ఒకే ఒక్క విచారం ఏంటంటే.. అది చరణ్ నేను కలిసి మొదటిసారి చేసిన సినిమా.. పరాజయం పాలైంది. ఒకవేళ భవిష్యత్తులో మేమిద్దరం మళ్లీ కలిసి నటించే అవకాశం వచ్చినా.. అంతటి జోష్ ఉండకపోవచ్చు. అంతకు మించి ఎలాంటి బాధ లేదు" అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

ధర్మం - ధర్మస్థలి - పాదఘట్టం అనే అంశాలతో 'ఆచార్య' చిత్రాన్ని తెరకెక్కించారు కొరటాల శివ. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మ్యాట్రీ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. భారీ రేట్లకు అమ్ముడుపోయిన ఈ సినిమా బయ్యర్లు అదే స్థాయిలో నష్టాలను మిగిల్చింది. అంతేకాదు దర్శక హీరోలపై సోషల్ మీడియాలో నెగెటివిటీ వచ్చేలా చేసింది.

'ఆచార్య' సినిమా ప్లాప్ అవ్వడంతో అన్ని వ్యవహారాలు దగ్గరుండి చూసుకున్న దర్శకుడు కొరటాల శివ ను ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినట్లు రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు చిరంజీవి ఈ మూవీ రిజల్ట్ కు కొరటాలే బాధ్యుడు అనే విధంగా మాట్లాడుతున్నారు. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

సినిమా హిట్ అయితే ఇలానే మాట్లాడేవారా అని ప్రశ్నిస్తున్నారు. కథ ఓకే చేసి ఉండకపోతే అసలు ఈ ప్రాజెక్ట్ ఉండేది కాదు కదా?.. ఈ సినిమా కార్యరూపం దాల్చడానికి కారణమైన హీరోలు కూడా బాధ్యులే కదా? అని కామెంట్ చేస్తున్నారు. ప్లాప్ ని దర్శకుడు ఒక్కడికే ఆపాదించడం సబబు కాదని అంటున్నారు.

ఇకపోతే కొరటాల శివ తన తదుపరి చిత్రాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేయబోతున్నారు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించబడిన ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందనే విషయంలో క్లారిటీ రావడం లేదు. మరోవైపు చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' సినిమా రిలీజ్ కు రెడీ అయింది. అక్టోబర్ 5న తెలుగు హిందీ మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.